Pratapgarh, June 7: పెళ్లి జరుగుతున్న వేళ వరుడు తప్పతాగడంత వధువు పెళ్లినే క్యాన్సిల్ చేసుకుంది. సరిగ్గా మూడు ముళ్లు వేసే సమయానికి పెళ్లి మండపంలో ఉండాల్సిన వరుడు.. వేదిక ద్వారం వద్ద మద్యం మత్తులో స్నేహితులతో తూలుతూ డ్యాన్స్ వేస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించిన వధువు తక్షణమే ఈ పెళ్లి తనకు వద్దని (Bride Calls Off Wedding in Pratapgarh) విరమించుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో వెలుగు చూసింది.
ఈ ఘటన వివరాల్లోకెళితే.. యూపిలోని ప్రతాప్‌ఘడ్ జిల్లాలో గల ఓ గ్రామంలో రవీంద్ర పటేల్‌తో ఓ రైతు తన బిడ్డ వివాహాన్ని కుదిర్చాడు. అయితే ముహుర్తం సమయం కంటే ముందు వధూవరులు కలిసి వేదిక వద్దకు వస్తున్న సమయంలో.. వరుడు తన స్నేహితులతో కలిసి పీకల దాకా మద్యం సేవించాడు. వధువుతో అసభ్యకరంగా ('Drunk' Groom And 'Baraatis' Misbehave With Her) ప్రవర్తించాడు. తన స్నేహితులతో కలిసి డ్యాన్స్ వేయాలని బలవంతం చేశాడు. అంతే కాకుండా వధువును వేదిక మీదకు లాగి మరీ డ్యాన్స్ వేయాలని ఒత్తిడి చేశాడు. దీంతో తనకు ఈ పెళ్లి వద్దని, తాము ఇచ్చిన కట్నం, ఆభరణాలు తిరిగి ఇవ్వాలని వధువు డిమాండ్ చేసింది.
ఇందుకు వరుడి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. పోలీసులు రెండు కుటుంబాల మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నించారు, కాని వధువు మనసు మార్చుకోవడానికి నిరాకరించింది.చివరకు పోలీసుల జోక్యంతో కట్నకానుకలు వధువు కుటుంబానికి తిరిగి ఇచ్చారు. దీంతో ఆ పెళ్లి ఆగిపోయింది.
స్టేషన్ హౌస్ ఆఫీసర్ (మంధట) శ్రావన్ కుమార్ సింగ్ విలేకరులతో ఇలా అన్నారు: "వరుడి కుటుంబ సభ్యులు వివాహాన్ని నిర్ణయించేటప్పుడు తీసుకున్న బహుమతి వస్తువులు మరియు నగదును తిరిగి ఇస్తామని హామీ ఇచ్చిన తరువాత మాత్రమే ఈ విషయం పరిష్కరించబడింది. వధువు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. వరుడు మరియు అతని స్నేహితులు మద్యం ప్రభావంతో వధువు మరియు ఆమె కుటుంబ సభ్యులతో వ్యంగ్యంగా మాట్లాడటం కొనసాగించారని, పెళ్లిని విరమించుకోవడం తప్ప మాకు వేరే మార్గం లేదని చెప్పారు.