CM Revanth Reddy angry on BRS Social Media posts(X)

Hyd, Nov 20: వేములవాడలో కాంగ్రెస్‌ ప్రజా విజయోత్సవ సభ జరిగింది. ఈ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ఓడించినా మార్పు రాలేదని అని అన్నారు.బీఆర్‌ఆఎస్ నేతలకు మైండ్‌ దొబ్బింది అని మండిపడ్డారు. పదేళ్లలో రుణమాఫీ చేసుంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.

ప్రజలనే కాదు.. వేములవాడ రాజన్ననూ కేసీఆర్‌ మోసం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. కేసీఆర్‌ను గద్దె దించాలని సిరిసిల్ల పాదయాత్రలో నిర్ణయించుకున్నానని తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఢిల్లీకి కాదు.. చంద్ర మండలానికి వెళ్లి ఫిర్యాదు చేసినా తప్పు చేస్తే అరెస్ట్ అవడం ఖాయమని అన్నారు.

భూసేకరణపై కుట్ర చేసినందుకు ఊచలు లెక్కపెడతారని హెచ్చరించారు.మిడ్‌మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో వాయిదా పడుతూ వస్తున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 30న మరోసారి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇక్కడికి వచ్చి ప్రాజెక్టులపై సమీక్షిస్తారని సీఎం చెప్పారు.

సోషల్ మీడియా పోస్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం, బావ- బామ్మర్థులకు మా పవర్ త్వరలో తెలుస్తుంది..పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపి మీరు ఏం వెలగబెట్టారో చెప్పాలని డిమాండ్

డ్రగ్స్ తీసుకున్న వారు ఇంట్లో దొరికితే కేసు పెట్టకూడదా? తన బావమరిది తాగి తందనాలు ఆడితే కేటీఆర్ ఎలా సమర్థిస్తారు? విదేశీ మద్యం దొరికితే కేసు పెట్టవద్దా? కేటీఆర్ ఉరుకులాటలు (పరుగులు) గమనిస్తూనే ఉన్నామని, ఎంత దూరం ఉరుకుతారో చూస్తానన్నారు. తన నియోజకవర్గంపై కేసీఆర్‌కు ఎందుకంత కక్ష అన్నారు. తానేమీ లక్షల ఎకరాలు సేకరించడం లేదని, నాలుగు గ్రామాల్లో 1,100 ఎకరాలను మాత్రమే సేకరిస్తున్నామన్నారు.

భూసేకరణ చేసి... పరిశ్రమలు తెచ్చి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం కేసీఆర్‌కు ఇష్టం లేదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా భూసేకరణ జరిగిందని గుర్తు చేశారు. భూమిని కోల్పోతున్న రైతులకు మూడు రెట్ల పరిహారం ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. కేసీఆర్‌కు తాను చెప్పేది ఒకటేనని... అసెంబ్లీకి రావాలని... అక్కడ అన్ని లెక్కలు చెబుతామన్నారు. 80 వేల పుస్తకాలు చదివావో కూడా మాట్లాడుదామని ఎద్దేవా చేశారు. రుణమాఫీ లెక్కలు కూడా చెబుతామన్నారు. ఎన్నికల్లో ప్రజలు ఓడించినా కేసీఆర్‌కు బుద్ధి రాలేదని విమర్శించారు.

తాము ఏడాదిలో 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని, ఒక్కటి తక్కువ ఇచ్చినట్లు నిరూపించినా తాను అక్కడే క్షమాపణ చెబుతానని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. కేటీఆర్, హరీశ్ రావు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేయలేని పనులు తాము చేస్తుంటే నొప్పి వస్తోందన్నారు. మీ నొప్పికి మా కార్యకర్తల వద్ద మందు ఉందని, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సంగతి తేలుస్తామన్నారు. ఎన్నో ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ హయాంలోనే అన్నారు.

రూ.11వేల కోట్ల రుణమాఫీకి కేసీఆర్‌ ఐదేళ్లు తీసుకున్నారు. 25 రోజుల్లో 23 లక్షల కుటుంబాలకు రూ.18వేల కోట్ల రుణమాఫీ చేశాం. రుణమాఫీని అభినందించాల్సింది పోయి విమర్శిస్తారా? మీరు చేసిన రుణమాఫీ.. మేము చేసిన రుణమాఫీ వివరాలు బయటకు తీసి చర్చకు పెడదాం. కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే రుణమాఫీ లెక్కలు తీసి చూపిస్తామన్నారు.

దేశానికి ప్రధానిని అందించిన గడ్డ కరీంనగర్‌. పరిపాలన ఎలా ఉంటుందో దేశానికి చూపిన తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు. తెలంగాణ ఇస్తామని సోనియాగాంధీ ఇక్కడి నుంచే ప్రకటన చేశారు. తెలంగాణ బిల్లును ఆమోదింపజేయడంలో కరీంనగర్‌ బిడ్డ, జైపాల్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్‌ పార్టీ మాట ఇస్తే ఎంత దూరమైనా వెళ్తుంది. పొన్నం ప్రభాకర్‌ను ఎంపీగా గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రం సాధించారు.

బండి సంజయ్‌ను రెండు సార్లు పార్లమెంట్‌కు పంపిస్తే కేంద్ర మంత్రి అయ్యారు కానీ, కరీంనగర్‌ జిల్లాకు కేంద్రం నుంచి చిల్లి గవ్వ అయినా తెచ్చారా? కరీంనగర్‌ అభివృద్ధి కోసం ఎప్పుడైనా పార్లమెంట్‌లో మాట్లాడారా?అంతకు ముందు 3 సార్లు బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే వాళ్లు కూడా కరీంనగర్‌కు చేసిందేమీ లేదని మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారన్నారు.

ఈ ఏడాది తెలంగాణలో కోటి 53 లక్షల మెట్రిక్‌ టన్నుల వడ్లు పండించారు.. అది మా గొప్పతనం కాదా? రూ.1.83 లక్షల కోట్లు ప్రజాధనాన్ని ప్రాజెక్టుల కోసం కేసీఆర్‌ ఖర్చు పెట్టారు. రంగనాయకసాగర్‌ వద్ద హరీశ్‌రావు ఫామ్‌హౌస్‌ కట్టుకున్నారు. భూ సేకరణ కోసం తీసుకున్న భూమిని హరీశ్‌రావు పేరు మీదకు రాయించుకున్నారు. భూ బదలాయింపులపై హరీశ్‌రావు లెక్క చెప్పాలి.. అన్ని లెక్కలు తీయిస్తున్నామన్నారు.