DMK Leader A Raja (Photo Credits: ANI)

Chennai, Mar 29: మరో రెండు వారాల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు (Tamil Nadu Assembly Elections 2021) జరగనున్నాయి. ఈ క్రమంలో పార్టీలన్ని ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నాయి. తాజాగా, ముఖ్యమంత్రి పళనిస్వామిపై ( Tamil Nadu CM E Palaniswami) కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే నేత రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్రమ సంబంధ జంటకు పళనిస్వామి జన్మించారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రీమెచ్చుర్‌గా పళని పుట్టాడని, ఢిల్లీకి చెందిన డాక్టర్‌ నరేంద్ర మోదీ హెల్త్‌ సర్టిఫికెట్‌ ఇచ్చారని తెలిపారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

ఈ వ్యాఖ్యలపై పెను దుమారం రేగడంతో తమిళనాడు ముఖ్యమంత్రి పళనీస్వామికి డీఎంకే నాయకుడు ఎ రాజా ఎట్టకేలకు క్షమాపణలు (DMK leader A Raja apologises) చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలపై సీఎం పళనీస్వామి బావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టిన ఒక రోజు తర్వాత రాజా క్షమాపణలు చెప్పారు. ‘‘నేను పళనీస్వామిపై చేసిన వ్యాఖ్యలపై పళనీస్వామి ఏడుస్తున్నట్లు చూసి చాలా బాధపడ్డాను’’ అని రాజా పేర్కొన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చెపాక్‌లో ఇటీవల జరిగిన ప్రచార కార్యక్రమంలో రాజా మాట్లాడుతూ సీఎం పళని స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేయగా ఈ వ్యాఖ్యలపై సీఎం పళని ఆదివారం స్పందించారు. తన తల్లిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై భావోద్వేగానికి గురయ్యారు. దేవుడు వారిని శిక్షిస్తారని ప్రచార సభలో పేర్కొన్నారు. అనంతరం సోమవారం ఏ.రాజ ఆ వ్యాఖ్యలపై స్పందించారు.

పుదుచ్చేరి సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం, మే 2న కౌంటింగ్ మరియు ఫలితాల వెల్లడి

‘నా వ్యాఖ్యల ఉద్దేశం వ్యక్తిగతం కాదు. రాజకీయంగా మాత్రమే విమర్శలు చేశా’ అని రాజా వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా క్షమాపణలు ప్రకటించారు. అయితే ఆ వ్యాఖ్యలు చేసినందుకు అన్నాడీఎంకే నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు కూడా నమోదైంది. దీంతోపాటు ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తండ్రి వారసత్వంతో స్టాలిన్‌లా రాజకీయాల్లోకి రాలేదు : సీఎం పళనిస్వామి 

ఇక తండ్రి వారసత్వంతో స్టాలిన్‌లా రాజకీయాల్లోకి రాలేదని, ఒక్కో మెట్టు ఎక్కి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నానని సీఎం పళనిస్వామి స్పష్టం చేశారు. సోమవారం ధర్మపురి జిల్లాలో పళనిస్వామి విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. హోసూరులో అన్నాడీఎంకే అభ్యర్థి జ్యోతి బాలకృష్ణారెడ్డికి మద్దతు నిర్వహించిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ అమ్మ పథకాలు అమలవ్వాలంటే రెండాకులను గెలిపించుకోవాలని కోరారు.

స్టాలిన్‌ సమర్థుడు కాదనే విషయం కరుణానిధికి కూడా తెలుసని, అందుకే ఆయన చేతికి అధికారం ఇవ్వకుండా చివరి క్షణం వరకు తన వద్దే ఉంచుకున్నారన్నారు. స్టాలిన్‌ను తండ్రే నమ్మనప్పుడు ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. అనంతరం పాలక్కోడులో మంత్రి అన్బళగన్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. అలాగే బీజేపీ అభ్యర్థి రాకేష్‌కుమార్‌ తరఫున ప్రచారం నిర్వహించారు. తిరువణ్ణామలై పర్యటన ముగించుకుని ధర్మపురి వెళుతున్న ముఖ్యమంత్రి పళనిస్వామికి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చెన్నై – సేలం గ్రీన్‌ వే వ్యవహారంలో పళని స్వామి వైఖరికి నిరసనగా రైతులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు.

సీఎం పళనిస్వామి.. డీఎంకే స్టాలిన్ కాలి చెప్పు పాటి విలువ కూడా చేయరు : రాజా

ఇదిలా ఉంటే ‘సీఎం పళనిస్వామి.. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కాలికి వేసుకున్న చెప్పు పాటి విలువ కూడా చేయరు’ అంటూ రాజా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. ‘ఒకప్పుడు బెల్లం మార్కెట్‌‌లో కూలీగా పనిచేసి పళనిస్వామికి స్టాలిన్‌తో పోటీయా.. పళని కంటే స్టాలిన్ వేసుకునే చెప్పుకు విలువ ఎక్కువ.. అలాంటిది తనకు స్టాలిన్‌నే సవాల్ చేసే ధైర్యం ఉందా. నెహ్రూ, ఇందిరా గాంధీ, మోదీ సైతం చేయలేని సాహసం పళనిస్వామి చేస్తున్నాడంటే అందుకు కారణం డబ్బు. రాష్ట్రాన్ని లూటీ చేసిన తనను పార్టీని రక్షిస్తుందని భావిస్తున్నాడు. అటువంటి వ్యక్తి స్టాలిన్‌ను అడ్డుకుంటాను అని అంటున్నాడు. అదే జరిగితే సీఎం వాహనం తన నివాసం నుంచి కార్యాలయానికి వెళ్లదని నేను సవినయంగా మనవిజేస్తున్నానని రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు, కొలిక్కి వచ్చిన కాంగ్రెస్-డీఎంకే మధ్య సీట్ల పంచాయితీ, కన్యాకుమారి లోక్‌సభ స్థానంతో పాటు 25 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం

