Bihar Government Formation: స్పీకర్ పోస్ట్ మాదే అంటున్న బీజేపీ, బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం నేడే, డిప్యూటీ సీఎంగా ఇద్దరని నియమించే యోచనలో అధిష్టానం
File image of Bihar CM Nitish Kumar (Photo Credits: IANS)

Patna, November 16: బీహార్ ముఖ్యమంత్రిగా వరుసగా నాలుగోసారి నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం (Bihar Government Formation) చేయనున్నారు. మధ్యాహ్నం 4.30 గంటలకు ప్రమాణస్వీకారం ఉంటుంది. మొత్తంగా ఏడవసారి నితీష్ కుమార్ (Nitish Kumar) సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఇప్పుడు క్యాబినెట్లోకి ఎవరిని తీసుకుంటారు, డిప్యూటీ సీఎంగా ఎవరు ఉంటారు అనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే సీఎం తర్వాత అత్యంత కీలకమైన స్పీకర్ పదవిని మాత్రం తామే తీసుకుంటామని బీజేపీ కరాఖండిగా తేల్చి చెప్పింది.నితీశ్ కుమార్‌తో బీజేపీ అగ్ర నేతలు ఆదివారం అర్ధరాత్రి చర్చలు జరిపారు. ఈ చర్చలోనే స్పీకర్ పదవి తాము తీసుకుంటామని నితీశ్‌కు బీజేపీ తెగేసి చెప్పింది.

అయితే స్పీకర్ అభ్యర్థి ఎవరనేది బీజేపీ ఇంకా ప్రకటించలేదు. మరో వైపు ఈసారి ఇద్దరు డిప్యూటీ సీఎంలను ( Tarkishore Prasad, Renu Devi) అధిష్ఠానం ఉంచనున్నట్లు విశ్వసనీయ సమాచారం . ఇప్పటికే శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన తార్‌కిషోర్ ప్రసాద్, ఉప నేతగా రేణుదేవిని డిప్యూటీ సీఎంలుగా ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ఇక నితీశ్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకారానంతరం కొత్త కేబినెట్ సమావేశమవుతుంది. అసెంబ్లీ సమావేశం ఎప్పుడు ఏర్పాటు చేయాలనే దానిపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.

ఏడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జేడీయూ అధినేత, డిప్యూటీ సీఎంపై కొనసాగుతున్న సస్పెన్స్

నలభై ఏళ్లకు పైబడని రాజకీయ జీవితంలో తాను చేసిన దానికంటే తనకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎంతో ఇచ్చిందని, భవిష్యత్తులో ఏ బాధ్యత అప్పగించినా శక్తిమేరకు పనిచేసేందుకు సిద్ధమేనని సుశీల్ మోదీ ఆదివారం ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. పార్టీ కార్యకర్త పదవిని తననుంచి ఎవరూ లాక్కోలేరని కూడా వ్యాఖ్యానించారు. దీంతో డిప్యూటీ సీఎం పదవి ఆయనను మరోసారి వరించకపోవచ్చనే ఊహాగానాలకు తావిచ్చింది. సుశీల్ మోదీని రాజ్యసభకు పంపి, అనంతరం కేంద్ర కేబినెట్‌లో తీసుకునే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. కాగా, బీహార్ కొత్త ఉప ముఖ్యమంత్రులుగా వైశ్య వర్గానికి చెందిన తార్‌కిషోర్ ప్రసాద్, ఈబీసీ వర్గానికి చెందిన రేణు దేవికి బాధ్యతలు అప్పగిస్తారని అంచనా వేస్తున్నారు.

బీహార్‌లో బీజేపీ విజయఢంకా, అతి పెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీ, 125 సీట్లతో అధికారాన్ని ఏర్పాటు చేయనున్న ఎన్డీయే కూటమి

క్యాబినెట్ విషయానికి వస్తే.. 16 నుంచి 17 మందిని నితీశ్ కుమార్ తన క్యాబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. జేడీయు, బీజేపీ నుంచి చెరో ఏడుగురిని క్యాబినెట్‌లో తీసుకుంటారని తెలుస్తోంది. ఎన్డీయే భాగస్వామ్య పార్టీలైన హిందుస్థాని అవామీ మోర్చా-సెక్యులర్, వికాశీల్ ఇన్సాన్ పార్టీలకు చెరో కేబినెట్ పదవి దక్కనుంది. వీరంతా నితీశ్‌తో పాటే ప్రమాణస్వీకారం చేస్తారని పార్టీ వర్గాల సమాచారం.

ఈసారి ఎన్నికల్లో జేడీయూ కంటే ఎక్కువ సీట్లు సాధించి రెండో పెద్ద పార్టీగా బీజేపీ నిలబడగా, జేడీయూ మూడో పెద్ద పార్టీగా నిలిచింది. దీంతో గెలుచిన సీట్లను బట్టే బెర్త్‌ల సంఖ్య ఉంటుందనే మాట బలంగా వినిపిస్తోంది. జేడీయూ 43 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 74 సీట్లు గెలుచుకుంది. గెలుచుకున్న ప్రతి 7 సీట్లకు రెండేసి బెర్త్‌లు కేబినెట్‌లో లభించనున్నట్టు అంచనా వేస్తున్నారు. ఆ ప్రకారం నితీశ్ కేబినెట్‌లో జేడీయూ నుంచి 12 మందికి చోటు దక్కనుండగా, బీజేపీకి 18 సీట్లు, ఆ పార్టీ వాటా నుంచి వీఐపీ, హెచ్ఏఎంలకు చెరో బెర్త్ దక్కనుందని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో మంత్రివర్గ విస్తరణలో మరికొందరికి చోటు కల్పిస్తారని అంటున్నారు. అయితే, గరిష్టంగా 36 మందికి మాత్రమే బీహార్ క్యాబినెట్‌లో చోటు కల్పించాల్సి ఉంటుంది. మొత్తం 243 సీట్లలో బెర్త్‌ల కేటాయింపు 15 శాతానికి మించరాదు. సాయంత్రానికి దీనిపై క్లారిటీ రానుంది.