New delhi,Oct 30: దాయాది దేశం పాకిస్తాన్ కు చెందిన ఓ మంత్రి పుల్వామా దాడి (Pulwama Attack) వెనుక పాకిస్తాన్ హస్తం ఉందనీ, ఆ ఘటన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విజయమని ప్రకటించడం సంచలనం రేపిన సంగతి విదితమే. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో చర్చ సందర్భంగా శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఫవద్ చౌధరి ఈ మేరకు ప్రకటన చేశారు. అయితే దీనికి మందు అభినందన్‌ని విడుదల చేయకపోతే భారత్ దాడి చేస్తుందని ఆర్మీ చీఫ్‌కే కాళ్లలో వణుకు పుట్టినట్టుగా పీఎంఎల్–ఎన్ నేత అయాజ్ సాధిక్ ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యలు అర్థ రహితమని పేర్కొంటూ పాక్ మంత్రి పుల్వామా విజయాన్ని ప్రస్తావించారు.
భారత్‌ను వారి దేశంలోనే గట్టి దెబ్బ తీశాం. పుల్వామా విజయం ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలో మన జాతి సాధించిన విజయం. ఈ విజయంలో మీరు, మేము, మనందరమూ భాగస్వాములమే’’అని అన్నారు. అయితే దీనిపై సభలో కొందరు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో పుల్వామాలో విజయం అన్న వ్యాఖ్యలను మాత్రం వెనక్కు తీసుకునేందుకు మంత్రి నిరాకరించారు.
అసలు పాకిస్తాన్ ఎంపీ అయాజ్ సాధిక్ ఏమన్నారు ?
మేజర్ అభినందన్ వర్ధమాన్.. ఈ పేరు వింటేనే చాలు భారతీయుల గుండెలు ఉప్పొంగుతాయి. గత ఏడాది ఫిబ్రవరిలో కశ్మీర్‌లోని పుల్వామా దాడి ఘటన అనంతరం పాక్ చెరలో ఉన్న వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ప్రదర్శించిన శౌర్య పరాక్రమాలకు సాక్షాత్తూ పాకిస్తాన్ ఆర్మీ జనరల్ చీఫ్ కమర్ జావేద్ బాజ్వా వెన్నులో వణుకు పుట్టింది. ‘‘బాజ్వా కాళ్లు వణికాయి, నుదుటంతా చెమటలు పట్టాయి, పాక్ చెరలో ఉన్న అభినందన్‌ను విడుదల చేయకపోతే భారత్ ఎక్కడ దాడికి దిగుతుందోనని ఆయన నిలువెల్లా వణికిపోయారు’’అని పాకిస్తాన్ ఎంపీ, పాక్ ముస్లిం లీగ్–నవాజ్ (పీఎంఎల్–ఎన్) నాయకుడు సర్దార్ అయాజ్ సాధిక్ బుధవారం పార్లమెంటులో వెల్లడించారు.
గత ఏడాది ఫిబ్రవరి 26, 2019న జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 40 మంది భారత్ జవాన్లు నేలకొరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం రెండు దేశాల మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ సందర్భంగా ఇరుపక్షాల మధ్య జరిగిన వైమానిక పోరులో పాక్ యుద్ధవిమానం ఎఫ్–16ని అభినందన్ మిగ్–21 విమానంతో వెంబడించారు. పాక్ విమానాన్ని కూల్చేశారు. అదే సమయంలో మిగ్ విమానం పాక్ భూభాగంలో కూలిపోవడంతో అభినందన్‌ను పాక్ సైన్యం అదుపులోకి తీసుకుంది.
మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా మాటల్లో..
అభినందన్ పాకిస్తాన్ ఆర్మీకి చిక్కినపుడు కార్గిల్ యుద్ధ సమయంలో నా ఫ్లైట్ కమాండర్ అహుజా పట్టుబడిన విషయం గుర్తుకువచ్చింది. నేను అభినందన్ తండ్రితో..సర్.. అహుజాను వెనక్కి తీసుకురాలేకపోయాం. కానీ అభినందన్‌ను కచ్చితంగా తీసుకొస్తామని చెప్పాను. పాకిస్తాన్‌కు భారత్ సామర్థ్యమేమిటో తెలుసు. అందుకే అభినందన్‌ను అప్పగించారని భారత మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా గతేడాది ఫిబ్రవరి నాటి విషయాలను (BS Dhanoa on Balakot Airtrike) గుర్తుచేసుకున్నారు.
