Tirupati, January 03: ఏపీ సీఎం వైయస్ జగన్ (AP CM YS Jagan) అసెంబ్లీలో తెలిపిన మూడు రాజధానుల అంశం(3 Capitals row) ఇప్పుడు ఏపీని కుదిపేస్తోంది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ గత 15 రోజులుగా దీక్షలు చేస్తోన్న రైతులు.. శుక్రవారం సకలజనుల సమ్మె చేపట్టారు. అమరావతి రైతుల ఉద్యమానికి టీడీపీ మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు (Chandra babu naidu) ఇదివరకే ప్రకటించారు. అయితే టీడీపీకే చెందిన మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి (Ex Minister Amarnath Reddy) మాత్రం సరికొత్త వాదనను తెరపైకి తెచ్చారు.
తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి...కానీ పాలనా వికేంద్రీకరణ కాదన్నారు. పాలన చేతకాక కులాలు, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పాలన వికేందరద్రీకరణ అంటే ముగ్గురు సీఎంలను పెట్టండన్నారు. రాజధానిని మారుస్తామని జగన్ (YS Jagan) ఇదివరకు ఎక్కడా చెప్పలేదన్నారు. అన్ని సౌకర్యాలున్న తిరుపతిని ( Tirupati) రాజధాని చేయండని అమర్ నాథ్ రెడ్డి కోరారు.
రాష్ట్ర విభజనకు ముందు, తర్వాత కూడా రాయలసీమ (Rayalaseema) ప్రాంతం అన్యాయానికి గురవుతూనే ఉందని, ఇకపైనా భరించే ఓపిక లేదని మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి చెప్పారు. 2014లో అప్పటి సీఎం చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే.. సెంటర్ పాయింట్ లో ఉందికదాని ఒప్పుకున్నామని, ఇప్పుడు సీఎం జగన్ రాజధానిని విశాఖపట్నానికి తరలిస్తుండటంతో.. రాయలసీమకు గతంలో కంటే ఎక్కువగా నష్టం జరిగే పరిస్థితులు దాపురించాయని, అందుకే ఏపీ నుంచి విడిపోవాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
ఏపీ రాజధానిని తిరుపతిలో ఏర్పాటు చేయాలని, లేదంటే చిత్తూరును సగం తమిళనాడులో, సంగం కర్నాటకలో కలిపేయాలని మాజీ మంత్రి డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ఈ డిమాండ్ కొత్తదేమీకాదని, విభజన టైమ్ లోనూ ఇక్కడి ప్రజలు ఇదే అభిప్రాయన్ని వెలిబుచ్చారని, ప్రస్తుత ఉద్యమానికి మద్దతిచ్చేవారి సంఖ్య కూడా తక్కువేమీ ఉండదని అమర్ నాథ్ రెడ్డి చెప్పారు. డిమాండ్ ను సాధించేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు.