
Amaravathi, April 8: ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో ఉన్న 7,220 ఎంపిటిసిలు, 515 జెడ్‌పిటిసి స్థానాలకు గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. అనివార్య కారణాల చేత కొన్ని కేంద్రాల్లో పోలింగ్ నిలిచిపోయింది. అక్కడ శుక్రవారం రీపోలింగ్ నిర్వహించనున్నారు.
అయితే పంచాయతీ ఎన్నికలకు 81.78 శాతం పైగా పోలింగ్ జరగగా, ఈరోజు జరిగిన పరిషత్ ఎన్నికల్లో మాత్రం పోలింగ్ శాతం గణనీయంగా తగ్గింది. కేవలం 60.91 శాతం పోలింగ్ నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో గరిష్ఠంగా 68.27 పోలింగ్ శాతం నమోదు కాగా, కనిష్ఠంగా ప్రకాశం జిల్లాలో 51.68 పోలింగ్ శాతం నమోదైంది.
ఏపీలో వరుసగా ఎన్నికలు రావడం, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించటం అలాగే తీవ్రమైన ఎండ మొదలైన కారణాలు పోలింగ్ శాతం తగ్గటానికి కారణం కావొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఎంపిటిసి స్థానాలకు మొత్తం 18,782 మంది అభర్థులు పోటీపడగా, జిలా పరిషత్ నియోజకవర్గాలకు 2,058 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. షెడ్యూల్ ప్రకారం కౌంటింగ్ ఏప్రిల్ 10న జరగాల్సి ఉండగా హైకోర్ట్ అందుకు బ్రేకులు వేసింది. తాము తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు కౌంటింగ్ నిర్వహించరాదని ఆదేశించింది. దీంతో హైకోర్ట్ నిర్ణయించిన తేదీ తర్వాత ఈ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.