MAHA Govt Suspence: మహాలో మరో కీలక మలుపు, ప్రభుత్వ ఏర్పాటు దిశగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల కూటమి, రాష్ట్రపతి పాలన అంటూ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు, రాష్ట్ర ప్రజలను అవమానించడమేనన్న శివసేన
Maharashtra govt formation Cong MP Writes Letter To Sonia Gandhi, Says 'can Form Govt With Sena (Photo Credits: IANS)

Mumbai, Novemebr 2: మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఫలితాలు ప్రకటించి వారం దాటినా అక్కడ గవర్నమెంట్ ఎవరు ఏర్పాటు చేస్తారనే దానిపై ఇంకా కొలిక్కి రాలేదు. బిజెపి దాని మిత్రపక్షం శివసేన మధ్య చర్చలు ఓ పట్టాన తేలకపోవడంతో అధికార ఏర్పాటుకు కాంగ్రెస్ ఎన్సీపీ సరికొత్త ఎత్తుగడకి తెరలేపిందని తెలుస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం నవంబర్‌ 8న ముగిసిపోనుంది.ఈ లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. నవంబర్ 7లోపు ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే ఇక రాష్ట్రపతి పాలన విధిస్తారంటూ బీజేపీ నేత సుధీర్‌ మృదుగంటివార్ వ్యాఖ్యలపై శివసేన ఘాటుగా స్పందించింది. రాష్ట్రపతి పాలన వస్తుందంటూ బెదిరించడం ముమ్మాటికీ రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని వ్యాఖ్యానించింది. నన్ను‘మహా’ సీఎం చేయమంటున్న రైతు, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారికి రైతు శ్రీకాంత్ విష్ణు గడాలే లేఖ

వీరిద్దరి మధ్య సీన్ ఇలా నడుస్తుంటే తాజాగా కాంగ్రెస్‌ ఎంపీ హుసేన్‌ దల్వాయి సోనియా గాంధీకి రాసిన లేఖతో మహా రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. మిత్రపక్షం ఎన్సీపీ, శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేయాలని ఆయన పార్టీ అధ్యక్షురాలిని కోరారు. లేఖలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏం జరిగిందో మనం చూశాం. మన పార్టీ ఎమ్మెల్యేలను, ఇతర రాజకీయపార్టీల నేతలను బీజేపీ కొనుగోలు చేసింది. ఒకవేళ వాళ్లు మరోసారి అధికారంలోకి వస్తే ఇదే పునరావృతం చేస్తారు. బీజేపీ- శివసేనల మధ్య సయోధ్య కుదరటం లేదు. కాబట్టి మన మిత్ర పక్షం ఎన్సీపీ, శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుంటుందని కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. తద్వారా మన ఎమ్మెల్యేలను కాపాడటంతో పాటు పార్టీ పునాదులను కూడా బలోపేతం చేసుకోవచ్చు. బీజేపీ కంటే శివసేన ఎన్నోరెట్లు మెరుగైన నిర్ణయాలు తీసుకుంటుందని దల్వాయి సోనియాకు రాసిన లేఖలో పేర్కొన్నారు.  కొనసాగుతున్న ‘మహా’ సస్పెన్స్, పట్టు విడవని శివసేన

దీనికి తోడు మీడియా సమావేశంలో దల్వాయి శివసేనపై ప్రశంసలు కురిపించారు. మరాఠా ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న శివసేన బీజేపీ కంటే ఎంతో ఉన్నతమైన సిద్ధాంతం కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీ వేళ ప్రతిభా పాటిల్‌ రాష్ట్రపతి పోటీలో నిలిచినపుడు శివసేన కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిందని ఈ సంధర్భంగా గుర్తు చేశారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవేళ శివసేన ప్రభుత్వ ఏర్పాటులో తమ సహాయం కోరితే తప్పక సానుకూలంగా స్పందిస్తామని పేర్కొన్నారు.

మరోవైపు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) ముఖ్య ప్రతినిధి నవాబ్ మాలిక్ మాట్లాడుతూ బిజెపి, శివసేన రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైతే, తమ పార్టీ ప్రత్యామ్నాయం ఇవ్వడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. మృదుగంటివార్‌ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ-శివసేనలకు ప్రజలు అవకాశం ఇచ్చారు. అయితే అందుకు ఆ పార్టీలు విఫలమైతే మేము ప్రత్యామ్నాయాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తామన్నారు.

288 శాసనసభ స్థానాలు కలిగిన మహారాష్ట్రలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 సీట్లు గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే కూటమిగా ఎన్నికలకు వెళ్లిన బీజేపీ- శివసేన మధ్య ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి పదవి విషయంలో విభేదాలు తలెత్తడంతో మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి.