Bihar Assembly Election Results 2020: తేజస్వీ యాదవ్ వైపే చూపంతా.., నితీష్‌కుమార్‌పై ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది? ఎగ్జిట్ పోల్స్ అన్నీ మహాఘట్‌బంధన్‌ వైపే, బీహార్‌లో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు
Bihar Assembly Election Results 2020

Patna, Nov 10: దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేకెత్తించిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో (Bihar Assembly Election 2020) పాటు, దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని 58 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు (Bihar Assembly Elections Results 2020) ప్రారంభం అయింది. బీహార్ ఎన్నికలు ప్రధానంగా ఎన్డీయే, తేజస్వి యాదవ్ (RJD Tejashwi Yadav) సారథ్యంలోని ఐదు పార్టీల కూటమి మహాఘట్‌బంధన్ (Mahagathbandhan) మధ్య జరిగాయి. కాగా, దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ మహాఘట్‌బంధన్‌కే అనుకూలమని చెబుతున్నాయి.

నితీశ్ కుమార్ (Nitish Kumar) దశాబ్దానికి పైగా బీహార్‌ను ఏలుతుండడంతో ఈసారి ప్రజలు యువకుడైన తేజస్వికి పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ప్రజలు మార్పు కోరుకుంటున్నట్టు అర్థమైంది. తొలి ఫలితం 9.30 నిముషాలకు వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే తుది ఫలితాల వెల్లడిలో కాస్త జాప్యం జరిగే అవకాశాలున్నాయి. ప్రతీ అసెంబ్లీ స్థానంలో కనీసం 5 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. అక్కడి ఓట్లను వీవీపాట్‌ల స్లిప్పులను కలపాల్సి వుంటుంది.

కోవిడ్ కాలంలో జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపు విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంది. దీనిలో భాగంగా ఓట్ల లెక్కంపు కేంద్రాలను గతంలో కన్నా రెండింతలు పెంచింది. సోషల్ డిస్టెన్సింగ్‌ను దృష్టిలో ఉంచుకుని ఓట్ల లెక్కంపు అధికారుల సంఖ్యను కూడా మరింతగా పెంచారు. మొత్తం 55 కేంద్రాలలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ కేంద్రాలలో మొత్తం 414 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఎప్పటి మాదిరిగానే తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. ఈ సారి భారీ సంఖ్యలో వృద్ధులు, కోవిడ్ బాధితులు పోస్టల్ బ్యాలెట్ విధానంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

సీఎం నితీష్ ఫెయిల్యూర్‌ అంటూ నినాదాలు, బీహార్ సీఎం‌ పైకి ఉల్లిపాయలు, రాళ్లు విసిరిన యువకులు, మధుబనిలోని హర్లాఖిలో ఎన్నికల ర్యాలీలో ఘటన

కరోనా నేపథ్యంలో ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. బీహార్‌లో మొత్తం 243 స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఓట్ల లెక్కింపు కోసం 38 జిల్లాల్లో 55 కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. నిన్న తేజస్వి యాదవ్ పుట్టిన రోజు కావడం, అంతకుముందే మహాఘట్‌బంధన్‌దే విజయమని అంచనాలు వెలువడడంతో ఆ కూటమిలో జోష్ నెలకొంది. తేజస్వి సోదరుడు తేజ్ ప్రతాప్ అయితే.. తేజస్విని కాబోయే ముఖ్యమంత్రిగా అభివర్ణించారు. కాంగ్రెస్ అగ్రనేత అయిన రాహుల్ గాంధీ సహా పలువురు తేజస్వికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఇదిలా ఉంటే బీహార్ రాష్ట్రంలో ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చి కీలక పాత్ర పోషించిన లాలూప్రసాద్ యాదవ్, రాంవిలాస్ పాశ్వాన్, శరద్ యాదవ్ లు లేకుండా మొట్టమొదటిసారి ఎన్నికలు జరగడం విశేషమైతే, ముగ్గురు కీలకనేతల వారసులు ఈ ఎన్నికల్లో పోటీ చేయడం చారిత్రాత్మక ఘటనగా మిగిలింది. బీహార్ రాజకీయాల్లో లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్, రామ్ విలాస్ పాశ్వాన్ లు ముగ్గురూ బలమైన నేతలు.1970వ సంవత్సరం తర్వాత మొదటిసారి ముగ్గురు కీలకనేతలు లేకుండా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.

నితీష్ కుమార్ సీఎం కాలేరంటూ చిరాగ్ పాశ్వాన్ జోస్యం, ఓటు హక్కును వినియోగించుకున్న పలువురు ప్రముఖులు

ఎన్నికల సమయంలో అనారోగ్యం కారణంగా రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూశారు.దీంతో ఆయన తనయుడు చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ పక్షాన ఎన్నికల బరిలోకి దిగారు. పశుగ్రాసం కుంభకోణం కేసులో లాలూప్రసాద్ జైలులో ఉండటంతో అతని కుమారుడు తేజస్వీయాదవ్ భావి సీఎం అభ్యర్థిగా రాష్ట్రీయ జనతాదళ్ పక్షాన బరిలోకి దిగారు.మరో కీలకనేత శరద్ యాదవ్ అనారోగ్యం పాలవడంతో అతని కుమార్తె సుభాషిణి బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలో చేరి మాధేపురాలోని బీహారిగంజ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన కీలక నేతల వారసుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది.

మరోవైపు, మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల ఫలితాలపైనా సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ మొత్తం 28 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఏడు నెలల క్రితం జ్యోతిరాదిత్య కాంగ్రెస్‌ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో కమల్‌నాథ్ ప్రభుత్వం కుప్పకూలింది. జ్యోతిరాదిత్య వర్గానికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఆయనతోపాటే వెళ్లారు. పర్యవసానంగా, ఏర్పడిన ఈ ఖాళీలతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేల మృతితో ఖాళీ అయిన 3 నియోజకవర్గాలకు కలిపి ఉప ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి కనీసం 8 సీట్లు వస్తేనే బీజేపీ ప్రభుత్వం సేఫ్‌గా ఉంటుంది. ఆ మార్కు తగ్గితే ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం. కాగా, ప్రస్తుతం నిర్వహించిన ఉప ఎన్నికల స్థానాల్లో 27 చోట్ల గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే విజయం సాధించారు.

మొత్తం ఉప ఎన్నికలు జరుగుతున్న 54 సీట్లలో 42 కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్థానాలు కాగా, 7 బీజేపీ సిట్టింగ్‌ స్థానాలు. తెలంగాణలోని దుబ్బాక స్థానంతోపాటు గుజరాత్‌ (8), ఉత్తరప్రదేశ్‌ (7), మణిపూర్‌ (4), జార్ఖండ్‌ (2), కర్ణాటక (2), నాగాలాండ్‌ (2), ఒడిశా (2), ఛత్తీస్‌గఢ్‌ (1), హర్యానా(1) ఉప ఎన్నికల ఫలితాలు కూడా మంగళవారం వెలువడనున్నాయి.