డీఎంకే నేత రాజా చేసిన వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం పళనిస్వామి. చేస్తున్నారు. తాను ఒక రైతునని, పేద కుటుంబం నుంచి వచ్చానని, అందువల్ల వినయంగా ఉంటానంటూ ప్రజల్లో తన మీద సానుభూతి పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో 2జీ స్పెక్ట్రం కుంభకోణాన్ని ప్రస్తావించిన సీఎం.. కంటికి కనిపించని గాలితో కూడా కుంభకోణాలు చేసిన ఏకైక పార్టీ డీఎంకే అని ధ్వజమెత్తారు.

ఈ క్రమంలో మదురై జిల్లా మెలూర్‌లోని ఎన్నికల ప్రచారంలో పళనిస్వామి మాట్లాడుతూ..‘నేను కష్టపడి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాను. కానీ స్టాలిన్ తండ్రి సీఎంగా ఉన్నందున ఆయన సిల్వర్ స్పూన్‌తో పుట్టారు. రాజా మాట్లాడిన భాష ఎలా ఉందో చూడండి.. నా విలువ స్టాలిన్ ధరించే చెప్పు కన్నా తక్కువని.. పొగరుగా మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రిని చెప్పుతో పోల్చి వారు ఎంతటి సంస్కారహీనులో నిరూపించుకున్నారు.

అర్థరాత్రి సీట్ల ఒప్పందం, తమిళనాడులో 20 సీట్లలో బీజేపీ పోటీ, కన్యాకుమారి లోక్‌సభ నియోజకవర్గానికి బీజేపీ నుంచి పొన్‌ రాధాకృష్ణన్‌ బరిలో..

నేను ఒక రైతును, మా పేదలు అలానే ఉంటారు.. మేము కష్టపడి పనిచేస్తాం.. మేం కొనుక్కోగలిగింది మాత్రమే కొనుగోలు చేస్తాం... కానీ వారు రూ. 1.76 లక్షల కోట్ల అవినీతి కుంభకోణం వెనుక ఉన్నారు. కాబట్టి కోరుకున్నది కొనుక్కుంటారు’ అంటూ పళనిస్వామి రాజాకు కౌంటర్ ఇచ్చారు.

అధికారంలోకి రాగానే సాగు చట్టాలకు వ్యతిరేకంగా మొదటి తీర్మానం

ఇదిలా ఉంటే తాము అధికారంలోకి రాగానే అసెంబ్లీలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా మొదటి తీర్మానం చేస్తామని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ప్రకటించారు. సీఏఏకు వ్యతిరేకంగా కూడా తీర్మానం చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టాలిన్ సోమవారం జోలార్‌పేట్ నియోజకర్గంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ.... పేద ప్రజల నడ్డి విరిచేలా, కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చేలా కేంద్రం సాగు చట్టాలను తీసుకొచ్చిందని విమర్శించారు.

అన్నాడీఎంకే, పీఎంకే మాత్రం సాగు చట్టాలకు మద్దతిచ్చాయని మండిపడ్డారు. ఎన్నికలు దగ్గరపడటంతో సాగు చట్టాలకు తాము వ్యతిరేకమని, వాటిని అమలు చేయమని అన్నాడీఎంకే మాట మార్చిందని స్టాలిన్ మండిపడ్డారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, కేరళ, బెంగాల్ రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానాలు చేశాయని, కానీ సీఎం పళని మాత్రం అసెంబ్లీలో తీర్మానం చేయలేదని స్టాలిన్ సూటిగా ప్రశ్నించారు.

స్టాలిన్‌ గ్యారంటీగా సీఎం అవుతారు: రాహుల్‌ గాంధీ

డీఎంకే చీఫ్‌ ఎంకే స్టాలిన్‌ గ్యారంటీగా తమిళనాడు సీఎం అవుతారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఆదివారం సేలంలో అన్నాడీఎంకే ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు. స్టాలిన్‌ సీఎం అన్నది ఎప్పుడో నిర్ణయమైందని, ఎన్నికలు ఆ విషయాన్ని నిర్ధాయిస్తాయని చెప్పారు. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ వద్ద అంతులేని డబ్బు ఉన్నదని, అందుకే పోరాటాన్ని ఆపకూడదని రాహుల్‌ తెలిపారు. వారిని నిలువరించాలంటే మొదట తమిళనాడులో ఓడించాలని, తర్వాత ఢిల్లీలో అధికారం నుంచి తప్పించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

అమిత్‌ షా లేదా మోహన్ భగవత్‌ కాలిని తాకాలని ఏ తమిళ వ్యక్తి కోరుకోరని రాహుల్‌ తెలిపారు. అయితే సీఎం పళనిస్వామి వారి ముందు ఎందుకు మోకరిల్లుతున్నారు అన్న ప్రశ్న తలెత్తుతున్నదని అన్నారు. వాస్తవానికి మోదీ ముందు తలవంచడం ఆయనకు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. అయితే ఈడీ, సీబీఐని ప్రధాని నియంత్రిస్తున్నారని, సీఎం అవినీతి పరుడుకావడంతో భయంతో మోకరిల్లుతున్నారని రాహుల్‌ విమర్శించారు.