Hyderabad, October 28: ఆర్టీసీ సమ్మెపై నేడు హైకోర్టులో విచారణ జరుగనున్నది. ఆర్టీసీ జెఎసి నేతలతో తమ చర్చల వివరాలను అధికారులు హైకోర్టుకు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో తమ తప్పేమీ లేదని అధికారులు కోర్టుకు విన్నవించనున్నారు. చర్చల వీడియో టేపును అధికారులు కోర్టుకు సమర్పించనున్నారు. అధికారుల తీరుపై కార్మిక సంఘాల జెఎసి కూడా కోర్టుకు వివరించనున్నది. కాగా తాము ఇచ్చిన 46 డిమాండ్లపై చర్చించాలని కోరుతూ ఇంచార్జ్ ఎండీకి జేఏసీ లేఖ రాసింది. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆగదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. చర్చల నుంచి అధికారులే మధ్యలో వెళ్లి పోయారన్నారు. చర్చలకు ఎప్పుడూ పిలిచినా సిద్ధంగా ఉన్నామని అశ్వాత్థామరెడ్డి తెలిపారు.
కాగా మూడు వారాలకు పైగా తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఇటు యాజమాన్యం బెట్టు వీడడం లేదు, అటు కార్మికులు మెట్టు దిగడం లేదు. దీనికి తోడు కోర్టు సూచనతో జరిగిన చర్చల్లో కూడా ప్రతిష్ఠంభన నెలకొంది. అసలు చర్చలు జరగకుండానే అజెండా విషయంలోనే భేదాభిప్రాయాలు వచ్చి కార్మికులు బయటికొచ్చేశారు. ఈ పరిస్థితుల్లో హైకోర్టు ఆర్టీసీ సమ్మెపై ఇచ్చే ఆదేశాలు ఇప్పుడు కీలకంగా మారాయి. ఆర్టీసీ సమ్మె విషయంతో పాటు కార్మికులకు సెప్టెంబర్ జీతాలపై కూడా హైకోర్టు క్లారిటీ ఇవ్వనుంది. విధుల్లో చేరమంటుందా, లేక కార్మికుల వాదనకు అంగీకరిస్తుందా అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వం మధ్య సామాన్యులు నలిగిపోతున్నారని ఇప్పటికే హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ఈ విషయంలో న్యాయస్థానం ఎలాంటి చొరవ తీసుకుంటుందనేది ఆసక్తికర అంశంగా మారింది. మరోవైపు ఆర్టీసీ జేఏసీ ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. కలెక్టరేట్ల ముట్టడించాలని జేఏసీ ఇచ్చిన పిలుపుకు కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు ప్రకటించాయి.
చర్చలు విఫలం కావడంతో సీఎం కేసీఆర్ మరోసారి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఇన్‌చార్జ్ ఎండీ సునీల్‌శర్మ, ఈడీలు హాజరయ్యారు. సమావేశంలో కోర్టుకు ఇవ్వాల్సిన నివేదికపై నిశితంగా చర్చించారు. చర్చలు విఫలంకావడంతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఆర్టీసీ సమ్మెపై తాడోపేడో తేల్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుతోంది. ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చలను బహిష్కరించి వెళ్లిపోయారని కోర్టుకు ఆర్టీసీ యాజమాన్యం నివేదిక ఇవ్వనున్నది. ప్రత్యామ్నాయ చర్యలు వేగవంతం చేస్తూనే ఆర్టీసీలో అద్దె బస్సులను పెంచేందుకు మరిన్ని నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ఈ సందర్భంగా కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ రూట్లపై త్వరలో సర్వే నిర్వహించి రూట్లు, విధి విధానాలపై కసరత్తు చేయాలని మంత్రి, అధికారులను కేసీఆర్ ఆదేశించారు.