Hyderabad, July 23: మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు బీజేపికి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ కు తన రాజీనామా లేఖను పంపినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన మాట్లాడుతూ బీజేపీలో తనకు సరైన స్థానం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన అనుభవం, సుదీర్ఘ రాజకీయ చరిత్ర దృష్టిలో పెట్టుకొని అయినా కనీసం తనకు బీజేపిపి కేంద్ర కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు.
మాజీ మంత్రి ఈట రాజేంధర్ పార్టీలోకి చేర్చుకోవటం పట్ల కనీసం తనకు ఒక్క మాట కూడా అడకకపోవటం సిగ్గుచేటుగా భావిస్తున్నట్లు మోత్కుపల్లి తెలిపారు. ఇటీవల సీఎం కేసీఆర్ దళిత సాధికారత కోసం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి తన అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా ఆహ్వానం అందిన విషయాన్ని బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు సమాచారం ఇచ్చే వెళ్లినట్లు ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ విషయం పట్ల బీజీపీలో తనపై భిన్నాభిప్రాయాలు రావడం తనను బాధించిందని, ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఇక, కేసీఆర్ తీసుకువచ్చిన 'దళిత బంధు' అద్భుతమైన పథకం అని మోత్కుపల్లి ప్రశంసించారు. సీఎం కేసీఆర్ పైన విశ్వాసంతోనే తాను బీజేపీకి రాజీనామా చేశానని మోత్కుపల్లి అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోయిందని, హుజురాబాద్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి మద్ధతు పలకాలని దళితులకు, తన అనుచరులకు మోత్కుపల్లి పిలుపునిచ్చారు. ఈటల రాజేందర్ అవినీతిపరుడని, ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా లేదని మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు.
కాగా, మోత్కుపల్లి నర్సింహులు మాటలను బట్టి ఆయన త్వరలోనే తెరాసలో చేరే అవకాశం ఉన్నట్లు అర్థం అవుతోంది. ఈటల రాజేంధర్ టీఆర్ఎస్ పార్టీని వీడినప్పటి నుంచి ఆయన సీఎం కేసీఆర్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీకి మద్ధతుగా నిలవాలని ప్రకటనలు చేయడం గమనార్హం.