File Image of Former Telangana Home Minister Nayani Narasimha Reddy |(Photo-FacebooK)

Hyderabad, October 22: తెలంగాణ రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి, కార్మిక నాయకుడు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత నాయిని నరసింహారెడ్డి కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం ఆయన పరిస్థితి మరింత విషమించింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కూడా నిన్న హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి నాయిని కుటుంబ సభ్యులను పలకరించి వచ్చారు.

బుధవారం అర్ధరాత్రి దాటాకా నాయిని ఆరోగ్య పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. చివరకు గురువారం ఉదయం 12:25 సమయానికి ఆయన తుదిశ్వాస విడిచారు.

నాయిని వయసు 86 ఏళ్లు, గత నెల సెప్టెంబర్ 28న ఆయనకు కొవిడ్19 సోకినట్లు నిర్ధారణ అయింది, అయితే త్వరలోనే కరోనా నుంచి కోలుకున్నప్పటికీ దాని ప్రభావం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కు దారితీసింది. దీంతో ఆయన అపోలో ఆసుపత్రిలో వెంటిలెటర్ పై చికిత్స పొందుతూ వచ్చారు.

హైదరాబాద్ లోని VST పరిశ్రమలలో కార్మిక సంఘం నాయకుడిగా మొదలైన నాయని నరసింహరెడ్డి ప్రస్థానం అంచెలంచెలుగా ఎదుగుతూ మాస్ లీడర్ అయ్యారు. 1969లో తొలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1978, 1985లో వరుసగా రెండు పర్యాయాలు జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

అనంతరం 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత నాయిని టీఆర్ఎస్ లో చేరారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటే నడిచారు, 2004లో టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొంది ఉమ్మడి ఏపీలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర మొదటి హోంమంత్రిగా పనిచేశారు. పార్టీ శ్రేణులు నాయినిని "బుల్లెట్ నరసన్న" గా పిలుచుకునేవారు.

నాయిని మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన చిరకాల మిత్రుడి, ఉద్యమ సహచరుడ్ని కోల్పోయానని అన్నారు, నాయిని మృతి టీఆర్ఎస్ పార్టీకి, కార్మికలోకానికి తీరని లోటని కేసీఆర్ అన్నారు.