
Hyderabad, October 16: తెలంగాణలో హుజూర్ నగర్ ఉపఎన్నిక (Huzur Nagar By poll) పైన ఇప్పుడు అందరి దృష్టి ఉంది. సీపీఐ మినహా మిగతా ప్రధాన పార్టీ అభ్యర్థులందరూ పోటీలో ఉన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి సైదిరెడ్డి (Sanampudi Saidireddy), కాంగ్రెస్ తరఫున పద్మా ఉత్తమ్ రెడ్డి (Nalamada Padmavathi Reddy), బీజేపీ తరఫున కోటా రామారావు, సీపీఎం తరఫున పారేపల్లి శేఖర్ రావు, టీడీపీ తరఫున చావా కిరణ్మయి, స్వతంత్ర అభ్యర్థిగా 'తీన్మార్' మల్లన్న (నవీన్ కుమార్) మరియు ఇతర స్వతంత్ర అభ్యర్థులతో కలిపి మొత్తంగా 28 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీకి మద్ధతు ప్రకటించిన సీపీఐ, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మద్ధతు ఉపసంహరించుకుంది.
గతంలో కమ్యూనిస్టులా ఖిల్లాగా ఉన్న హుజూర్ నగర్ నియోజకవర్గం రానురాను పట్టుకోల్పోయింది. గత కొన్ని దఫాలుగా ఇక్కడ కాంగ్రెస్ - టీఆర్ఎస్ నువ్వానేనా అన్నట్లు పోటీపడుతున్నాయి. ఈ ఉపఎన్నికల్లో కూడా ప్రధాన పోటీ కాంగ్రెస్ - టీఆర్ఎస్ మధ్యేనని విశ్లేషకులు చెప్తున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్)కి 92,996 ఓట్లు పోలవగా, సైదిరెడ్డి (టీఆర్ఎస్)కి 85,530 ఓట్లు పోలయ్యాయి.
ఎవరు గెలుస్తారనేదానిపై భారీగా బెట్టింగ్
గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉదృతంగా సాగుతుంది. ఈ సమ్మెకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి, మరోవైపు ఉద్యోగ సంఘాల సమస్యలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి వారి మద్ధతు లభించకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ మినహా మిగతా పార్టీలు పోటీలో ఉన్నా అవి వాటి గెలుపుకంటే కూడా టీఆర్ఎస్ ను ఓడించేందుకు ఎక్కవ ప్రయత్నాలు చేస్తాయి. ఈ ఉపఎన్నికలో గెలిచినా- ఓడినా టీఆర్ఎస్ పార్టీకి ఏం ఫరక్ పడకపోయినా, ఎలాగైనా గెలిచి ఇప్పటికీ ప్రజామద్ధతు తమకేనని ప్రతిపక్షాలకు ఒక గట్టి సందేశం ఇవ్వటానికి ఈ ఉపఎన్నికను అధికార పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అక్టోబర్ 17న సీఎం కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగుతుండటంతో, ఇక్కడ పరిస్థితి ఏమైనా మారుతుందా అని ఆసక్తి నెలకొంది. గెలుపు ఎవరిదనేదానిపై ఉత్కంఠ నెలకొనడంతో బుకీలు కూడా రంగంలోకి దిగారు, ఎవరు గెలుస్తారు? మెజారిటీ ఎంతవస్తుంది, ఎవరి డిపాజిట్లు గల్లంతవుతాయి అనే వాటిపై కోట్ల రూపాయల బెట్టింగ్స్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కాగా, అక్టోబర్ 21న ఈ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది, అక్టోబర్ 24న కౌంటింగ్, అదే రోజు ఫలితాల విడుదల.