ఐఏఎఫ్ మాజీ చీఫ్ ధనోవా ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. ‘‘ ఆనాడు పాకిస్తాన్‌పై రెండు అంశాలు తీవ్ర ప్రభావం చూపాయి. ఒకటి, దౌత్య, రాజకీయపరంగా వస్తున్న ఒత్తిడి. మరోవైపు భారత ఆర్మీ శక్తిసామర్థ్యాలు తెలిసి ఉండటం. ఆయన(సాదిఖ్) చెప్పినట్లు అతడి(జనరల్ కమర్ జావేద్ బజ్వా) కాళ్లు వణకడం వంటివి జరిగింది అందుకే. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సామర్థ్యం గురించి వారికి అవగాహన ఉంది. ఫిబ్రవరి 27న వాళ్లు దాడికి సిద్ధమయ్యారు. అందుకు దీటుగా బదులిచ్చేందుకు, వాళ్ల ఫార్వర్డ్ బ్రిగేడ్స్‌ను నామరూపాల్లేకుండా చేసేందుకు సన్నద్ధమయ్యామని ధనోవా (Former Air Force chief BS Dhanoa) తెలిపారు.
పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపుదాడి
అప్పటికే వాళ్లకు విషయం అర్థమైంది. భారత ఆర్మీని తట్టుకుని నిలబడిగే శక్తి తమ మిలిటరీకి ఉందా లేదా అన్న విషయం గురించి ఆలోచన మొదలైంది. అభినందన్‌ను విడిచిపెట్టడం తప్ప వాళ్లకు వేరే మార్గం లేకపోయింది’’ అని చెప్పుకొచ్చారు. కాగా స్వ్యాడ్రన్ లీడర్ అజయ్ ఆహుజా 1999లో పాకిస్తానీ సాయుధ బలగాల చేతిలో మరణించారు. తాను నడుపుతున్న మిగ్-21 కూలిపోవడంతో పాక్ ఆర్మీ చేతికి చిక్కిన ఆహుజా.. దేశ రక్షణకై ప్రాణాలు అర్పించారు.
పుల్వామాకు ప్రతీకారంగా బాలాకోట్ దాడి
పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద గత ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన సెలవులను ముగించుకుని విధులకు హాజరు కావడానికి బయలుదేరిన సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జైషె మహ్మద్ ఆత్మాహూతి దళ సభ్యుడు చేసిన దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. పుల్వామా ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారత సైన్యం..12 రోజుల తరువాత పాకిస్తాన్‌పై (2019 Balakot airstrike) విరుచుకుపడింది. జమ్మూ కాశ్మీర్‌లో సరిహద్దులను దాటింది. పాకిస్తాన్‌లోని ఖైబర్ ఫక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో గల బాలాకోట్ పరిసరాల్లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత వైమానిక దళం బాంబుల వర్షాన్ని కురిపించింది.
బాలాకోట్ పరిసరాల్లోని పర్వత శ్రేణులను బేస్ క్యాంపులుగా మలచుకుని ఉగ్రవాదులను తయారు చేసే జైషె మహ్మద్ సంస్థ శిక్షణా కేంద్రాలవి. ఈ దాడిలో 35 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్లు వార్తలు వచ్చాయి. బాలాకోట్ దాడుల కోసం భారత వైమానిక దళం మిరజ్ 2000 ఎయిర్ క్రాఫ్ట్‌లను వినియోగించింది. ఇజ్రాయెల్‌లో తయారైన స్పైస్ బాంబులను ప్రయోగంచింది.వైమానిక దాడుల సందర్భంగా ఆ సంస్థకు చెందిన పలు ఉగ్రవాద శిబిరాలు నేలమట్టం అయ్యాయి. దీనికి సంబంధించి వైమానిక దళాధికారులు విడుదల చేసిన ఉపగ్రహ ఫొటోలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. 128 చదరపు మీటర్ల పరిధిలో విధ్వంసం సృష్టించినట్లు నిర్ధారించాయి.
పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్ వైమానిక ఘటనల అనంతరం రెండు దేశాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బాలాకోట్ వైమానిక దాడులను అడ్డుగా పెట్టుకుని పాకిస్తాన్.. భారత్‌ను అంతర్జాతీయ వేదికలపై ఆరోపణలు చేయడానికి చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. పాకిస్తాన్ ప్రభుత్వ పెద్దలకు భంగపాటు ఎదురైంది. అదే సమయంలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలను పాకిస్తాన్ నుంచి కొనసాగుతున్నాయంటూ భారత్ సైతం ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించింది. ఉగ్రవాదులకు అండదండలు అందిస్తోందనే విషయాన్ని మరోసారి ఉటంకించింది.
అభినందన్ వర్థమాన్ సాహసానికి మరో గుర్తింపు
అనంతరం- పాకిస్తాన్ భూభాగం నుంచే ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్నాయనే విషయాన్ని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లడంలో సఫలమైంది భారత్. దీనితో జైషె మహ్మద్, లష్కరే తొయిబా వంటి సంస్థల అధినేతలను అరెస్టు చేయాలంటూ పాకిస్తాన్ ప్రభుత్వంపై ప్రపంచ దేశాలు ఒత్తిడి తీసుకొచ్చాయి.