Hyderabad, November 28: దిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే. లక్ష్మణ్ (Kova Laxman) రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, సీఎం కేసీఆర్ (CM KCR) తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలు, నిరంకుశ పాలన, నియంతృత్వ పోకడలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. తెలంగాణలో నెలకొన్న సమస్యలు జాతీయ స్థాయిలో ఫోకస్ కాబడేలా 2020 జనవరి నుంచి ప్రజాపోరాటాలను చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై లక్షణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ ప్రైవేటీకరణ పేరుతో పేదలకు, సామాన్యులకు ప్రభుత్వ విద్య దక్కకుండా చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలను మూసేసి వాటి స్థానంలో బార్లను తెరవాలని చూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నో స్కూళ్లు మూతబడ్డాయని తెలిపారు. బడులే కాదు, ఆర్టీసీనీ మూసేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం సిద్ధమైంది. ఆర్టీసీ సమస్యను కేంద్ర ప్రభుత్వం గమనిస్తుంది. ఇప్పటికే కేంద్రం నుంచి సీఎం కేసీఆర్ కు సూచనలు వెళ్లాయి. ఆర్టీసీ సమ్మెను కొనసాగించడని కార్మికులకు లక్షణ్ పిలుపు
ఈరోజు జరిగే మంత్రివర్గ భేటీలో ఆర్టీసీని ప్రైవేటుపరం (TSRTC Privatization) చేసే నిర్ణయం తీసుకుంటే భాజాపా చూస్తూ ఊరుకోదని కేసీఆర్ ప్రభుత్వాన్ని లక్ష్మణ్ హెచ్చరించారు.
ఇటు తెలంగాణ జనసమితి (TJS) అధ్యక్షుడు ప్రొ. కోదండరామ్ అధ్యక్షతన ప్రతిపక్షాలు, ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాల నేతలు కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆర్టీసీని రక్షించాలి, ప్రైవేటీకరణ ఆలోచనను మానుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను ప్రభుత్వం అణగదొక్కుతుందని మండిపడ్డారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోమని స్పష్టంచేశారు. కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.