New Delhi, August 19: ఆగస్టు చివరినాటికి అన్‌లాక్ 3.0 (Unlock 3) ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ 4.0లో (Unlock 4) కొన్నింటికి సడలింపులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అన్‌లాక్ 4.0లో భాగంగా దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయనే (Cinema Halls Likely to be Reopen) వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అన్‌లాక్ దశలో భాగంగా రెస్టారెంట్లు, మాల్స్, జిమ్, యోగా కేంద్రాలకు ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్ ( India Lockdown) ప్రకటించినప్పటి నుంచి సినిమా హాళ్లు మూతపడటంతో చిత్రపరిశ్రమకు (Film Industry) భారీ నష్టం వాటిల్లింది.
ఈ నేపథ్యంలో సామాజిక దూరం, శానిటైజేషన్ వంటి నిబంధనలు పాటిస్తూ సినిమా హాళ్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించే అవకాశం ఉందని తెలుస్తోంది. సీట్ల మధ్య దూరం, సిటింగ్ సామర్థ్యం వంటి వాటిపై ప్రభుత్వం త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేయనుందని సమాచారం. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా టెంపరేచర్ కెపాసిటీ కూడా 24 డిగ్రీలు ఉండేలా దిశానిర్దేశం చేయనుందని తెలుస్తోంది. ఇప్పటికే 3డీ సినిమాలకు స్పెషల్ కళ్లజోడు ఉపయోగిస్తుండగా, ప్రస్తుతం సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకులు మాస్క్ ధరించాలన్న నిబంధన కూడా ఉండనుంది. అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర హోం శాఖ
ఇప్పటికే అన్‌లాక్‌లో భాగంగా జిమ్‌లు, యోగా కేంద్రాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చినందున సినిమా హాళ్లు కూడా తెరిచేందుకు ప్రభుత్వం అనుతివ్వాలని పలు థియేటర్ యాజమాన్యాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలో ప్రతి స్క్రీనింగ్ తర్వాత సినిమా హాల్ ప్రాంగణాన్ని పూర్తిగా శానిటైజ్ చేయడం వంటి నిబంధనలతో అనుమతించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే అన్‌లాక్ 3.0లో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో హోటళ్లు, మార్కెట్ల పునరుద్ధరణకు అనుమతించారు. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ అధ్యక్షతన బుధవారం జరిగిన ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (డీడీఎంఏ) భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రయోగాత్మకంగా కోవిడ్-19 నిబంధనలతో వారాంతపు సంతలను అనుమతిస్తామని డీడీఎంఏ పేర్కొంది. జిమ్‌లను తెరిచేందుకు మాత్రం అనుమతించలేదు. దేశ రాజధానిలో కరోనా వైరస్ నెమ్మదించిన క్రమంలో హోటళ్లు, జిమ్‌లు, వారాంతపు సంతలను అనుమతించాలని ఢిల్లీ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జీ) అనిల్ బైజల్‌కు ప్రతిపాదనలు పంపింది.
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్‌లాక్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఢిల్లీలో హోటళ్లు, మార్కెట్లను అనుమతిస్తూ నిర్ణయం తీసుకునే హక్కు తమకుందని ఆప్ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్‌కు పంపిన ప్రతిపాదనలో పేర్కొంది. ఢిల్లీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గడంతో నగర ప్రజలను వారి జీవనోపాధికి దూరంగా ఎందుకు ఉంచాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌జీని కోరింది