Vjy, Nov 20: ఈ నెల 23వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది క్రమంగా వాయుగుండంగా బలపడొచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది తమిళనాడు, శ్రీలంక తీరాలవైపు కదిలే అవకాశముందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో రెండు రోజులు భారీ వర్షాలు కురవనున్నట్లు అధికారులు తెలిపారు.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపిన వివరాల ప్రకారం..నవంబర్ 21వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాలలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని.. ఈ ఆవర్తనం పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి నవంబర్ 23 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపారు.
ఈ నెల 26 తర్వాత దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో..ఈ నెల 27, 28వ తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పుగాలుల ప్రభావంతో రాయలసీమ, కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో రాయలసీమలో పలుచోట్ల, దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణశాఖ తెలిపింది.సముద్రంలోకి చేపలవేటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.