Telangana Budget 2023: ముగిసిన గవర్నర్ తమిళిసై ప్రసంగం, కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయాన్ని దేశంలో పండుగలా మార్చింది, పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంలా మారిందని తెలిపిన గవర్నర్
Tamilisai Soundararajan (Photo-Video Grab)

Hyd, Feb 3: తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు (Telangana Budget 2023) ప్రారంభం అయ్యాయి. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ పోచారం సమక్షంలో జనగణమన ఆలాపనతో సమావేశాలు లాంఛనంగా మొదలయ్యాయి. సీఎం కేసీఆర్‌ దగ్గరుండి గవర్నర్‌కు ‍హాల్‌లోకి స్వాగతం పలికారు. ప్రజాకవి కాళోజీ మాటలను ప్రస్తావిస్తూ ఆమె ప్రసంగం ప్రారంభమయింది.

తన ప్రభుత్వం అపూర్వమైన విజయాలను సాధించిందని ఆమె (Governor Tamilisai Soundararajan) అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని తెలిపారు. దేశ ధాన్యాగారంగా తెలంగాణ అవతరిస్తోందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో సీఎం, మంత్రుల కృషి ఎంతో ఉందని అన్నారు.

కొత్త సచివాలయంలో జరిగింది అగ్ని ప్రమాదం కాదు.. మాక్ డ్రిల్ అంటున్న అధికారులు!

పెట్టుబడులకు తెలంగాణ (Telangana) స్వర్గధామంలా మారిందని అన్నారు. సంక్షోభం, అభివృద్ధిలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో 24 గంటలూ విద్యుత్ సరఫరా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆమె ప్రసంగం కొనసాగుతోంది.వ్యవసాయ రంగంలో తెలంగాణ ప్రభుత్వం చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో గొప్ప స్థిరీకరణ సాధించిందన్నారు.

భారతదేశ వ్యవసాయ రంగంలోనే నూతన చరిత్రను లిఖించిందని.. గతంలో దండుగని అందరూ ఈసడించిన వ్యవసాయాన్ని పండుగలా మార్చిందని కొనియాడారు.మిషన్‌ కాకతీయతో తెలంగాణ ప్రభుత్వం చెరువులను పునరుద్ధరించింది. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసి కొత్త ఆయకట్టును అభివృద్ధిచేసింది. యుద్ధ ప్రాతిపదికన భారీ, మధ్య తరహా, చిన్న ప్రాజెక్టులను నిర్మించి.. విస్తృతంగా చెక్‌ డ్యాములను నిర్మించింది’ అని గవర్నర్‌ వెల్లడించారు.

ప్రారంభానికి ముందే తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం, తెల్లవారుజామున కలకలం, అదుపులోకి వచ్చిన మంటలు

‘తెలంగాణ ప్రభుత్వం మూడున్నరేళ్ల రికార్డు సమయంలో నిర్మించిన కాళేశ్వరం భారీ బహుళదశల ఎత్తిపోతల ప్రాజెక్టు మానవ నిర్మిత మహా అద్భుతంగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. 2014-15 కాలంలో రాష్ట్రం ఏర్పడినప్పుడు.. తెలంగాణలో కేవలం 20 లక్షల ఎకరాల సాగునీటి సౌకర్యాలు మాత్రమే ఉండేవి. ఆ సౌకర్యాలు ఇప్పుడు 73 లక్షల 33 వేల ఎకరాలకు పెరిగింది. కోటి ఎకరాలకు సాగునీటిని సమకూర్చే లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం ధృఢ నిశ్చయంతో ఉంది. ఈ లక్ష్యం తర్వలోనే సాకారమువుతుంది’ అని అన్నారు.

‘తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన చారిత్రాత్మకమైన రైతు బంధు పథకం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందింది. ఐక్యరాజ్య సమితి విశ్వవేదిక మీద ఈ పథకాన్ని కొనియాడింది. 75 ఏళ్ల భారతదేశ చరిత్రలో 65లక్షల మంది రైతులకు 65 వేల కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని పంట పెట్టుబడి సాయం కింద అందించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని నేను సగర్వంగా ప్రకటిస్తున్నా’ అని గవర్నర్‌ తన ప్రసంగంలో వెల్లడించారు.

‘రైతు బీమా పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల రూపాయల జీవిత బీమాను రైతు కుటుంబాలకు అందిస్తోంది. రైతులపై నయాపైసా భారం వేయకుండా ప్రీమియం మొత్తాన్ని ఎల్‌ఐసీ సంస్థకు ప్రభుత్వమే చెల్లిస్తోంది. రైతులకు ఇటువంటి బీమా సదుపాయం ప్రపంచంలో మరెక్కడా లేదని నేను ఘంటాపథంగా చెప్పగలను. అప్లికేషన్‌ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా బీమా మొత్తాన్ని రైతు మరణించిన పది రోజుల్లోనే వారి కుటుంబాలకు ప్రభుత్వం అందజేస్తోంది. తద్వారా రైతు సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది’ అని అన్నారు.

‘2014-15లో 68.17 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉన్న ధాన్యం ఉత్పత్తి.. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమ చర్యల వల్ల ఇప్పుడు రెండు కోట్ల రెండు లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరుకుంది. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. తద్వారా రైతుకు అన్ని దశల్లోనూ అండదండగా నిలుస్తోంది. మన రాష్ట్ర జీఎస్‌డీపీలో 18.2 శాతం వ్యవసాయరంగం నుంచే సమకూరుతోంది. రాష్ట్రంలో వచ్చిన వ్యవసాయ అభివృద్ధి గురించి దేశవ్యాప్తంగా నేడు రైతులు చర్చించుకుంటున్నారు’ అని బడ్జెట్‌ ప్రసంగంలో గవర్నర్‌ వివరించారు.