COVID19 Outbreak in Telangana. | Photo: Twitter

Hyderabad, July 2: తెలంగాణ రాష్ట్రంలో గురువారం భారీ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే మొత్తం 1213 మంది కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. ఇప్పటివరకు ఒకరోజులో నమోదైన మొత్తం కేసుల్లో ఇదే అత్యధికమైన సంఖ్య. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 18,570కి చేరుకుంది.

ఇక హైదరాబాద్ నగరంలో పరిస్థితులు రోజురోజుకు దారుణంగా తయారవుతున్నాయి. ప్రతీరోజు వందల సంఖ్యలో నమోదవుతున్న పాజిటివ్ కేసులు నగరవాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రాష్ట్రంలో జిల్లాల నుంచి వచ్చే కేసులు తక్కువగానే ఉంటున్నా, దాదాపు మొత్తం కేసులన్నీ హైదరాబాద్ లోనే ఉంటున్నాయి. గురువారం నమోదైన కేసుల్లో కూడా ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 998 మందికి కరోనావైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.

ఇక నగరానికి ఆనుకొని ఉండే మేడ్చల్ , రంగారెడ్డి జిల్లాల నుంచి వరుసగా 54 మరియు 48 చొప్పున కేసులు నమోదు కాగా, ఖమ్మం నుంచి 18, వరంగల్ రూరల్ నుంచి 10 కేసుల చొప్పున నమోదయ్యాయి.

మరోవైపు, ప్రతిరోజు కొన్ని జిల్లాలకే పరిమితమైన పాజిటివ్ కేసులు, నేటి రిపోర్టును పరిశీలిస్తే మరిన్ని జిల్లాలకు వ్యాప్తి చెందినట్లు స్పష్టమవుతోంది. గురువారం ఏకంగా 26 జిల్లాల నుంచి కేసులు నమోదయ్యాయి.

ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి

Status of positive cases of #COVID19 in Telangana

 

కేసుల సంఖ్య ఇలా ఉంటే, గత 24 గంటల్లో మరో 8 కోవిడ్ మరణాలు సంభవించాయి.  దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 275 కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో మరో 987 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 9,069 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,226 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

గత 24 గంటల్లో 5,356 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 98,153 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.