Post-TSRTC Strike Tussle: కార్మిక సంఘాల నేతలకు డ్యూటీ రిలీఫ్ రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం, 'చిల్లర చర్య' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్టీసీ యూనియన్ లీడర్ అశ్వత్థామ రెడ్డి
Post TSRTC Strike stir- Image used for representational purpose. | File Photo

Hyderabad, November 29: గురువారం కేబినేట్ మీటింగ్ అనంతరం, సీఎం కేసీఆర్ (CM KCR) ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం నుంచి ఆర్టీసీ కార్మికులంతా ఉల్లాసంగా, ఉద్వేగంగా విధులకు హాజరయ్యారు. అయితే సమయంలో ఆర్టీసీ యూనియన్ల (RTC Unions)పై సీఎం కన్నెర్ర జేశారు. కార్మిక సంఘాల నేతలకు డ్యూటీ రిలీఫ్ (Duty Relief) రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వారు కూడా విధుల్లోకి హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. గతంలో కార్మిక సంఘాల నేతలకు విధులకు హాజరుకావడం నుంచి మినహాయింపు ఉండేది. కార్మికుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి వీలుగా ఉండేందుకు యూనియన్ నేతలు విధులకు హాజరుకాకపోయినా జీతాలు వచ్చేవి. జిల్లా, డిపో స్థాయిల్లోనూ ఈ మినహాయింపు ఉండేది. అయితే ఇప్పుడు వారి ఆఫీసులకు తాళాలు వేసేశారు. ఎవరైనా సరే హాజరు కావాల్సిందేనంటూ ఆదేశాలు జారీ అయ్యాయి.

దీనిపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి (Ashwatthama Reddy) స్పందించారు. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నేతల డ్యూటీ రిలీఫ్ తొలగించడం అనేది చిల్లర చర్యగా పేర్కొన్నారు. చట్ట ప్రకారం నేతలకు కొన్ని మినహాయింపులు ఉంటాయి, డ్యూటీ రిలీఫ్ రద్దు సరికాదు, దీనిపై లేబర్ కమిషనర్ స్పందించాలని అన్నారు.

దశాబ్దాలుగా యూనియన్లు ఉన్నాయి, ఎన్నో కార్మిక సంఘాలు తెలంగాణ కోసం ముందుండి పోరాడాయి. యూనియన్లు ఉండాలా? లేదా అని లేబర్ కోర్టు తేలుస్తుందని అశ్వత్థామ రెడ్డి తెలుపారు. తమకూ యూనియన్లు నడపాలని సోకు లేదని కార్మికులతో రెఫరెండం పెట్టి యూనియన్లు ఉండాలా లేదా తేల్చండని ప్రభుత్వానికి సూచించారు. కార్మిక సంఘాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఆర్టీసీని అధికారులు ఇష్టం వచ్చినట్లు దోచుకున్నారు. సంస్థను కాపాడుకోవడం కోసమే ప్రతిపక్షాలతో కలిసి పోరాటం చేశామన్నారు. ఆర్టీసీ చరిత్రలో ఇదొక చారిత్రాత్మక సమ్మెగా అశ్వత్థామ రెడ్డి తెలిపారు.

ఇక ఆర్టీసీ కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకోవడాన్ని మరియు చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు అశ్వత్థామ రెడ్డి తెలిపారు. అలాగే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, జీతాలు చెల్లించాలని, పీఎఫ్ వర్తింపజేయాలని కోరారు.