Machilipatnam, March 11: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బుధవారం మచిలిపట్నంలో పోలీసు సిబ్బంది విధులకు అంతరాయం కలిగించారనే అభియోగంపై మాజీ మంత్రి, టిడిపి నాయకుడు కొల్లు రవీంద్రను మచిలిపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఉదయాన్నే కొల్లు రవీంద్ర నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసున్నారు. రవీంద్ర అరెస్ట్ నేపథ్యంలో ఆయన నివాసానికి భారీగా టిడిపి కార్యకర్తలు చేరుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
బుధవారం మచిలిపట్నంలోని 25 డివిజన్‌లో ఓటు వేసేందుకు వచ్చిన అదే కేంద్రంలో పోలింగ్ ప్రక్రియను చూడటానికి యత్నించగా, పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సెక్షన్ 144 అమల్లో ఉందని, కాబట్టి పోలింగ్ ప్రక్రియను చూడలేరని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు, కొల్లు రవీంద్ర మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం రవీంద్ర పోలింగ్ కేంద్రం సమీపంలో రోడ్డుపై కూర్చుని నిరసన చేపట్టారు. స్థానిక టిడిపి నాయకులు జోక్యంంతో కొద్దిసేపటి తర్వాత రవీంద్ర అక్కడ్నించి వెళ్లిపోయారు.
ఇదే వ్యవహారంపై గురువారం పోలీసులు కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. అయితే కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో విడుదల అయ్యారు.
కాగా, రవీంద్రను అరెస్ట్ చేయడాన్ని టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఖండించారు. రవీంద్ర అరెస్ట్ అక్రమం అని, బుధవారం జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అవకతవకలకు ఆటంకం కలిగించినందుకే రవీంద్రను అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. జగన్ రెడ్డి ప్రభుత్వం బిసిల పట్ల కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. కనీసం సంతోషంగా పండుగ జరుపుకోవడానికి అనుమతించడం లేదని చంద్రబాబు ఆక్రోశం వ్యక్తం చేశారు.