New Delhi, April 7: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికల పోలింగ్ (Assembly Elections 2021) ముగిసింది. మంగళవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. ఈ క్రమంలో అత్యధికంగా ఈశాన్య రాష్ట్రం అసోంలో పోలింగ్ నమోదవగా, అత్యల్పంగా తమిళనాడులో పోలింగ్ జరిగింది. తమిళనాడులో 234, కేరళలో 140, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ ముగిసింది.
అసోంలో 40 స్థానాలకు మూడు దశల్లో పోలింగ్ జరగ్గా మంగళవారంతో పూర్తయ్యింది. పశ్చిమబెంగాల్‌లో మూడో దశ పోలింగ్ జరిగింది. అసోంలో చివరి దశ పోలింగ్‌లో భారీగా ఓటింగ్ నమోదైంది. నేటితో మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు ముగియగా ఒక్క పశ్చిమబెంగాల్‌లో మాత్రం ఎన్నికలు కొనసాగనున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 8 దశల్లో పోలింగ్ జరుగుతుండగా మంగళవారంతో మూడు దశలు పూర్తయ్యింది. ఇక ఏప్రిల్ 10, 17, 22, 26, 29 తేదీల్లో మలి విడతల్లో పోలింగ్ జరగనుంది.
చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్టు ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. కేరళలో 74%, తమిళనాడులో 65.68%, పుదుచ్చేరిలో 80.67%, అస్సాం: 82.29 శాతం, పశ్చిమ బెంగాల్: 77.68 శాతం పోలింగ్ నమోదైనట్టు తెలిపింది.
తమిళనాడులో చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు (Tamil nadu Assembly Elections 2021) ప్రశాంతంగా జరిగాయి. అన్నాడీఎంకే అగ్రనేతలు పళనిస్వామి, పన్నీర్‌సెల్వం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తదితర ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా నమక్కల్‌లో 70.79 శాతం, అత్యల్పంగా తిరునల్వేలిలో 50.05 శాతం పోలింగ్ నమోదైంది. డీఎంకే అభ్యర్థి ఉదయనిధి స్టాలిన్ తన పార్టీ గుర్తు ఉన్న చొక్కాను ధరించి ఓటు వేశారని ఈసీకి అన్నాడీఎంకే ఫిర్యాదు చేసింది. హ్యాట్రిక్ విజయం కోసం అన్నాడీఎంకే ఉవ్విళ్లూరుతుండగా, ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని డీఎంకే పట్టుదలతో ఉన్నది.
చెన్నైలో తమిళ హీరో విజయ్ సైకిల్‌పై వచ్చి ఓటేశారు. మోదీ హయాంలో పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచటంపై విజయ్ తన నిరసనను ఇలా తెలియజేశారన్న వ్యాఖ్యలు వినిపించాయి.తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళి సై సౌందర్‌రాజన్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెన్త్నెలోని విరుగంబక్కంలోని పోలింగ్‌కేంద్రంలో ఆమె ఓటు వేశారు. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో శక్తివంతమైన ఆయుధమని, దానిని ఉపయోగించుకుని మంచి పాలకులను ఎంచుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
చెన్నైలోని తిరువన్మియూర్ ప్రాంతంలోని పోలింగ్ స్టేషన్‌లో ప్రముఖ తమిళ నటుడు అజిత్, ఆయన భార్య షాలిని ఓటు హక్కును వినియోగించుకున్నారు. అజిత్‌తో సెల్ఫీకి ఓ అభిమాని ముందుకొచ్చాడు. అతడి ముఖానికి మాస్కు లేకపోవటంతో కోపంతో అతడి మొబైల్‌ను లాక్కొన్నారు. కొంత సేపటి తర్వాత ఫోన్‌ను తిరిగి ఇచ్చేశారు.
ఇక కేరళలో పలుచోట్ల స్వల్ప ఘర్షణలు (Kerala Assembly Elections 2021) చోటుచేసుకున్నాయి. కట్టయికోనంలో సీపీఎం, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ తలెత్తింది. నలుగురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. పతినంతిట్టలో క్యూలో నిల్చున్న ఇద్దరు ఓటర్లు కుప్పకూలి మరణించారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో (uducherry Assembly Elections 2021) 80.67 శాతం పోలింగ్ నమోదైంది. ఏఐఎన్నార్సీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి, కాంగ్రెస్ నేతృత్వంలోని లౌకిక ప్రజాస్వామ్య కూటమి మధ్యే పోటీ నెలకొన్నది. అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. చివరి విడుతైన మూడోదశలో భాగంగా మంగళవారం 40 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. 79 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది.
పశ్చిమ బెంగాల్‌లో మూడో విడుతలో భాగంగా మంగళవారం 31 స్థానాలకు ఎన్నికలు (West Bengal Assembly Elections 2021) జరిగాయి. 77 శాతం పోలింగ్ నమోదైనట్టు ఈసీ ప్రకటించింది. మూడో విడుతలోనూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. బీజేపీకి ఓటు వేయాలని ఓటర్లను కేంద్ర బలగాలు బెదిరిస్తున్నాయని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఓ గ్రామంలో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో 4 ఈవీఎంలు, వీవీ ప్యాట్లను గుర్తించినట్టు అధికారులు మంగళవారం తెలిపారు.
బీజేపీకే ఓటేయాలంటూ కేంద్ర బలగాలు ఓటర్లను బెదిరిస్తున్నాయని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. మూడో దశ ఎన్నికల సందర్భంగా ‘బీజేపీ కో ఓట్ దో’ అంటూ ఓటర్లపై దాడి చేస్తున్నాయన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఐటీబీపీ బలగాల అకృత్యాలను ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ వారు పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకుని, అక్రమంగా ఓట్లు వేసుకుంటున్నారన్నారు.
బెంగాల్ ఎన్నికల కమిషన్.. నిబంధనలు ఉల్లంఘించాడంటూ ఓ ప్రభుత్వ అధికారిని సస్పెండ్ చేసింది. పోలింగ్‌కు ముందు రోజు సదరు అధికారి తనకు బంధువైన టీఎంసీ నాయుకుడి ఇంట్లో రాత్రంతా ఈవీఎంలతో పాటు ఉన్నందుకు గాను బెంగాల్ ఈసీ సదరు అధికారిని సస్పెండ్ చేసింది. అయితే అధికారి వద్ద ఉన్న ఈవీఎం, వీవీపాట్ సామాగ్రిని ఎన్నికల్లో వినియోగించలేదని ఈసీ తెలిపింది. ఈ ఘటన ఉలుబేరియా ఉత్తర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని తులసిబీరియా గ్రామంలో చోటు చేసుకుంది.