Rajya Sabha Polls: టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన, సీనియర్ నేత కే.కేశవరావుకు మరోసారి ఛాన్స్, మరో స్థానానికి సురేశ్ రెడ్డిని ఖరారు చేసిన సీఎం కేసీఆర్
TRS Rajya Sabha Nominees | Photo Official

Hyderabad, March 13:  త్వరలో జరగబోయే రాజ్యసభ (Rajya Sabha)  ఎన్నికలకు తెరాస పార్టీ (TRS) తమ అభ్యర్థులను ఖరారు చేసింది. తెలంగాణలో ఖాళీ ఏర్పడిన 2 రాజ్యసభ స్థానాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అభ్యర్థులను ప్రకటించారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు డాక్టర్ కే. కేశవరావు (K. Keshava Rao) కు మరోసారి అవకాశం కల్పించగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ గా వ్యవహరించిన కె.ఆర్. సురేష్ రెడ్డి (KR Suresh Reddy) ని రెండో అభ్యర్థిగా ఖరారు చేశారు. తమకు అవకాశం కల్పించినందుకు ఈ ఇద్దరు నేతలు గురువారం సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. శుక్రవారం ఉదయం వీరిద్దరూ నామినేషన్ వేయనున్నారు.  రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్‌ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

రాజ్యసభ ఎంపీగా గెలవాలంటే కనీసం 35 నుంచి 40 శాసన సభ్యుల మద్ధతు అవసరం ఉంటుంది. ఈ విషయంలో తెరాసకు సంపూర్ణమైన సంఖ్యాబలం ఉండటం, మిగతా పార్టీలకు కనీసం పది సీట్లు కూడా లేకపోవడంతో రాజ్యసభ ఎంపీలుగా కేశవరావు మరియు సురేష్ రెడ్డిల గెలుపు ఏకగ్రీవమే కానుంది.

టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ సీటు దక్కించుకోవడం కోసం కేశవరావు, సురేశ్ రెడ్డిలతో పాటు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గట్టి ప్రయత్నాలు చేశారు. హెటిరో సంస్థ అధినేత పార్థసారథి రెడ్డి, నమస్తే తెలంగాణ పత్రిక సీఎండీ దామోదర రావు, గ్యాదరి బాలుమల్లు తదితరులు కూడా పోటీపడ్డారు. నిజామాబాద్ మాజీ ఎంపీ, కేసీఆర్ కుమార్తె కవిత పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. అయితే అనేక రకాల సమీకరణాలు, ఆలోచనలు చేసిన సీఎం కేసీఆర్ చివరకు కేకే మరియు సురేశ్ రెడ్డిల పేర్లనే ఫైనల్ చేశారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డికి మాత్రం నిరాశ తప్పలేదు.

ఇక రాజ్యసభ స్థానాలు ఖరారు అయిన నేపథ్యంలో ఖాళీ అయిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఎవరికి కేటాయిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  వచ్చే నెల ఏప్రిల్ 7వ తేదీన దీనికి పోలింగ్ జరగనుంది.

టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన ఆర్. భూపతి రెడ్డి, ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో జారీ చేశారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం అభ్యర్థన మేరకు మండలి చైర్మన్ భూపతిరెడ్డిపై అనర్హత వేటు వేయడంతో ఆయన మండలి అభ్యర్థిత్వాన్ని కోల్పోయారు. ఈ క్రమంలో ఆ స్థానం ఖాళీ అయింది.