Ratnagiri,August 24: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను (Narayan Rane Arrested) రత్నగిరి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. జన ఆశీర్వాద్ యాత్రలో పాల్గొన్న నారాయణ్ రాణే సీఎం ఉద్ధవ్ థాకరేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు అందడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
రాణే తరపున అడ్వకేట్ అనికేత్ నికమ్ బోంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాణేపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్‌లను రద్దు చేయాలని కోరారు. ఆయనను అరెస్టు (Union Minister Narayan Rane Arrested) చేయకుండా రక్షణ కల్పించాలని కోరారు. ముందస్తు బెయిలు కోసం నారాయణ్ రాణే చేసిన విజ్ఞప్తిని రత్నగిరి కోర్టు తిరస్కరించింది. అంతకుముందే రాణేను అరెస్ట్ చేస్తున్నట్లు నాసిక్ కమిషనర్ పాండే ప్రకటించారు. అయితే అరెస్ట్ నేపథ్యంలో ముంబై హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయగా నారాయణ్ రాణేకు చుక్కెదురైంది. అత్యవసరంగా పిటిషన్ విచారించలేమని ముంబై హైకోర్టు తెలిపింది. కేంద్ర మంత్రి నారాయణ్ రాణేపై వేర్వేరు ప్రాంతాల్లో 4 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ప్రస్తుతం వాటిపై విచారణ కొనసాగుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నారాయణ్ రాణే జన ఆశీర్వాద్ యాత్రలో భాగంగా సోమవారం రాయ్‌గఢ్‌లో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (Maharashtra CM Uddhav Thackeray) ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ప్రసంగించినపుడు, మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎన్ని సంవత్సరాలైందనే విషయాన్ని మర్చిపోయారని తెలిపారు. ఎన్ని సంవత్సరాలైందో లెక్కపెట్టాలని తన సహచరులను ఉద్ధవ్ ప్రసంగం మధ్యలో కోరారన్నారు. ముఖ్యమంత్రికి స్వాతంత్ర్యం వచ్చి ఎన్ని సంవత్సరాలైందో తెలియకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఆ సమయంలో తాను అక్కడ ఉండి ఉంటే గట్టిగా చెంప దెబ్బ కొట్టి ఉండేవాడినన్నారు. దీంతో శివసేన నేతలు తీవ్రంగా స్పందించి, రాణేపై ఫిర్యాదులు చేశారు. వీథుల్లోకి వచ్చి ధర్నాలు కూడా చేశారు.
ఇదిలావుండగా, బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ, పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలన్నారు. తాను వారిని బెదిరించడం లేదన్నారు. గతంలో ఇలా ప్రవర్తించినవారు ఇప్పుడు ఎలా ఉన్నారో గుర్తుపెట్టుకోవాలన్నారు. బీజేపీ కార్యాలయాలపై దాడి చేస్తే సహించబోమన్నారు. హింసపై తమకు నమ్మకం లేదని చెప్పారు. దాడులు చేసి తమను బెదిరించలేరని, తాము మౌనంగా ఉండబోమని చెప్పారు. మహావికాస్ అఘడి ప్రభుత్వాన్ని దేవేంద్ర ఫడ్నవీస్ ఖాకీ సర్కార్‌గా అభివర్ణించారు.
దేశంలో కొత్తగా 25,467 కరోనా కేసులు, నిన్న 354 మంది మృతి, ప్రస్తుతం భారత్‌లో 3,19,551 యాక్టివ్ కేసులు
థాకరేపై రాణే చేసిన ప్రకటనను వ్యక్తిగతంగా తాను సమర్ధించడం లేదని అయితే పార్టీ ఆయన వెన్నంటి నిలిచిందని చెప్పారు. షర్జిల్ ఉస్మానీ భారత మాతను అవమానపరిచినా ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, కేంద్ర మంత్రి రాణేపై మాత్రం మహారాష్ట్ర సర్కార్ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని దుయ్యబట్టారు. మహా సర్కార్ ఖాకీల అండతో హింసను ప్రేరేపిస్తోందని ఆరోపించారు.
కేంద్రమంత్రి నారాయణ్ రాణేపై పూణే పోలీసులు మరో కేసు నమోదు చేశారు. యువసేన ఫిర్యాదు మేర రాణేపై పూణే నగరంలోని చతుర్ శృంగి పోలీసులు ఐపీసీ సెక్షన్ 153, 505 కింద మరో కేసు నమోదు చేశారు. ఉద్ధవ్ ఠాక్రే చేసిన ప్రసంగంలో స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరాన్ని మర్చిపోయారని రాణే ఆరోపించారు. కరోనా నిబంధనల ఉల్లంఘనతో పాటు సీఎంపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో రాణేపై కేసులు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉద్ధవ్ థాకరేకు వ్యతిరేకంగా కేంద్రమంత్రి నారాయణ్ రాణే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రెండు పార్టీల కార్యకర్తలు బాహాబాహీలకు దిగారు. తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో రెండు పార్టీల కార్యకర్తలు కర్రలతో కొట్టుకున్నారు. నారాయణ్ రాణే వ్యాఖ్యలను నిరసిస్తూ శివసేన కార్యకర్తలు ఆయన ఇంటిని ముట్టడించేందుకు ర్యాలీగా బయలుదేరారు. దాంతో బీజేపీ కార్యకర్తలు కూడా గుంపులుగా వచ్చి వారిని అడ్డగించారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరినొకరు తోసుకున్నారు, కొట్టుకున్నారు. చివరికి పోలీసులు రంగప్రవేశం చేసి రెండు వర్గాల వారిని చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది