Brij Bhushan Sharan Singh FIR: మహిళా రెజ్లర్లను బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్(Brij Bhushan) లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ కన్నాట్ పోలీసు స్టేషన్‌లో నమోదు అయిన ఎఫ్ఐఆర్ వివరాలు కొన్ని బయటకు వచ్చాయి.మహిళా అథ్లెట్లను అసభ్యంగా తాకుతూ.. లైంగికంగా వేధించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. ఒకవైపు ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుండగా.. ఆ ఎఫ్‌ఐఆర్ కాపీల్లో సారాంశం ఇప్పుడు బయటకు వచ్చింది.
మొత్తం ఏడుగురు మహిళా రెజ్లర్ల ఫిర్యాదు మేరకు ఢిల్లీ కన్నౌట్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌లో కిందటి నెలలో ఫిర్యాదులు నమోదు అయ్యాయి. అందులో ఆరుగురి ఫిర్యాదుతో ఒక ఎఫ్‌ఐఆర్, మైనర్ తండ్రి ఫిర్యాదు మేరకు మరో ఎఫ్‌ఐఆర్‌ను పోలీసులు ఫైల్ చేశారు. ఏప్రిల్ 21వ తేదీన ఫిర్యాదులు అందగా.. వారం తర్వాత వాటిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. హిళా అథ్లెట్లను అసంబద్ధ రీతిలో తాకినట్లు బ్రిజ్‌పై ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. అథ్లెట్ల శ్వాసను చెక్ చేయాలన్న ఉద్దేశంతో.. ఆయన ఆ అథ్లెట్లను అనుచిత రీతిలో తడిమినట్లు ఆరోపణలు ఉన్నాయి. అథ్లెట్లను పరీక్షిస్తున్న సమయంలో సంబంధం లేని ప్రశ్నలు వేసినట్లు పేర్కొన్నారు.
ఏదైనా టోర్నీ సమయంలో గాయపడితే, వారి ట్రీట్మెంట్ ఖర్చు భరించేందుకు తమ లైంగిక వాంఛలు తీర్చాలని కోరినట్లు కూడా బ్రిజ్‌పై ఆరోపణలు ఉన్నాయి. డైటీషియన్ కానీ కోచ్ కానీ ఆమోదం ఇవ్వనటువంటి ఆహారాన్ని తీసుకోవాలని కూడా సూచించినట్లు తెలుస్తోంది. అన్నింటికీ మించి మైనర్ వెంటపడడంతో పాటు ఆమెను లైంగికంగా తాకుతూ వేధించడం లాంటి నిందారోపణలను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఓ మైనర్ అథ్లెట్ వక్షోజాలను తన చేతులతో తడిమినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ అథ్లెట్‌ను వెంబడించినట్లు కూడా ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
ఆరోజు నేను శిక్షణలో భాగంగా మ్యాట్ మీద పడుకుని ఉన్నాను. నిందితుడు(బ్రిజ్) నా దగ్గరకు వచ్చాడు. అతని ప్రవర్తన నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ టైంలో నా కోచ్ అక్కడ లేరు. నా అనుమతి లేకుండా నా టీషర్ట్‌ను కిందకు లాగేశాడు. నా వక్షోజాలపై చెయ్యి వేశాడు. ఆ చెయ్యిని అలాగే కడుపు మీదకు పోనిచ్చి.. నా శ్వాసను పరీక్షిస్తున్న వంకతో నన్ను వేధించాడని అవార్డు సాధించిన ఓ రెజ్లర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మిగతా ఆరుగురి ఫిర్యాదులన్నీ దాదాపు పైతరహాలో ఉండడం గమనార్హం.
తన భుజాలు, మోకాళ్లు, అరచేతులను సింగ్ అనుచితంగా ముట్టుకున్నారని మరో రెజ్లర్ ఆరోపించారు. తన శ్వాస తీరును తెలుసుకునే నెపంతో తన ఛాతీని, పొట్టను అనుచితంగా ముట్టుకున్నట్లు తెలిపారు.తనను కౌగిలించుకుని, తనకు లంచం ఇవ్వజూపారని మరో రెజ్లర్ ఆరోపించారు. తాను వరుసలో నిల్చున్నపుడు తనను అనుచితంగా ముట్టుకున్నారని మరో రెజ్లర్ ఆరోపించారు.ఫొటో తీసుకుందామంటూ తనను బలవంతంగా గట్టిగా హగ్ చేసుకున్నారని మరో రెజర్ల్ ఆరోపించింది.
బ్రిజ్ నుంచి తప్పించుకునేందుకు మహిళా అథ్లెట్లు తమ రూమ్‌ల నుంచి అంతా గ్రూప్‌గా బయటకు వెళ్లేవారని, లేదంటే ఒంటర్ని చేసి అనుచిత ప్రశ్నలు వేసేవాడని బ్రిజ్‌పై ఆరోపించారు. రెజ్లింగ్ సమాఖ్య కార్యదర్శి వినోద్ తోమర్ కూడా వేధించినట్లు రెజ్లర్లు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్రిజ్‌పై మొత్తం రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 353, 354ఏ, 354డీ, 34 కింద ఫిర్యాదులు నమోదు అయ్యాయి. మైనర్ అథ్లెట్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోక్సోలోని సెక్షన్ 10 కింది కేసు రాశారు.
బ్రిజ్ భూషణ్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. బుధవారం దీనిపై ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఒక్క ఆరోపణ ప్రూవ్ అయినా తాను ఉరివేసుకోనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.
రైతు సంఘాల మద్దతు
బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొంటున్న రెజ్లర్లకు రైతు సంఘాలు మద్దతు పలికాయి. ఉత్తర ప్రదేశ్‌లో ఖాప్ పంచాయతీని నిర్వహించాయి. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో గురువారం నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ సమీపంలోని సోరం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో భారతీయ కిసాన్ యూనియన్ లీడర్ రాకేశ్ తికాయత్ మాట్లాడుతూ, తాము రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి, వినతి పత్రం సమర్పిస్తామన్నారు. తదుపరి చర్యలను నిర్ణయించడం కోసం శుక్రవారం హర్యానాలోని కురుక్షేత్రలో మహా పంచాయతీని నిర్వహిస్తామన్నారు.