CM KCR in the State Assembly | File Photo

Hyderabad, March 16: కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (citizenship amendment act) కు వ్యతిరేకంగా సోమవారం తెలంగాణ అసెంబ్లీలో (Telangana Assembly)  ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (CM KCR) తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనితో పాటు ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ (NRC & NPR) లకు కూడా వ్యతిరేకమైన తీర్మానాలను సీఎం సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంటులో కూడా సిఎఎకు సంబంధించిన బిల్లును టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించిందని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు.

సిఎఎకు వ్యతిరేకంగా కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. వందల సంవత్సరాలుగా విభిన్నమైన సంస్కృతి ఉన్న దేశంలో, మన వైఖరి ఏంటనేది తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. విశ్వమానవ సౌభ్రాతృత్వం కోరుకునే దేశంలో ఇలాంటి చట్టాలు దేశ ప్రతిష్ఠను దిగజారుస్తాయని సీఎం కేసీఆర్ అన్నారు. స్వయంగా అమెరికా అధ్యక్షుడు దేశ రాజధానిలో పర్యటిస్తున్నప్పుడు జరిగిన అల్లర్లను సీఎం గుర్తుచేశారు. స్పష్టమైన అవగాహనతోనే సిఎఎ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ లను వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ సీఎం స్పష్టం చేశారు. అంతకుముందు కేరళ, పంజాబ్, దిల్లీ, బీహార్, ఛత్తీస్‌ఘడ్, పశ్చిమ బెంగాల్ కూడా వీటికి వ్యతిరేకంగా తీర్మానాలను ఆమోదించాయని తెలిపారు.

నాకే పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం లేదు, మా నాన్నది తీసుకురావాలంటే ఎక్కడ్నించి తేవాలి? నా పరిస్థితే ఇలా ఉంటే, సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుంది? వేల కోట్ల మంది ఎక్కడ్నించి తీసుకొస్తారు? అని కేసీఆర్ ప్రశ్నించారు.

ప్రతీ ఒక్కరికి పౌరసత్వం ఉండాల్సిందే అయితే చొరబాటుదారులను అనుమతించాలని ఎవరూ చెప్పరు. మెక్సికో వాసులు అమెరికాలో చొరబడకుండా అమెరికా గోడ కట్టింది, అలా ఇండియా చుట్టూ కూడా గొడకడతారా? అలా గోడకడతాం అంటే మేం మద్ధతిస్తాం అని కేసీఆర్ అన్నారు. మనం కంటినిండా ఈరోజు నిద్రపోవడానికి కారణం సరిహద్దు వద్ద సైనికుల త్యాగాలు అని కేసీఆర్ పేర్కొన్నారు.

కేంద్రప్రభుత్వానికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహీ, పాకిస్థాన్ ఏజెంట్ అంటూ విమర్శల దాడి చేస్తున్నారని పేర్కొన్నారు. పనుల కోసం వలసలు పోయిన మనవారి గతేం కావాలి? విభజన రాజకీయాలు దేశానికి అవసరమా? అని కేసీఆర్ అన్నారు. సిఎఎపై కేంద్రం పున: సమీక్షించుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు.