Delhi Assembly Elections 2025. (Photo Credits: LatestLY)

New Delhi, Feb 3: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) ప్రచారం నేటితో ముగిసింది. ప్రచారంలో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP), ప్రతిపక్ష బీజేపీ (BJP) మధ్య హోరాహోరీగా ఆరోపణలతో విరుచుకుపడ్డాయి. ఫిబ్రవరి 5న పోలింగ్‌ జరగనుండటంతో సోమవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఎన్నికల ప్రచారంలో కాలుష్యం, తాగునీటి సమస్య ముఖ్యమైన అంశాలుగా మారాయి. యమునా నది కాలుష్యం విషయం ప్రధాన అంశంగా ప్రచారం జరిగింది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Elections) కు, ఉత్తరప్రదేశ్‌లోని మిల్కిపూర్‌ అసెంబ్లీ స్థానానికి, తమిళనాడులోని ఈరోడ్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల (Bye Elections) కు సంబంధించిన పోలింగ్‌ ఫిబ్రవరి 5న జరగనుంది. ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 5న ఎగ్జిట్‌ పోల్స్‌ (Exit polls), ఇతర సర్వేలపై ఎన్నికల సంఘం (Election commission) నిషేధం విధించింది. పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో ఫిబ్రవరి 5న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రచురణపై నిషేధం విధించినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నది.

వీడియో ఇదిగో, ఢిల్లీ కొస్తే చాలా బాధ కలుగుతుంది, కేజ్రీవాల్ పాలనపై విరుచుకుపడిన చంద్రబాబు, 1995లో పాడుబడిపోయిన హైదరాబాద్ మాదిరి ఢిల్లీ తయారైందని వెల్లడి

ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ సంపూర్ణ మెజారిటీతో గెలిచింది. 70 సీట్లలో 2015లో ఆప్‌ 67 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ కేవలం 3 సీట్లకు పరిమితం కాగా, కాంగ్రెస్‌ అసలు ఖాతానే తెరువలేదు. 2020లో కూడా ఆప్‌ హవానే కొనసాగింది. ఆ పార్టీ 62 సీట్లు గెలుచుకోగా.. బీజేపీ మిగిలిన 8 స్థానాలు దక్కించుకుంది. వరుసగా రెండోసారి కూడా కాంగ్రెస్‌ ఖాతానే తెరవలేదు. 1998 మరియు 2013 మధ్య 15 సంవత్సరాల పాటు దేశ రాజధానిని పాలించిన కాంగ్రెస్ ఖాతా తెరవకపోవడం విచిత్రమే.

ఎక్కువ మంది ఓటర్లను పోలింగ్ బూత్‌లకు చేర్చేందుకు ఎన్నికల విభాగం తీవ్రంగా ప్రయత్నిస్తుండటంతో ఓటింగ్ రోజు అందరి దృష్టి ఓటింగ్ శాతంపైనే ఉంటుంది. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 62.82 శాతం పోలింగ్ నమోదైంది, 2015లో 67.47 శాతం కంటే 4.65 శాతం ఇది తక్కువ. 2013లో 66.02 శాతం ఓటింగ్ నమోదైంది, 2008నాటి 57.6 శాతం కంటే ఇది 8.42 శాతం ఎక్కువ.

ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) డేటా ప్రకారం, 13,766 పోలింగ్ స్టేషన్లలో 1.56 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం ఓటర్లలో 83.76 లక్షల మంది పురుషులు, 72.36 లక్షల మంది మహిళలు, 1,267 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.2020 పోల్‌లో 672 మందితో పోలిస్తే ఈ సారి 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.