New Delhi, October 21: కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ త్వరలో శుభవార్తను అందించబోతోంది. ఇకపై మీరు నేరుగా డీజిల్, పెట్రోల్ కోసం పెట్రోలు బంకులు చుట్టూ తిరగకుండా మీ ఇంటికే నేరుగా అవి వచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు పెట్రోలియం ఎక్స్ ప్లోజివ్స్ భద్రతా విభాగం (PESO)తో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. దీని కోసం త్వరలో యాప్ కూడా రెడీ అవుతోంది. అయితే ఇది కేవలం మెట్రో నగరాలకే మాత్రమే పరిమితం కానుందని సమాచారం. పల్లెలకు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. 2020 జనవరి నుంచి ప్రయోగాత్మకంగా ఈ పద్ధతిని అమలు చేయాలని భావిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
కాగా వినియోగదారులకు నేరుగా డీజిల్ అందించేందుకు చమురు సంస్థలు ఒక యాప్‌ను కూడా రెడీ చేశాయి. ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని డీజిల్ కావాల్సి వచ్చినప్పుడు తన పేరు, చిరునామా తదితర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అంతే డీజిల్ ట్యాంకర్ సంబంధిత వినియోగదారుడి ఇంటి ముందు ఆగుతుంది. డీజిల్ పోయగానే డబ్బును యాప్ ద్వారా చెల్లించే సౌకర్యం కూడా కల్పించారు. ఎంతకావాలంటే అంత ఆర్డర్ చేసుకుని ప్రయాణం చేసేయొచ్చు.
ఇప్పటికే కొన్ని పట్టణాల్లో డీజిల్ ని చమురు కంపెనీలు డోర్ డెలివరీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో 20 నగరాలకుఈ సేవలను విస్తరించాలని హిందూస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వంటి సంస్థలు నిర్ణయించాయి.ఇందులో భాగంగా పెట్రోలును కూడా డోర్ డెలివరీ ద్వారా వినియోగదారులకు అందించాలని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయించాయి. కాగా ఇప్పటి వరకు ఒక్క డీజిల్‌కు మాత్రమే డోర్ డెలివరీకి అనుమతులున్నాయి. అయితే, త్వరలోనే పెట్రోలు కూడా పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పెసో) అనుమతులు వస్తాయని హెచ్‌పీసీఎల్ చైర్మన్ ఎం.కె.సురానా ఇటీవల పేర్కొన్నారు.
ముంబై లాంటి నగరాల్లో నెలకు 150 కిలో లీటర్ల డీజిల్‌ను డోర్ డెలివరీ చేస్తున్నారు. అయితే, 2 వేల లీటర్లకు మించి పెట్రోలు డోర్ డెలివరీ చేయాలంటే పెసో అనుమతి తప్పనిసరి. కాబట్టి దాని అనుమతుల కోసం సంస్థలు ఎదురుచూస్తున్నాయి. అనుమతులు రాగానే డోల్ డెలివరీని ప్రారంభించనున్నాయి. ఇందుకోసం వాహనాలను కూడా సిద్ధం చేసుకుంటున్నాయి.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డోర్‌స్టెప్ డెలివరీ ఆఫ్ ఫ్యూయెల్' పేరుతో మహారాష్ట్రలోని పూణె, చెన్నైవంటి నగరాల్లో ఈ సేవలను ఇప్పటికే ప్రారంభించింది. ఐఓసీ వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఉండే ఫ్యూయెల్ డిస్పెన్సర్‌లాగానే దానికి డీజిల్ డిస్పెన్సర్ ఉంటుంది. ఆ వాహనం రోడ్లపై తిరుగుతూ డీజిల్ సరఫరా చేస్తూ ఉంటుంది. అత్యవసర సమయాల్లోనూ ఈ వాహనం అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు మొబైల్ యాప్ ద్వారా డీజిల్ ఆర్డర్ చేస్తే ఈ వాహనం వచ్చి డెలివరీ చేస్తుంది.