Telangana Civic Polls 2020 | (Photo-PTI)

Karimnagar, January 24: కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్ (Karimnagar Corporation) కు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్లకు బుధవారమే ఎన్నికలు జరిగినప్పటికీ, కోర్టు కేసుల నేపథ్యంలో కరీంనగర్ కార్పొరేషన్ పోలింగ్ (Polling) జనవరి 24కి పోస్ట్ చేయబడింది.

ఇక ఈ కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉండగా, 20 మరియు 37 డివిజన్లకు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనందున మిగతా 58 డివిజన్లకు ఈరోజు పోలింగ్ జరుగుతుంది. 58 కార్పొరేటర్ పదవుల కోసం వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి మొత్తం 369 మంది ఆశావాదులు పోటీ పడుతున్నారు. 58 డివిజన్లకు 337 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో 82 పోలింగ్ కేంద్రాలను హైపర్ సెన్సిటివ్ కేంద్రాలుగా గుర్తించి, పోలీసు శాఖతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే 14 కేంద్రాల్లో ఎన్నికలను వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించాలని అధికారులు నిర్ణయించారు.

కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 2.69 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అర్హులని అధికారులు పేర్కొన్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు రూట్ ఆఫీసర్లు, నోడల్ ఆఫీసర్లు, సెక్టార్ ఆఫీసర్లు, రిటర్నింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు మరియు పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ అధికారులు, వెబ్‌కాస్టింగ్ సిబ్బంది తదితరులతో సహా మొత్తం 2 వేల మంది పోలింగ్ ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు.

ఎక్కడైనా అంతరాయం కలిగి పోలింగ్ రద్దైనా లేదా అవకతవకలు జరిగినా, రేపు రీపోలింగ్ నిర్వహిస్తారు. కౌంటింగ్ మరియు ఫలితాల వెల్లడి జనవరి 27న జరుగుతుంది.

 

టెండర్ ఓట్ల నమోదు, మూడు కేంద్రాలలో రీపోలింగ్

 

మరోవైపు ఈనెల 22న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కొన్నిచోట్ల టెండర్ ఓట్లు పోలయ్యాయని గుర్తించిన ఎన్నికల సంఘం, ఆయా కేంద్రాలలో ఈరోజు రీపోలింగ్ (Re-Polling) నిర్వహిస్తోంది. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ 41వ వార్డ్ లోని పోలింగ్ స్టేషన్ నెంబర్ 198, కామారెడ్డి 41వ వార్డ్ లోని 101, బోధన్ లోని 32వ వార్డ్ లోని 87 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరుగుతుంది. ఓటర్ లిస్టులోని ఒకే పేరుతో ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది ఓటు వేసినట్లు అధికారులు గుర్తించడంతో ఈ మూడు పోలింగ్ కేంద్రాలలో అనివార్యంగా రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. సాయంత్రం 5 వరకు పోలింగ్ కొనసాగనుంది. మరొకటి నిజాంపేటలోనూ ఒక టెండర్ ఓటు పడినట్లు గుర్తించిన ఎన్నికల సంఘం దానిని పెండింగ్‌లో ఉంచింది.  నేడు, రేపు మద్యం షాపులు బంద్

ఇక 129 పురపాలక సంఘాలలో పోటీపడిన అభ్యర్థుల భవితవ్యం రేపు తేలనుంది. శనివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది, ఆ వెంటనే ఫలితాల వెల్లడి జరుగుతుంది.