
Amaravathi, December 11: ఒకవైపు జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, జగన్ పాలనకు వ్యతిరేకంగా విస్తృతమైన ప్రచారం నిర్వహిస్తుంటే, ఆయన పార్టీ జనసేన నుంచి గెలించిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ (Rapaka Vara Prasad) మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అధినేత పవన్ కళ్యాణ్ ను గానీ, జనసేనను గానీ ఏమాత్రం పట్టించుకోకుండా తన పంథాలో తాను వెళ్తున్నాడు.
ఈరోజు ఏపీ అసెంబ్లీలో ఇంగ్లీష్ మీడియంపై జరిగిన చర్చ సందర్భంగా జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు సభలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి తన సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా పేద విద్యార్థులు మాత్రమే చదువుతారు. డబ్బున్న వారు మాత్రమే ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్లల్లో చదువుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయాలనే ఒక మంచి నిర్ణయాన్ని సీఎం జగన్ (CM Jagan) తీసుకున్నారు. ఇలాంటి గొప్ప ప్రయత్నానికి ఎవరూ అడ్డు చెప్పకూడదు. గతంలో చంద్రబాబు హయాంలోనూ ఈ ప్రయత్నాలు జరిగినా, ఆయన సాధించలేకపోయారు, కానీ నేడు సీఎం జగన్ చేసి చూపిస్తున్నారని రాపాక అన్నారు. తెలుగుకు మూలం దేవ భాష అయిన సంస్కృత భాష - పవన్ కళ్యాణ్
ఆంధ్రా జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు అక్కడ కూలీ పని చేసుకుంటున్నారు, అదే కేరళ నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని వెళ్తున్న వారు అక్కడ ఆఫీసుల్లో మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఏపీ ప్రజలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఉంటే వారికి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చి ఉండేవని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఇంగ్లీష్ మీడియంపై చర్చను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబును సభలోనే రాపాక విమర్శించారు. జనసేన ఒక చిల్లర పార్టీ, దానికి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు- బీజేపీ ఎమ్మెల్యే
పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవలేకపోవడంతో ఆయన అసెంబ్లీలో మాట్లాడే అవకాశం దక్కించుకోలేక పోయాడు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ బయట నుంచి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు అనేక అంశాలపై పవన్ నిలదీస్తున్నారు. సీఎం జగన్ పై నేరుగా విమర్శల దాడి చేస్తూ వస్తున్నారు. అయితే అసెంబ్లీలో జనసేన ఏకైక గొంతుక రాపాక మాత్రం ప్రతీసారి సీఎం జగన్‌కు అనుకూల వ్యాఖ్యలు చేస్తూ అధినేత పవన్ కళ్యాణ్‌కు గట్టి షాక్‌లు ఇస్తున్నారు.