Karimnagar, January 27: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ (Karimnagar Municipal Corporation) ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 60 డివిజన్లు ఉండగా.. ఇప్పటికే 2 స్థానాలను అధికార టీఆర్‌ఎస్ (TRS) ఏకగ్రీవంగా గెలుచుకుంది. 20, 37 డివిజన్లలోని టీఆర్ఎస్ అభ్యర్థులు తల రాజేశ్వరి, చల్లా స్వరూప రాణీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 58 డివిజన్లలో నాలుగు సీట్లను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మిగతా పార్టీలు ఇంకా ఖాతాలు ఓపెన్ చేయలేదు.
మిగతా స్థానాలకు వస్తే కేసీఆర్ (CM KCR) నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ (Telangana Rashtra Samiti) 19 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ (Congress) 2 స్థానాల్లో, బీజేపీ (BJP) 8 స్థానాల్లో, ఎంఐఎం (MIM) 2 స్థానాల్లో ఇతరులు 2 స్థానాల్లో ముందున్నారు.
58 డివిజన్లకు ఎన్నికలు, మరో మూడు చోట్ల రీపోలింగ్
మొత్తం మీద ఇక్కడ తెలంగాణా రాష్ట్రసమితి భారీ విజయాన్ని నమోదు చేయనున్నట్లు ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. 60వ డివిజన్ లో టీఆర్ఎస్ అభ్యర్థి రమణరావు, 33వ డివిజన్ లో టీఆర్ఎస్ అభ్యర్థి సునీల్ రావు గెలిచారు.
కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ లోని 58 డివిజన్లకు ఈనెల 24న పోలింగ్ జరిగింది, 58 డివిజన్లలో 369 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.నగరంలో మొత్తంగా 2 లక్షల 64వేల 134 మంది ఓటర్లు ఉండగా... వీరిలో లక్షా 65 వేల 147 ఓట్లు పోలయ్యాయి. 58 మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లను, ఇద్దరు చొప్పున అసిస్టెంట్లను, 20 మంది మైక్రో అబ్జర్వర్లను అక్కడ నియమించారు. కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాగా అభ్యర్థులు, ఏజెంట్లు సెల్‌ఫోన్లను కౌంటింగ్ కేంద్రంలోకి తీసుకురావద్దని అధికారులు సూచించారు.