TDP vs YSRCP: మాచెర్లలో టీడీపీ నేతలపై దాడి, వైసీపీ కార్యకర్తలే అని టీడీపీ ఆరోపణ, ఘటనను తీవ్రంగా ఖండించిన చంద్రబాబు, ఇదంతా టీడీపీ డ్రామా అని కొట్టిపారేసిన మంత్రి బొత్స సత్యనారాయణ
TDP leaders sustained inuries in attack at Macherla | Photo Twitter

Guntur, March 11: గుంటూరు జిల్లా మాచర్లలో (Macherla)  బుధవారం మధ్యాహ్నం టీడీపీ (TDP) సీనియర్ నేత బోండా ఉమా మహేశ్వర రావు (B Umamaheshwara Rao), ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలపై (Buddha Venkanna)  దాడి జరిగింది. వారు ప్రయాణిస్తున్న కారుపై వైసీపీ కార్యకర్తగా అనుమానిస్తున్న ఓ వ్యక్తి ఒక పెద్ద దుడ్డు కర్రతో దాడికి దిగాడు. కర్రను లోపలికి గుచ్చుతూ బీభత్సం సృష్టించాడు. దీంతో డ్రైవర్ వెంటనే స్పందించి కారును వేగంగా ముందుకు కదిలించడంతో ఈ ఇద్దరు నేతలు అక్కడ్నించి తప్పించుకోగలిగారు. వీరికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ దాడి జరిగిన వెంటనే టీడీపీ నేత చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) స్పందించారు. వెంటనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి దాడి ఘటనను ఖండించిన ఆయన, మీడియా సమావేశం లైవ్ లో ఉండగానే బొండా ఉమాకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తమపై జరిగిన దాడి ఘటనను అధినేత చంద్రబాబుకు బొండా ఉమా వివరిస్తూ, మాచెర్ల నుంచి తప్పించుకుని ఏదో దిక్కున తాము వెళ్తున్నప్పటికినీ, కొంతమంది మోటార్ సైకిళ్లు, స్కార్పియో వాహనాలతో తమను వెంబడించారని చెప్పారు. తమ గన్ మెన్ తుపాకీ చూపించినప్పటికీ అతడిపై కూడా దాడి చేశారు. మేము మార్కాపురం రూట్లో వెళ్తుండగా జిల్లా ఎస్పీ, కొంతమంది పోలీసులతో వచ్చి తమకు ఎస్కార్ట్ కల్పించారని, పోలీసు కారులో వెళ్తున్నప్పటికీ తాము క్షేమంగా వెళ్తామనే నమ్మకం కూడా లేదు. ఎస్పీ వాహనంపై కూడా వైసీపీ రౌడీలు దాడులకు దిగారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని బోండా ఉమా ఆరోపించారు.  ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ నుంచి అధికార పార్టీ వైసీపీలోకి భారీగా వలసలు

ఈ దాడిలో మరోకారులో ప్రయాణించిన హైకోర్ట్ లాయర్ కిషోర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన తలకు గాయం కావడంతో రక్తస్రావం జరిగింది. మొదట ఈయనకే కాల్ చేసిన చంద్రబాబు దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. తమను వెంబడించి కొంతమంది వైసీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారని తెలిపారు. ప్రాణభయంతో అక్కడ్నించి తప్పించుకున్నామని, ఏపీ పోలీసులపై నమ్మకం లేక తెలంగాణ వైపు వచ్చామని ఆయన చెప్పారు. దీంతో చంద్రబాబు మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో దగ్గర్లో ఉన్న పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయమని వారికి చంద్రబాబు దిశానిర్ధేషం చేశారు.

అనంతరం వైసీపీపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. వైసీపీ అరాచకాలు పరాకాష్టకు చేరుకున్నాయన్నారు. రాష్ట్రంలో అసలు న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం అంటూ ఉన్నాయా అని ప్రశ్నించారు. దీనిపై డీజీపీ ఏం సమాధానం చెబుతారని చంద్రబాబు నిలదీశారు.

అయితే టీడీపీ వర్గం చేస్తున్న ఆరోపణలపై వైసీపీ (YSRCP) ఎదురుదాడికి దిగింది. టీడీపీ నేతలే కావాలని రెచ్చగొట్టి, దాడులకు ప్రేరేపిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపి మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) మాట్లాడుతూ ఇదంతా టీడీపీ కుట్రగా అభివర్ణించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని టీడీపీ కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించాలన్నదే చంద్రబాబు కుట్ర అని, ప్రశాంతంగా ఎన్నికలు జరిగితే గెలవలేమనే చంద్రబాబు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని బొత్స విమర్శించారు.