Hyderabad, April 7: తెలుగు దేశం పార్టీకి ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఏపీలో పరిషత్ ఎన్నికల విషయంలో హైకోర్ట్ తాజా తీర్పుతో బోక్కబోర్లా పడ్డ టీడీపీకి, ఇటు తెలంగాణలోనూ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ తెలుగు దేశం శాసనసభ పక్షాన్ని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రకటించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఖమ్మం జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఒకరు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కాగా, మరొకరు అశ్వారావు పేట ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వర్ రావు. అయితే సండ్ర వెంకట వీరయ్య గత కొన్నాళ్లుగా టీఆర్ఎస్ పార్టీకి మద్ధతు ప్రకటించగా, మెచ్చ నాగేశ్వర్ రావు మాత్రం టీడీపీకి విధేయుడిగానే కొనసాగుతూ వచ్చారు.
అయితే తాజా మెచ్చ నాగేశ్వర్ రావు తాను కూడా టీఆర్ఎస్ కే తన మద్ధతు అని తెలిపారు. టీడీపీకి రాజీనామా చేసి త్వరలో టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు కలిసి టీడీఎల్పీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయాలని కోరుతూ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రావుకు లేఖను అందజేశారు. ఆ వెంటనే శాసనసభ కార్యదర్శి నర్సింహాచారి టీడీఎల్పీ విలీనం టీఆర్ఎస్ పార్టీలో విలీనం అయినట్లు అధికారిక బులిటెన్ విడుదల చేశారు.
బుధవారం తెలుగుదేశం పార్టీకి అటు ఏపీలో ఇటు తెలంగాణలో ఎదురుదెబ్బలు తగిలాయి. ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిలిపివేయాలంటూ కొన్ని పార్టీలు ముఖ్యంగా టీడీపీ హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ వేసింది. మంగళవారం టీడీపీకి అనుకూలంగానే తీర్పు వచ్చింది. దీంతో చంద్రబాబు హర్షం వ్యక్తం చేస్తూ హైకోర్ట్ తీర్పు వైఎస్ఆర్సీపీకి చెంపదెబ్బ లాంటిది అని వ్యాఖ్యానించారు. అయితే హైకోర్ట్ సింగిల్ జడ్జి తీర్పును డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఎన్నికల విషయంలో తలదూర్చం అని తేల్చి చెప్పింది. దీంతో గురువారం ఏపీలో యధావిధిగా పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. ఇది టీడీపీకి ఏపీలో ఎదురుదెబ్బ కాగా, ఈ పరిణామం జరిగిన కొద్దిసేపటికే అటు తెలంగాణలో టీడీపీలో మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీలో కలిసిపోయారు. దీంతో టీడీపీ డబుల్ డోస్ దెబ్బ తగిలినట్లైంది.
వరుస ఎదురుదెబ్బలతో సతమతమవుతున్న టీడీపీ భవిష్యత్తు ఇకపై ఉండబోతుంది? పార్టీ పునర్వైభవం కోసం టీడీపీ అధిష్టానం ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.