Hyderabad, June 28: నూతన ఆర్థిక విధానాల రూపశిల్పి, బహుభాషాకోవిదుడు, స్థిత ప్రజ్ఞుడుగా పేరుగాంచిన భారతదేశ పూర్వ ప్రధాని పి.వి. నరసింహారావు జయంతి నేడు. జూన్ 28, 1921న అప్పటి హైదరాబాద్ రాష్టం (ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం), కరీంనగర్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో, బ్రాహ్మణ కుటుంబంలో పీవీ నరసింహారావు జన్మించారు.
భారతదేశం ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలే ఎన్నుకునే ప్రజాస్వామ్య దేశం. ఇది చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుంది. కానీ ఈ దేశంలో సామాన్యుడు గద్దెనెక్కడం అనేది అంతా ఓ భ్రమ. పేరుకు ప్రజాస్వామ్య దేశమే అయినా, రాచరికాన్ని తలపించేలా పాలన మొత్తం తరతరాలుగా ఏదో ఒక్క కుటుంబం చేతిలోనే ఉంటుందనేది భారతీయులందరికీ తెలిసిన సత్యం. అయితే ఆ ఆనవాయితీని ఛేదిస్తూ, 1991వ సంవత్సరంలో మొట్టమొదటి సారిగా దక్షిణ భారత దేశం నుంచి ఒకవ్యక్తి, అందులోనూ తెలుగు వాడు అయిన పీవీ నరసింహారావు (P.V Narasimha Rao) దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
కానీ ఆ సమయం నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించి, పేదరికం పెరిగిపోయి, అత్యంత క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. అంతా శూన్యం, దేశాన్ని ఎలా ముందుకు నడిపించాలో దిక్కుతోచని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో పదవీ బాధ్యతలు స్వీకరించిన పీవీ తనదైన ఆలోచనలతో, ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశానికి ఒక దశా-దిశా ఇచ్చి తన సత్తా ఎంటో చూపించారు. దేశ ఆర్థికవ్యవస్థను ఒకగాడిలోకి తీసుకురాగలిగారు. ప్రజల్లోఆర్థిక భద్రత, ఒక నమ్మకం కల్పించడంలో పీవీ ఎంతో కృషి చేశారు. అందుకే ఆర్థిక సంస్కరణల జాతిపిత (father of Indian economic reforms) గా పీవీ నరసింహా రావు కీర్తి గడించారు.
అంతేకాదు.. ఒక గొప్ప వ్యూహకర్త, అపర చాణక్యుడిగా పేరు. ఎంతటి ప్రత్యర్థులనైనా తన రాజకీయ చాణక్యంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఓడించగల నేర్పరి. మంచి రాజనీతిజ్ఞుడిగా కూడా పేరు, ప్రత్యర్థి పార్టీల నుంచి కూడా నెం.1 ప్రధానమంత్రిగా ప్రశంసలు అందుకున్న ఏకైక వ్యక్తి పీవీ.
పీవీకి అనేక భాషలలో ప్రావీణ్యం ఉంది. తెలుగు, ఉర్దూ, అరబిక్, హిందీ, మరాఠీ, ఒరియా, కన్నడ, తమిళం, సంస్కృతంలతో పాటు ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, జెర్మన్ మరియు పర్షియన్ లాంటి విదేశీ భాషలలో మంచి పట్టు ఉండేది. మొత్తంగా 17 భాషలలో అనర్గళంగా ప్రసంగించేవారు. (పీవీ గురించి పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
అందరి రాజకీయ నేతల జీవితాల్లో ఏదో ఒక మరక ఉన్నట్లే పీవీ నరసింహా రావు రాజకీయ జీవితానికి కూడా అంటుకున్న అవినీతి మరకలు ఆయన కీర్తిని మసకబరిచాయి. కానీ దేశ ప్రయోజనాల విషయంలో పీవీ నిజమైన కృషి చేశారు, నవభారత నిర్మాణానికి ఆయన రూపకల్పన చేశారు. ఎంత చేసినా, ఆయనకు దక్కాల్సిన గౌరవం దక్కలేకపోయింది.
నేడు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 'పీవీ తెలంగాణ ఠీవీ' అనే నినాదంతో ఏడాది కాలంగా పీవీ శత జయంతుత్సవాలను నిర్వహిస్తూ వస్తుంది. ఈరోజు పీవీ నరసింహా రావు 100వ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులో ముగింపు ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే నెక్లెస్ రోడ్డును 'పీవీ మార్గ్' గా నామకరణం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఈరోజు ఆ ప్రాంతంలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించింది. సోమవారం ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ విగ్రహావిష్కరణ చేయనున్నారు. ఈ వేడుకలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొననున్నారు.