Gujarat CM Bhupendra Patel (Photo:ANI)

Gandhi Nagar, Dec 8:  గుజరాత్‌ బీజేపీ అడ్డా అని మరోసారి ఓటర్లు రుజువు చేశారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని (Gujarat Election Results 2022) సాధించింది. 182 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజారిటీని సాధించింది. ఇప్పటి వరకు 121 స్థానాల్లో గెలుపొందగా.. 35 ఆధిక్యంలో కొనసాగుతున్నది. కాంగ్రెస్‌ 6 స్థానాల్లో గెలువగా.. మరో 11 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది.

ఆమ్‌ ఆద్మీ పార్టీ మూడు స్థానాల్లో గెలుపొందగా.. మరో రెండుచోట్ల లీడ్‌లో ఉన్నది. 1995 నుంచి గుజరాత్‌లో బీజేపీ.. వరుసగా విజయం (BJP Registers Historic Win) సాధిస్తూనే ఉంది. 1995-2017 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుసార్లు గెలిచి బీజేపీ దేశ రాజకీయ చరిత్రలో రికార్డును క్రియేట్‌ చేసింది. ఈ ఎన్నికల విజయంతో బీజేపీ తమ ఖాతాలో ఏడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది.

హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ షాక్, ఘన విజయంగా దిశగా కాంగ్రెస్ పార్టీ

భూపేంద్ర పటేల్‌ గట్లోదియా స్థానం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని సాధించడంతో ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ ఈ నెల 12న ప్రమాణస్వీకారం చేస్తారని బీజేపీ గుజరాత్‌ చీఫ్‌ సీఆర్‌ పాటిల్‌ పేర్కొన్నారు. గాంధీనగర్‌లో పదవీ ప్రమాణస్వీకారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతతో విజయం సాధ్యమైందని, మరోసారి అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఫలితాలు షాక్‌కు గురి చేశాయని గుజరాత్‌ పీసీసీ చీఫ్‌ జగదీష్‌ ఠాకూర్‌ అన్నారు.

ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్‌ శక్తివంచన లేకుండా కష్టపడిందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యామని పేర్కొన్నారు.ఈ ఏడాది గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి అన్ని రాజకీయ పార్టీల నేతలు రాష్ట్రంలో ఫుల్‌ ఫోకస్‌ పెట్టారు. గుజరాత్‌లో తమ అదృష్టం పరీక్షించుకునేందుకు ఆమ్‌ ఆద్మీ పార్టీ ముందునుంచే అక్కడ ప్రచారం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌.. మాస్టర్‌ ప్లాన్స్‌ రచిస్తూ గుజరాతీలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. కానీ, బీజేపీ ఎలక్షన్‌ స్టంట్స్‌ ఎదుట ఆ పాచికలేవీ పారలేదు.

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన జైరాం ఠాకూర్‌ , కాసేపట్లో తన రాజీనామాను గవర్నర్‌కు అందజేస్తానని వెల్లడి

గుజరాత్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి మరింతగా దిగజారింది. గతంతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ సీట్లకు భారీగా గండిపడింది. దీంతో మరోసారి ప్రతిపక్ష పాత్రకే పరిమితం కానుంది. 2017 ఎన్నికల్లో 77 స్థానాల్లో గెలిచిన హస్తం పార్టీ.. ఈ సారి కనీసం 20 స్థానాలను కూడా దక్కించుకునేలా కనిపించడం లేదు.2017 కు ముందు ఎన్నికలతో పోలిస్తే 2017 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఏకంగా పదహారు సీట్లు అధికంగా గెల్చుకోవడం గమనార్హం. గత అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్‌లో బీజేపీని దాదాపు ఓడించినంత పని చేసింది కాంగ్రెస్. 41.44 ఓట్ షేర్‌తో 77 సీట్లు గెలుచుకుంది. 1998 తర్వాత తొలిసారి బీజేపీని డబుల్ డిజిట్‌కు పరిమితం చేసింది. కానీ, ఇప్పుడు నీరుగారి పోయింది. సీనియర్ నేత అహ్మద్ పటేల్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.

2017 నుంచి దాదాపు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. పాటిదార్ నేత హార్దిక్ పటేల్ కూడా ఎన్నికల ముందు బీజేపీలో చేరిపోయారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, హైకమాండ్ నిర్ణయరాహిత్యం కలిసి ఒక రకమైన నైరాశ్యంలో కూరుకుపోయింది గుజరాత్ కాంగ్రెస్. అహ్మద్ పటేల్ లేకపోవడంతో.. గుజరాత్ కాంగ్రెస్ ఎలక్షన్ బాధ్యతను రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కు అప్పగించింది అధిష్టానం. అయితే ఓటర్లు బీజేపీ వైపే మొగ్గు చూపారు.