Hyd, Oct 3: ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM MODI) పచ్చి అబద్దాలకోరని మంత్రి కేటీఆర్(Minister KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కూడా ఎన్డీఏలో చేరతామని తెలంగాణ సీఎం కేసీఆర్ తన వద్దకు గతంలో వచ్చారంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తాము ఎన్డీఏలో ఎందుకు చేరతామన్న కేటీఆర్.. తమకు ఏమైనా పిచ్చి కుక్క కరిచిందా? వారితో కలవడానికి అంటూ ఎదురుప్రశ్నించారు.
‘ఏ రాష్ట్రానికి వెళ్లినా మోదీ ఇలానే మాట్లాడతారు. మోదీ వ్యాఖ్యలు బాధాకరం.. శోచనీయం. మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అంతా అవినీతి సీఎంలే. ప్రధాని స్థాయిలో ఉండి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. యువరాజు అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు. అందుకే బీజేపీని జుమ్లా పార్టీ అనేది. జయ్‌షా ఎవరు.. బీసీసీఐ సెక్రటరీ పదవి ఎందుకు ఇచ్చారు?, మోదీ నుంచి ఎన్‌ఓసీ తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. నేను సీఎం కావడానికి మోదీ పర్మిషన్ అవసరమా?
గత ఎన్నికల్లో బీజేపీ 105 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. ఈసారి బీజేపీకి ఒక్క ఎంపీ స్థానం కూడా రాదు. అదానీ విషయంలో ఎందుకు వెనుకడుగువేశారు?, ఇప్పుడు ఎన్డీఏను కీలక పార్టీలు వదిలేశాయి.. వారికి మిగిలింది ఈడీ.. సీబీఐనే. మేము ఢిల్లీ గులామ్‌లు కాదు..గుజరాతీ బానిసలం కాదు. ఎన్డీఏ అనేది మునిగిపోయే నావ.. అందులోకి వెళ్లాలని మేము ఎందుకు అడుగుతాం. ఎన్డీఏలో మేము ఎందుకు చేరతాం.. మాకు ఏమైనా పిచ్చి కుక్క కరిచిందా?, కర్ణాటకలో కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్ డబ్బులిచ్చిందని మోదీ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. మోదీ ఎంత అరిచినా తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కే జై కొడతారు’ అని కేటీఆర్ తెలిపారు.
బీజేపీ పెద్ద జుమ్లా పార్టీ. వాట్సాప్ యూనివర్సిటీకి మోదీ వైస్ ఛాన్స్‌లర్. ప్రధాని మోదీ మంచి స్టోరీ రైటర్. మంచి కథలు కూడా చెప్తారు.మోదీ యాక్టింగ్‌కి ఆస్కార్ అవార్డు కూడా వస్తుంది. ఒకవైపు మేము కర్ణాటకలో కాంగ్రెస్‌కు ఫండింగ్ చేశామని ఆరోపిస్తున్నారు. మరోవైపు మేము ఎన్డీఏలో చేరుతామన్నట్లు చెబుతున్నారు. పార్టీలన్నీ ఎన్డీఏను వదిలి బయటకు వెళ్తున్నాయి. ఎన్డీఏ(NDA)లోకెళ్లడానికి మేము పిచ్చివాళ్లం కాదు. శివసేన జనతాదళ్, టీడీపీ అన్ని పార్టీలు మిమ్మల్ని వదిలి బయటికి వెళ్లాయి.
అసలు మీతోటి ఉన్నది ఎవరు. సీబీఐ, ఈడీ ఐటీ తప్ప మీతో ఉన్నదెవరు. మీ పార్టీలో చేరిన హిమంత బిశ్వశర్మ, సీఎం రమేష్, సుజనాచౌదరి, నారాయణరాణా, జ్యోతి రాధిత్య సిందియాలపై కేసులు ఏమయ్యాయి. కేసీఆర్ ఫైటర్ మీలాంటి చీటర్లతో కలిసి ఎన్నడూ పనిచేయరు. మేము ఢిల్లీ, గుజరాత్‌కు గులాల్మం కాదు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో రెండుసార్లు అధికారంలో ఉన్నాం. నన్ను సీఎంను చేయడానికి ప్రధాని పర్మిషన్ అడిగినట్లు చెబుతున్నారు. వారేమైనా మా పోలిట్ బ్యూరోనా వారి అనుమతి ఎందుకు తీసుకోవాలి’’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.