Drinking Water to TN: తమిళనాడు రాష్ట్ర ప్రజల దాహార్థి తీర్చనున్న తెలుగు రాష్ట్రాలు, తమిళనాడుకు తాగునీరు ఇవ్వడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ అంగీకారం, ఏపీ సీఎం జగన్‌తో సంప్రదింపులు
Tamil Nadu Ministers Meet With Telangana CM KCR | Official Photo

Hyderabad, March 6: వేసవి వచ్చిందంటే ప్రజల దాహార్థిని తీర్చడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రానికి తాగునీరు ఇవ్వడానికి (Drinking Water Share) తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (Telangana CM KCR) సూత్రప్రాయంగా అంగీకరించారు. హైదరాబాద్ లోని సీఎం కార్యాలయం ప్రగతిభవన్ లో తమిళనాడు మంత్రులు ఎస్పీ వేలుమణి, డి. జయకుమార్, పబ్లిక్ వర్క్ శాఖ కార్యదర్శి డాక్టర్ కె. మణి వాసన్, సలహాదారు శ్రీమతి ఎం. షీలా ప్రియ తదితరులు సీఎం కేసీఆర్ తో భేటీ అయి తమ రాష్ట్రానికి తాగునీరివ్వాలని అభ్యర్థించారు.

వారి అభ్యర్థనపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ, ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో కూడా సంప్రదింపులు జరపాల్సి ఉన్నందున, తమిళనాడు ముఖ్యమంత్రి నుంచి అధికారికంగా తమ ఇరు రాష్ట్రాలకూ లేఖలు రాయాలని వారికి సూచించారు. అనంతరం మూడు రాష్ట్రాల అధికారులు, నిపుణుల స్థాయిలో సమావేశం జరపాలని, ఆ సమావేశంలో చర్చించిన అంశాల ఆధారంగా ఒక నివేదిక తయారు చేయాలని కోరారు. తుది నిర్ణయం తీసుకోవడానికి అధికారులంతా ఏకాభిప్రాయానికి రావాలన్నారు. అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. ఈ కార్యాచరణ సిద్ధమైతే నీటి విషయంలో పరస్పర సహాకారం సాధించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాలు దేశానికే ఆదర్శంగా మారుతాయని సీఎం కేసీఆర్ అన్నారు.

తాగునీటి సమస్యల పరిష్కారం విషయంలో రాష్ట్రాల మధ్య సహన పూరితమైన వాతావరణం ఉండాలని, పొరుగు రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ఉండాలని కేసీఆర్ అన్నారు. తమిళనాడు తాగునీటి సమస్యను నీతి ఆయోగ్ సమావేశాల్లో తాను పలుమార్లు లేవనెత్తానని సీఎం కేసీఆర్ అన్నారు. ఇదే విషయంపై లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీలు కూడా రెండుమూడుసార్లు మాట్లాడారన్నారు.

దేశంలో లభించే మొత్తం 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉందని కేసీఆర్ చెప్పారు. ఇందులో దేశం మొత్తానికి సాగునీటి అవసరాలు తీర్చిన తర్వాత కూడా మరో 30 వేల టీఎంసీల నీరు మిగిలే ఉంటుందని తెలిపారు. కేవలం 10 వేల టీఎంసీల నీరు దేశం మొత్తం తాగునీటి అవసరాలకు సరిపోతుందని అన్నారు. అయినప్పటికీ, తాగునీటి సమస్యతో తమిళనాడు బాధపడుతుందంటే అది దేశానికే సిగ్గుచేటు అని కేసీఆర్ అన్నారు.

తాగునీటి విషయమై తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక వ్యూహాన్ని కలిగి ఉండాలని ఆ రాష్ట్ర ప్రతినిధి బృందానికి సీఎం కేసీఆర్ సూచించారు. అత్యంత ప్రాధాన్యతా అంశమైన తమిళనాడు తాగునీటి అవసరాలపై దేశవ్యాప్తంగా అవగాహన అవసరమనీ, అందరూ సహృదయంతో అర్ధం చేసుకున్ననాడే ఈ సమస్య పరిష్కారమవుతుందన్నారు. పొరుగురాష్ట్ర ముఖ్యమంత్రిగా, భారతీయుడిగా తమిళనాడుకు సహాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని సీఎం కేసీఆర్ అన్నారు.

తమిళనాడుకు తాగునీటి కోసం ఆ రాష్ట్ర ప్రతినిధి బృందం అభ్యర్థన గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి (AP CM YS Jagan) ఫోన్ చేసి చెప్పారు. ఇందుకు తాను సూత్రప్రాయంగా అంగీకరించిన విషయాన్ని, ఈ సమస్య పరిష్కారం కోసం తమిళనాడు ప్రతినిధి బృందం సభ్యులకు తాను ఇచ్చిన సూచనలను జగన్ కు వివరించారు. తమిళనాడులో తాగునీటి బాధలు తెలిసిన విషయమే కాబట్టి, ఆ రాష్ట్రానికి నీరందించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కు తెలిపారు.

తమిళనాడు బృందం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసి, ఈ విషయంపై అభ్యర్థించారు. అందుకు సీఎం జగన్ కూడా సానుకూలంగా స్పందించారు. గోదావరి- కృష్ణా మరియు వాటి ఉపనదుల ద్వారా తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ నీటి వాటాల నుంచి తమిళనాడు ప్రభుత్వం ఇప్పుడు వచ్చే ఏప్రిల్ నెల నుంచి 2 టీఎంసీల నీరు తమిళనాడు రాష్ట్ర తాగునీరు అవసరాల కోసం కోరుతోంది.

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమిళనాడు అభ్యర్థనకు సానుకూలంగా స్పందించారు. అయితే ఎన్ని టీఎంసీలు కేటాయించాలి, నీటి పంపిణీపై సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత దీనిపై అడుగు ముందుకు పడనుంది.