Mumbai, Oct 30: బీహార్ రాష్ట్రం ముంగేర్ జిల్లాలో దుర్గామాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా పోలీసులు, ఉత్సవాల్లో పాల్గొన్నవారికి మధ్య జరిగిన ఘర్షణలు, కాల్పులు (Munger Firing Incident) సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి విదితమే. ఈ కాల్పుల ఘటనను హిందూత్వపై దాడిగా (attack on Hindutva) శివసేన ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. ఈ ఘర్షణలు ఎన్‌డీఏ పాలిత రాష్ట్రమైన బీహార్‌లో చోటుచేసుకున్నాయి కాబట్టి అక్కడి గవర్నర్‌గానీ, బీజేపీ నేతలుగానీ నోరు మెదపడం లేదని రౌత్ (Shiv Sena MP Sanjay Rout) విమర్శించారు.
అదే మహారాష్ట్రలోనో, పశ్చిమబెంగాల్‌లోనో, రాజస్థాన్‌లోనో, బీజేపీ ప్రభుత్వ భాగస్వామిగా లేని మరో రాష్ట్రంలోనో జరిగితే పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ పాలనలో లేని రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే ఆ పార్టీ నేతలతోపాటు, ఆయా రాష్ట్రాల గవర్నర్‌లు రాష్ట్రపతి పాలన కోసం డిమాండ్ చేసేవారని సంజయ్ రౌత్ మండిపడ్డారు. మరి ఇప్పుడు బీహార్ గవర్నర్, బీహార్ బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే బిహార్‌లోని ముంగేర్ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) లిపి సింగ్‌ను (Munger Superintendent of Police (SP) Lipi Singh) విధుల నుంచి తొలగించాలని భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ఆదేశించింది. ఇటీవల జరిగిన సంఘటనపై మగధ్ డివిజినల్ కమిషనర్ అసంగ్బ చుబ ఆవో దర్యాప్తు చేస్తారని తెలిపింది. దర్యాప్తు నివేదికను 7 రోజుల్లోగా సమర్పించాలని ఆదేశించింది. ముంగేర్‌లోని ఎస్పీ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు గురువారం దాడి చేసి, విధ్వంసం సృష్టించారు. కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు.
ఈ నెల 26న దుర్గామాత నిమజ్జనోత్సవాల సందర్భంగా పోలీసులకు ఉత్సవంలో పాల్గొన్న వారికి జరిగిన ఘర్షణల్లో ఓ యువకుడు మరణించడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనలో దాదాపు 20 మంది పోలీసులు కూడా గాయపడ్డారు. ఎస్పీ లిపి సింగ్ తండ్రి రామచంద్ర ప్రసాద్ సింగ్ జనతా దళ్ యునైటెడ్ పార్టీ నేత. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆమె 2016 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి. ఎస్పీ లిపి సింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో ఆయన్ని ఎన్నికల విధుల నుండి ఈసీఐ తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.
దుర్గా భక్తులపై కాల్పులు మరియు లాఠీఛార్జ్ చేయడం సి ఎం నితీష్ కుమార్ (CM Nitish Kumar) మరియు డిప్యూటీ సిఎం సుశీల్ మోడీ ల ఆదేశానువేశంతో జరిగిందని, అందువల్ల వారు ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదని ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జేవాలా పేర్కొన్నారు. ముంగేర్ లో దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేసిన అమాయక ప్రజలు పోలీసులపై దాడి చేసిన తీరు, జలియన్ వాలాబాగ్ లో జనరల్ డయర్ నేతృత్వంలో బ్రిటిష్ పాలనలో పోలీసుల క్రూరత్వం కూడా ఇలాగే ఉందని అన్నారు.
ఇలాంటి ప్రభుత్వ దురాగతాలు ఎక్కడా అరుదుగా కనిపిస్తాయి. ముంగేర్ లో జరిగిన పోలీసు కాల్పుల్లో ఒక యువకుడు మరణించగా, ఎనిమిది మంది గాయపడ్డారని, పోలీసుల క్రూరమైన లాఠీచార్జిలో పెద్ద సంఖ్యలో యువకులు, మహిళలు, ఇతరులు గాయపడ్డారని ఆయన తెలిపారు. ముంగేర్ డిఎం సిఎం నితీష్ కుమార్ కు ఇష్టమైన బ్యూరోక్రాట్ కాగా, పోలీసు సూపరింటెండెంటు తన పార్టీ జనతాదళ్-యునైటెడ్ (జెడియు) సీనియర్ నాయకుడి కుమార్తె అని సుర్జేవాలా చెప్పారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే హక్కు నితీష్ ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు. ఇంత పెద్ద సంఘటన తర్వాత ప్రధాని మోడీ మూగప్రేక్షకుడిగా మిగిలిపోయి తన మౌనాన్ని భగ్నం చేయాలని ఆయన అన్నారు.