Kolkata, October 3: పశ్చిమ బెంగాల్‌లో మూడు అసెంబ్లీ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికలకు (Bypoll Results 2021) ఆదివారం కౌంటింగ్ జరుగుతోంది. 10 గంటల వరకు అందిన ఫలితాల ప్రకారం తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకుపోతోంది. రెండవ రౌండ్ కౌంటింగ్ ముగిసిన తర్వాత 2,800 ఓట్ల ఆధిక్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee Leads in Bhabanipur Assembly Constituency) ఉన్నారు. TMC అభ్యర్థి జాకీర్ హుస్సేన్ జంగీపూర్ అసెంబ్లీ సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు.
భవానీపూర్, జంగిపూర్, సంసెర్గంజ్ అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు జరుగుతోంది.భవానీపూర్‌లో సెప్టెంబర్ 30న జరిగిన ఉప ఎన్నికల్లో 57 శాతం పోలింగ్ నమోదయ్యిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా, మధ్యాహ్నం కల్లా ఫలితాలపై స్సష్టత వచ్చే అవకాశం ఉంది. ఉపఎన్నికలో మమతపై బీజేపీ అభ్యర్థిగా న్యాయవాది ప్రియాంక పోటీలో ఉన్నారు.కాగా భవానీపూర్ నియోజకవర్గం అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి(టీఎంసీ) కంచుకోటగా ఉంది.
కొన్ని నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సొంత స్థానమైన భవానీపూర్‌ను వదిలేసి, నందిగ్రామ్ స్థానం నుంచి పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. ఆరు నెలల్లోగా ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గాల్సి ఉండగా, భవానీపూర్ టీఎంసీ ఎమ్మెల్యే శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ ఆమె కోసం రాజీనామా చేశారు.
ఇక బిజెడి అభ్యర్థి రుద్ర ప్రతాప్ మహారథి మొదటి రౌండ్ కౌంటింగ్ తర్వాత ఒడిషాలోని పిపిలి అసెంబ్లీ నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు.