Vamsi Resign Reactions mla chintamaneni prabhakar fires on ycp in twitter (Photo-Twitter)

Amaravathi, October 28: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం వేడెక్కింది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామాతో ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. వంశీ అధికార పార్టీ తనపై కక్ష సాధింపు చర్యలు చేస్తోందని అందుకే టీడీపీ పార్టీని వీడుతున్నానని లేఖ రాయడంతో రాజకీయాల్లో కలకలం మొదలైంది. ఆయనకు అండగా ఉంటామంటూ టీడీపీ నేతలు స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని కూడా ట్విట్టర్ వేదికగా వైసీపీపై మండిపడ్డారు. మీ అరెస్టులు మమ్మల్ని భయపెట్టలేవు, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఎంత దూరమైనా వెళ్తాను, దేనికైనా తెగిస్తా' అని తెలుగుదేశం నేత, పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు.

కాగా టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో పలు వివాదాల్లో చిక్కుకున్న చింతమనేని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆపై పలు కేసుల్లో పోలీసులు అయన్ను అరెస్డ్ చేశారు కూడా. తనను వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసుకుందని, కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తోందని చింతమనేని ఆరోపిస్తున్నారు. తాజాగా అరెస్టుల వ్యవహారంపై ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు.

చింతమనేని రియాక్షన్ 

ఇక టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వంశీకి అండగా ఉంటామని చెప్పారు. తన రాజీనామాకు దారితీసిన అంశాలను వివరిస్తూ, వంశీ లేఖ రాయగా, దానిపై చంద్రబాబు స్పందించారు. చంద్రబాబు స్పందనపై కృతజ్ఞతలు తెలుపుతూ, వంశీ మరో లేఖను రాయగా, చంద్రబాబు దానిపైనా స్పందించారు. వంశీకి పార్టీ పట్ల ఉన్న అంకితభావం, ఆయన చేసిన పోరాటాలను తాను మరువలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వంశీ చేసే పోరుకు తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. సమస్యలను పరిష్కరించుకుని, ఓ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుదామని చంద్రబాబు సూచించారు. వంశీని బుజ్జగించే బాధ్యతలను ఎంపీ కేశినేని నాని, పార్టీ నేత కొనకళ్ల నారాయణలకు చంద్రబాబు అప్పగించినట్టు తెలుస్తోంది.

వల్లభనేని వంశీ వ్యవహారంపై టీడీపీ నేత కేశినేని నాని కూడా స్పందించారు. టీడీపీని వీడేందుకు వల్లభనేని వంశీ సిద్ధంగా లేరని, అలాగే ఆయనను వదులుకోవడానికి టీడీపీ సిద్ధంగా లేదని వ్యాఖ్యానించారు. ఆయన తరఫున పోరాడడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని, కేసులకు భయపడి రాజకీయాలకు దూరం కాకూడదని సూచించారు. వంశీతో మాట్లాడడానినికి తాను ప్రయత్నిస్తున్నానని కేశినేని నాని తెలిపారు. వంశీలాంటి మంచి రాజకీయ నేత రాజకీయాలను దూరంగా ఉండడం మంచిది కాదని అన్నారు. వంశీది టీడీపీ డీఎన్ఏ అని వ్యాఖ్యానించారు.

వంశీ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో బీజేపీ నేత రఘురాం మరో బాంబు పేల్చారు. వల్లభనేని వంశీతో పాటు టీడీపీ మరో నేత గంటా శ్రీనివాసరావు కూడా బీజేపీ, వైసీపీని సంప్రదిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, వైసీపీతో చర్చించే వంశీ రాజీనామా చేశారని తెలిపారు. ఏపీలో ప్రస్తుతానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ భవిష్యత్తు బీజేపీదేనని రఘురాం అన్నారు.