Arvind Kejriwal Arrested (photo-PTI)

New Delhi, April 15: లిక్కర్‌ స్కాం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తన అరెస్టును సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్‌లో సుప్రీంకోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది. అయితే మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎంకు సత్వర ఉపశమనం కల్పించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ నెల 24లోగా సమాధానం ఇవ్వాలంటూ ఈడీకి నోటీసులు జారీ చేసింది.

ఈడీ సమాధానంపై ఏప్రిల్ 27 వరకు రిజాయిన్డెర్ దాఖలు చేయాలని కేజ్రీవాల్‌కు తరఫు న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 29కి వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో అరవింద్‌ కేజ్రీవాల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపంకర్ దత్త ధర్మాసనం విచారణ జరిపింది. మద్యం పాలసీ కేసు.. ఎమ్మెల్సీ కవితకు ఈ నెల 23 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని ఆరోపించారు. కేసు తదుపరి విచారణను వేగవంతం చేయాలని కోరారు. అయితే ఈ నెల 29లోపు విచారణ జరపలేమని కోర్టు తెలిపింది. ఈ నెల 19న విచారణకు జాబితా చేయాలని కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాది కోరగా.. ధర్మాసనం ఇందుకు నిరాకరిస్తూ 29న విచారణకు జాబితా చేసింది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చట్ట బద్దంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగిందని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏప్రిల్ 10న సుప్రీంకోర్టును కేజ్రీవాల్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఉపశమనం కల్పించేందుకు కోర్టు నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం పాలసీ కేసులో మార్చి 21న అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్‌ కస్టడీలో తిహార్‌ జైలులో ఉన్నారు.