Rajya Sabha Chairman M Venkaiah Naidu (Photo Credits: ANI)

New Delhi, September 21: వ్యవసాయ బిల్లులపై ఓటింగ్‌ సందర్భంగా పార్లమెంట్‌లో ఆదివారం చోటుచేసుకున్న గందోరగోళంపై (Rajya Sabha Ruckus Over Farm Bills) రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ హక్కుల మర్యాదలకు భంగం కలిగించే విధంగా విపక్ష సభ్యులు వ్యవహరించారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో రభస సృష్టించిన కొందరు ప్రతిపక్ష సభ్యులపై చైర్మన్ ఎం. వెంకయ్యనాయుడు (M. Venkaiah Naidu) సస్పెన్షన్ వేటు వేశారు.

ఇవాళ ఉదయం సభ ప్రారంభం కాగానే మొత్తం ఎనిమిది మంది ఎంపీలను వారం రోజుల పాటు సభ నుంచి బహిష్కరిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రతిపక్ష సభ్యులపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ (Rajya Sabha deputy chairman) పట్ల విపక్ష సభ్యులు ‘‘అనుచితంగా’’ వ్యవహరించారనీ... దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాననీ చైర్మన్ వెంకయ్య ఈ సందర్భంగా పేర్కొన్నారు. డెరెక్ ఓ బ్రైన్, సంజయ్ సింగ్, రాజు సతవ్, కెకె రగేష్, రిపున్ బోరా, డోలా సేన్, సయ్యద్ నజీర్ హుస్సేన్, ఎలమరన్ కరీం తదితరులు సస్పెన్షన్ వేటు పడిన వారిలో ఉన్నారు. ఆదివారం రాజ్యసభలో వ్యవసాయ రంగ బిల్లులను ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సభలో తగిన సంఖ్యాబలం ఉన్నప్పటికీ.. మూజువాణి ఓటుద్వారా వ్యవసాయ బిల్లులను ఆమోదించుకునేందుకు కేంద్రం ప్రయత్నించడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం, ఏకమై నోటీసు ఇచ్చిన 12 విపక్ష పార్టీలు, ప్రతిపక్షాల ఆందోళనను విస్మరిస్తూ బిల్లులు ఆమోదిస్తారా అంటూ ధ్వజమెత్తిన విపక్షాలు

వారం రోజుల పాటు ఈ తీర్మానం అమల్లో ఉండనుంది. మరోవైపు చైర్మన్‌ నిర్ణయంపై విపక్ష పార్టీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు పెద్ద ఎత్తున నష్టం చేకూరుస్తున్న బిల్లులపై కనీసం మాట్లాడటానికి అవకాశం ఇవ్వనందునే తాము నిరసన వ్యక్తం చేశామని చెబుతున్నారు.

విపక్షాల నిరసనల మధ్య వ్యవసాయ బిల్లులకు ఆమోదం

మరోవైపు డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌పై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీస్‌ను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తిరస్కరించారు. 12 పార్టీలు కలిసి 50 మంది ఎంపీల సంతకాలతో అవిశ్వాస తీర్మానం నోటీస్‌ను ఇచ్చారు. డిప్యూటీ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నోటీస్ ఆమోదయోగ్యం కాదన్న చైర్మన్.. దానిని తిరస్కరించారు. 90 సీ నిబంధ‌న ప్ర‌కారం డిప్యూటీ చైర్మ‌న్‌పై నోటీసు ఇవ్వ‌డానికి 14 రోజుల గ‌డువు ఇవ్వాల‌ని, ప్ర‌తిప‌క్ష‌నేతతో పాటు ఇత‌ర స‌భ్యులు ఇచ్చిన నోటీసులు చెల్ల‌దు అని చైర్మ‌న్ వెంక‌య్య తెలిపారు.