Vjy, Nov 20: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీలో జరుగుతున్న తాజా పరిస్థితులపై వైఎస్ జగన్ మాట్లాడారు. చంద్రబాబు అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నారని... ఆయనలో ఎప్పటికీ మార్పు రాదని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు అబద్ధాలనే నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
మా కుటుంబంలో విభేదాలు ఉన్నాయి... మీకూ కుటుంబం ఉంది కదా... తల్లి, చెల్లి పేరుతో రాజకీయం ఎందుకు చేస్తున్నారు? అని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన సోదరి షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించలేదా? అని ప్రశ్నించారు. ఐటీడీపీ పేరుతో తన కుటుంబంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనపై, తన తల్లిపై, తన చెల్లిపై అసభ్య పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్రా రవీందర్ రెడ్డి పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేశారని ఆరోపించారు. షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించలేదా? అని వైఎస్ జగన్ వివరించారు.
ఈ సందర్భంగా చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు ఎప్పుడైనా తన తల్లిదండ్రులను ప్రజలకు చూపించాడా? అని జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు లేదన్నారు. రాజకీయంగా ఎదిగిన తర్వాత ఆయన తన తల్లిదండ్రులతో కలిసి ఉన్నారా? కనీసం వారికి రెండు పూటలు భోజనం పెట్టి వారిని సంతోషంగా ఇంటికి పంపించారా? వారు చనిపోతే కనీసం తలకొరివి పెట్టాడా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. రాజకీయాల కోసం చంద్రబాబు ఏమైనా చేస్తాడని, ఏ గడ్డి అయినా తింటాడని, ఏ అబద్ధమైనా ఆడుతాడని, ఏ మోసమైనా చేస్తాడని ధ్వజమెత్తారు.
ఉదయ్ భూషణ్ అనే ఐ-టీడీపీ కార్యకర్తతో నా కుటుంబాన్ని తిట్టించారు. ఫిబ్రవరిలో ఉదయ్ భూషణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయించారు. రామ్ గోపాల్ వర్మపై కూడా తప్పుడు కేసులు పెట్టారు. సెన్సార్ బోర్డ్ అనుమతితోనే సినిమాలు రిలీజ్ చేశారు. వర్మకు సెన్సార్ బోర్డ్ అనుమతి ఉంది. చంద్రబాబు ఎల్లో బ్యాచ్ ఏ సినిమాలైనా తీయొచ్చా?’’
‘‘న్యాయం కోసం ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. దళితుడు మాజీ ఎంపీ, నందిగం సురేష్ మీద కేసులు మీద కేసులు పెట్టారు. నందిగం సురేష్ 70 రోజులుగా జైల్లోనే ఉన్నారు. ప్రశ్నించిన దళిత ఎమ్మెల్యే చంద్రశేఖర్‌పై 8 కేసులు పెట్టారు. ఎక్కడ ఫిర్యాదులు వచ్చినా వారిని అక్కడే అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. వారిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. వీడియోలు తీసి పై వాళ్లకు పంపిస్తున్నారు. కళ్లకు గంతలు కట్టి పీఎస్‌లకు మారుస్తున్నారు. అరెస్టైన వారు జడ్జీల దగ్గర దెబ్బలు చూపిస్తున్నారు’’ అని వైఎస్ జగన్ వివరించారు.
చంద్రబాబు మరో పదేళ్లు సీఎంగా ఉంటారన్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా... ఎవరు సీఎంగా ఉంటారనే విషయం వారు చేసే మంచి పనుల మీద ఆధారపడి ఉంటుందన్నారు. పనులు చేసినవారిని ప్రజలు ఆశీర్వదిస్తారని అభిప్రాయపడ్డారు.