Madhya Pradesh Politics: కమల్ నాథ్ సర్కారుకు రేపే బల పరీక్ష, జైపూర్ నుంచి భోపాల్‌కు చేరుకున్న ఎమ్మెల్యేలు, బెంగుళూరులో ఉన్న మంత్రులను రాష్ట్రానికి పంపాలని అమిత్‌షాకు లేఖ రాసిన మధ్యప్రదేశ్ సీఎం
Kamal Nath - Jyotiraditya Scindia (Photo Credits: Facebook)

Bhopal, Mar 15: మధ్యప్రదేశ్ రాజకీయాలు (Madhya Pradesh Politics) తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ప్రతిపక్షాలు, అధికారాన్ని నిలుకునేందుకు కాంగ్రెస్ పార్టీ (Congress Party) సర్వ శక్తుల ఒడ్డుతున్నాయి. రాజకీయంగా సంక్షోభంలోకి కూరుకుపోయిన కమల్ నాథ్ సర్కార్ (Kamal Nath Govt) సోమవారం బలపరీక్షను ఎదుర్కోనుంది. ఈ విషయాన్ని స్వయంగా మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ లాల్జీ టాండనే ప్రకటించారు.ఈ మేరకు గవర్నర్ టాండన్ స్పీకర్ నర్మదా ప్రసాద్ ప్రజాపతిని ఆదేశించినట్లు సమాచారం.

సంక్షోభంపై షాకిచ్చిన కమల్ నాథ్ సర్కార్

బలపరీక్ష నిర్వహించాలంటూ శనివారం సాయంత్రం మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ బృందం గవర్నర్ లాల్జీ టాండన్‌ను (Madhya Pradesh Governor Lalji Tandon) కోరింది. ‘‘బీజేపీ నేతలం గవర్నర్ లాల్జీ టాండన్‌తో భేటీ అయ్యాం. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాకముందే బలపరీక్ష నిర్వహించాలని వినతి పత్రం సమర్పించాము’’ అని చౌహాన్ తెలిపారు.

కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం మైనారిటీలో పడిపోయిందని, అందుకని రాజ్యాంగ పరంగా వారికి ప్రభుత్వాన్ని నడిపే హక్కే లేదని చౌహాన్ స్పష్టం చేశారు. కమల్‌నాథ్ సర్కారు అసెంబ్లీలో తమ బల పరీక్షను నిరూపించుకోవాలని, అంత వరకూ ఎలాంటి నిర్ణయాలు తీసుకునే హక్కు వారికి లేదని చౌహాన్ అన్నారు.

ఎవరీ జ్యోతిరాదిత్య సింధియా, ఎందుకు కమల్ నాథ్ సర్కార్‌ని వణికిస్తున్నాడు

2018 లో కమల్‌నాథ్ నేతృత్వంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడినప్పటి నుంచీ అంతర్గతంగా సవాల్‌ను ఎదుర్కొంటూనే ఉంది. సీనియర్ నేత, ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు, యువనేత, రాజ కుటుంబానికి చెందిన జ్యోతిరాదిత్య సింధియాకు మధ్య యుద్ధం నడుస్తూనే ఉంది. చివరికి తాను కాంగ్రెస్‌లో ఉంటే ప్రజలకు సేవ చేయలేనని, అందుకే తాను పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరుతున్నానని సింధియా తన రాజీనామా లేఖలో ప్రస్తావించారు. అయితే సింధియాకు మద్దతుగా దాదాపు 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో కమల్‌నాథ్ సర్కారు మైనారిటీలో పడిపోయింది.

అవిశ్వాస తీర్మానపు వ్యూహంలో బీజేపీ, అత్యవసరంగా సోనియా గాంధీతో భేటీ అయిన మధ్యప్రదేశ్ సీఎం  కమల్‌ నాథ్

భోపాల్‌కు చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

ఈ పరిస్థితులు ఇలా ఉంటే జైపూర్ రిసార్టుల్లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం భోపాల్‌కు చేరుకున్నారు. దీంతో భోపాల్ విమానాశ్రయం పరిధిలో పోలీసులు ముందస్తు చర్యలో భాగంగా 144 సెక్షన్ విధించారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హరీశ్ రావత్ మాట్లాడుతూ బెంగళూరులోని 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్‌లోనే ఉన్నారని ప్రకటించారు. బల పరీక్షకు తాము సిద్ధంగానే ఉన్నామని, గెలుపుపై ధీమాతో ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు.

ఈ విషయంలో తమకెలాంటి ఇబ్బందీ లేదని, ప్రతిపక్ష బీజేపీకే ఇబ్బంది అని అన్నారు. మరోవైపు గవర్నర్ బలపరీక్షకు ఆదేశించడంపై మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బలపరీక్షకు ఆదేశించడం గవర్నర్ హక్కు కాదని, అది స్పీకర్ హక్కు అని అన్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సీఎం కమల్‌నాథ్ లేఖ

బెంగళూరు రిసార్టుల్లో ఉన్న 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మధ్యప్రదేశ్‌కు చేర్చడంలో చొరవ తీసుకోవాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సీఎం కమల్‌నాథ్ లేఖ రాశారు. బెంగళూరు రిసార్టుల్లో ఉన్న రెబెల్స్‌ను వెంటనే విడుదల చేయాలని ఆయన లేఖలో డిమాండ్ చేశారు. ‘‘ఆ 22 మంది ఎమ్మెల్యేలు క్షేమంగా మధ్యప్రదేశ్ చేరుకునేట్లు చూడండి. మీ అధికారాన్ని ఉపయోగించి వారిని భోపాల్‌కు చేర్చండి. ఎలాంటి భయ భ్రాంతులు లేకుండా వారందరూ 16 వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలి’’ అని సీఎం లేఖలో పేర్కొన్నారు.