Kerala Assembly Session: రసవత్తరంగా కేరళ రాజకీయం, సీఎం పినరయి విజయన్‌పై అవిశ్వాస తీర్మానం పెడతామని తెలిపిన కాంగ్రెస్‌ పార్టీ, పదవి నుంచి వైదొలగాని డిమాండ్, ఆగస్టు 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు
Congress leader Ramesh Chennithala and Kerala CM Pinarayi Vijayan. (Photo Credit: ANI/PTI)

Thiruvananthapuram, August 21: నిన్న మొన్నటిదాకా నార్త్ రాజకీయాలు రసవత్తరంగా సాగితే ఇప్పుడు సౌత్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ముఖ్యంగా కేరళలో గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం సీఎం పినరయి విజయన్ పీకల మీదకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కేరళలో పినరయి విజయన్‌ సర్కార్‌ అవిశ్వాస తీర్మానం (No-Confidence Motion) పెట్టేందుకు రెడీ అయింది. ఈనెల 24న అసెంబ్లీ సమావేశాల్లో (Kerala Assembly Session on August 24) కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతుందని ఆ పార్టీ నేత, విపక్ష నేత రమేష్‌ చెన్నితల (Ramesh Chennithala) శుక్రవారం స్పష్టం చేశారు.

అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన క్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ముఖ్యమంత్రి పదవి నుంచి వెంటనే వైదొలగాలని ఆయన డిమాండ్‌ చేశారు. కోవిడ్‌-19 పేరుతో జరిగిన అవినీతికి బాధ్యత వహిస్తూ తాము కేరళ సీఎం ( Pinarayi Vijayan Government) రాజీనామాకు డిమాండ్‌ చేస్తున్నామని చెప్పారు. కాగా, కేరళలో ఇటీవల వెలుగుచూసిన గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులోనూ పినరయి విజయన్‌ సర్కార్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.

ఇదిలా ఉంటే కోవిడ్‌-19 రోగులు, క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తుల కాల్‌ వివరాల రికార్డులను సేకరించరాదని పోలీసులను ఆదేశించాలంటూ కేరళ హైకోర్టులో రమేష్‌ చెన్నితల దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ కోసమే కోవిడ్‌-19 రోగుల టవర్‌ లొకేషన్‌ వివరాలను తాము వాడుతున్నామని కేరళ ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన హైకోర్టు రమేష్‌ చెన్నితల పిటిషన్‌ను కొట్టివేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ను వ్యాప్తి చేస్తున్న వారిని అరెస్ట్‌ చేసేందుకే పోలీసులు కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ కోసం కోవిడ్‌-19 రోగుల కాల్ రికార్డులను సేకరిస్తున్నారని అంతకుముందు కేరళ సీఎం పినరయి విజయన్‌ వివరణ ఇచ్చారు

విమానాశ్రయాలు ప్రైవేట్ పరం : ఖండించిన సీఎం విజయన్

కేంద్రం మూడు విమానాశ్రయాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో(పీపీపీ) లీజుకు ఇచ్చేందుకు ఆమోదం తెల‌ప‌డాన్ని కేరళ రాష్ర్ట ప్రభుత్వం ఖండించింది. తిరువ‌నంత‌పురం విమానాశ్ర‌యంతో పాటు మ‌రో మూడు విమానాశ్ర‌యాల నిర్వ‌హ‌ణ హ‌క్కుల‌ను ఓ ప్రైవేటు సంస్థ‌కు అప్ప‌గించాల‌ని కేంద్రం తీసుకున్న నిర్ణ‌యంపై కేర‌ళ ప్ర‌భుత్వం అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది.

విమానాశ్ర‌య కార్య‌క‌లాపాలు, నిర్వాహ‌ణ‌ను స్పెష‌ల్ ప‌ర్ప‌స్ వెహికిల్ ( ఎస్పీవీ) కి బదిలీ చేయాలని కేరళ పదేపదే చేసిన చేసిన అభ్యర్థనలను పట్టించుకోలేదని ముఖ్య‌మంత్రి పినరయి విజయన్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌ధాన వాటాదారుగా ఉన్న ఎస్పీవీకి తిరువ‌నంత‌పురం విమానాశ్ర‌య నిర్వాహ‌ణ బాధ్య‌త‌ల‌ను త‌మ‌కు అప్ప‌గిస్తామ‌ని 2003లో ఇచ్చిన హామీని కేంద్రం తుంగ‌లో తొక్కింద‌ని ఆరోపించారు. విమానాశ్ర‌య అభివృద్ధికి రాష్ర్ట ప్ర‌భుత్వం చేసిన కృషిని విస్మ‌రించింద‌ని, కేంద్రం తీసుకున్న ఏక‌ప‌క్షంగా ఉంద‌ని, దీన్ని తాము వ్య‌తిరేకిస్తున్నామ‌ని పేర్కొన్నారు