![](https://test1.latestly.com/wp-content/uploads/2021/03/Bharat-Bandh-380x214.jpg)
New Delhi, March 26: కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని నెలలుగా దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు శుక్రవారం 'భారత్ బంద్'కు పిలుపునిచ్చారు. రైతు సంఘాల యూనియన్ 'సమ్యుక్త్ కిసాన్ మోర్చా' ఇచ్చిన 12 గంటల భారత్ బంద్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బంద్ శుక్రవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది.
బంద్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారుల దిగ్భంధనం, రైలు రోకో కార్యక్రమాలతో రైతులు నిరసన వ్యక్తం చేయనున్నారు. రవాణా వర్తక, వాణిజ్య మరియు ఇతర అన్ని సేవలు కూడా నిలిచిపోనున్నాయి. అయితే అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఉంటుంది.
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గతే ఏడాది నవంబర్ 26న దిల్లీ సరిహద్దుల్లో ప్రారంభమైన రైతుల ఆందోళనలు మార్చి 26తో 4 నెలలు పూర్తయిన నేపథ్యంలో రైతు సంఘాల యూనియన్ దేశవ్యాప్త దిగ్భంధనానికి పిలుపునిచ్చింది.
ఆటో-రిక్షా సంఘాలు, మోటారు రవాణా సంఘాలు కూడా రైతుల బంద్ కు మద్ధతు తెలుపుతూ నిరసనల్లో భాగస్వామ్యం కావాలని నిర్ణయించాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. రైతు సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపుకు అధికార వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీఎస్పీ మరియు వామ పక్షాలు మద్ధతు తెలిపాయి. ఏపిలోని అన్ని జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మరోవైపు రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బంద్ ప్రభావం పాక్షికంగా ఉండనుంది.
పంజాబ్- హరియాణ రాష్ట్రాలలో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. అమృత్సర్ లోని వాల్లా ప్రాంతంలో రైల్వే ట్రాక్ లపై బైఠాయించి రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
దిల్లీని మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని కలిపే ఘజియాపూర్ సరిహద్దును రైతులు దిగ్భంధనం చేశారు. దీంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.
ఒడిషా రాష్ట్రంలో స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గల విద్యాసంస్థలకు ఒడిషా ప్రభుత్వం ఈరోజు సెలవు ప్రకటించింది.