Farmers’ Protest: మ‌రోసారి ల‌క్ష‌లాది ట్రాక్ట‌ర్ల‌తో పార్లమెంట్‌ను ముట్టడిస్తాం, డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని రైతు సంఘాల నేతలు హెచ్చరిక, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌పై మండిపడిన బీకేయూ నేత రాకేశ్‌ తికాయిత్
Rakesh Tikait Photo-ANI)

Sheopur, Mar 9: కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో రైతులు చేస్తోన్న ఆందోళ‌న కొన‌సాగుతోంది.నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు పలు రకాలుగా తమ నిరసనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాలలో సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.ఢిల్లీ బోర్డర్ లో, దేశ రాజధాని ఢిల్లీ నుంచి తమ ఉద్యమాన్ని రాష్ట్రాలకు మళ్లించారు.

రైతుల ఆందోళన వంద రోజులు పూర్తయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలో త‌మ డిమాండ్‌ను నెర‌వేర్చ‌క‌పోతే మ‌రోసారి ల‌క్ష‌లాది ట్రాక్ట‌ర్ల‌తో నిర‌స‌న (Will Reach Parliament On Lakhs Of Tractors) తెలుపుతామ‌ని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ తికాయిత్ (Bharatiya Kisan Union leader Rakesh Singh Tikait) హెచ్చ‌రించారు. ట్రాక్టర్లతో పార్లమెంటును ముట్టడించడానికి సిద్ధమ‌ని ప్ర‌క‌టించారు.

మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లో నిర్వహించిన భారీ ర్యాలీలో (Farmers’ Protest) ఆయ‌న మాట్లాడుతూ... తాము జ‌న‌వ‌రి 26న 3,500 ట్రాక్టర్లతో ఢిల్లీలోకి ప్రవేశించామ‌ని గుర్తు చేశారు. ఆ ట్రాక్టర్ల‌న్నీ అద్దెకు తెచ్చిన ట్రాక్టర్లు కావని చెప్పారు.మధ్యప్రదేశ్ బీజేపీ నేత, కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్ కు ఎలాంటి అధికారాలు లేవని ఆయ‌న ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆయన సొంతంగా రైతుల‌కు ఎప్పుడూ సమాధానం ఇవ్వలేరని చెప్పారు. చర్చలకు కూడా ప‌లు ప‌త్రాలు పట్టుకుని వస్తార‌ని, వాటి ఆధారంగానే రైతుల‌కు సమాధానాలు ఇస్తారని ఎద్దేవా చేశారు.

భారత రైతు ఉద్యమంపై బ్రిటీష్ పార్ల‌మెంట్‌లో చ‌ర్చ, అంశాలపై చర్చను తప్పు బట్టిన భార‌తీయ హై క‌మీష‌న్, అతిపెద్ద ప్ర‌జాస్వామ్య దేశంపై అనుచిత ఆరోప‌ణ‌లు చేస్తున్నారని మండిపాటు

మీరు ఎన్నుకున్న నేత సొంతగా నిర్ణయాలు తీసుకోలేరని, రైతులతో సమావేశాలకు కూడా ఆయన ఫైల్ పట్టుకొని వచ్చారని వాటి ఆధారంగానే సమాధానం ఇస్తారని టికాయత్ తీవ్ర విమర్శలు చేశారు. కాగా, మధ్యప్రదేశ్ పర్యటన సందర్భంగా ఈ నెల 14న రెవాలో, మార్చి 15న జబల్‌పూర్‌ ప్రాంతాల్లో రైతు ర్యాలీల్లో రాకేశ్ పాల్గొంటారు. అనంత‌రం తెలంగాణ‌తో పాటు ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌, కర్ణాటకకు ఆయ‌న వ‌చ్చి రైతుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతారు.

రిపబ్లిక్ డే రోజు 3500 ట్రాక్టర్లతో కిసాన్ పెరేడ్ నిర్వహించామని గుర్తు చేసిన రాకేష్ టికాయత్ మూడు సాగు చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తూ రైతులు మరోమారు ప్రదర్శనలు చేయడానికి రెడీగా ఉన్నారన్నారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రైతులు భావిస్తున్నారు. దేశ వ్యాప్తంగా మద్దతు కోసం రైతు మహా పంచాయితీలు, ఉధృతం చేస్తున్న ఆందోళనలు ప్రస్తుతం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న రైతులు మద్దతును కూడగడుతున్నారు. కాగా గ‌ణ‌తంత్ర దినోత్సవం నాడు రైతులు ట్రాక్ట‌ర్లతో పెద్ద ఎత్తున నిర‌స‌న‌ల‌కు దిగ‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితులు చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే.

రైతుల ఉద్యమానికి విదేశీ సెలబ్రీటీల మద్దతు, సీరియస్ అయిన కేంద్ర ప్రభుత్వం, వాస్తవాలు తెలుసుకోవాలంటూ బాలీవుడ్ సెలబ్రిటీలు ఘాటు రిప్లయి

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేపట్టిన నిరసన కొనసాగుతోంది. టిక్రి బోర్డర్‌లో నిరసనలు జరుగుతున్న చోటు నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఓ చెట్టుకు ఉరివేసుకుని హర్యానాలోని హిసార్‌ జిల్లా సిసాయి గ్రామానికి చెందిన రైతు (49) ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఉద్యమిస్తున్న బాధిత రైతును రాజ్‌వీర్‌ సింగ్‌గా గుర్తించారు. రైతు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం కోసం తరలించారు.

తన త్యాగం వృధా కాకుండా పోరుబాటలో ముందుకు సాగాలని బాధిత రైతు విడిచిపెట్టిన సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడని బహదూర్‌గఢ్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారి విజయ్‌ కుమార్‌ తెలిపారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేసి మద్దతు ధరకు భరోసా కల్పిస్తేనే నిరసనల నుంచి వైదొలగాలని బాధిత రైతు కోరాడని చెప్పారు. మరోవైపు హర్యానాలోని జింద్‌ ప్రాంతానికి చెందిన మరో రైతు (52) కూడా చెట్టుకు వేలాడుతూ విగతజీవిగా మారాడని పోలీసులు తెలిపారు.

ఇక వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ)‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) సభ్యులు సోమవారం పంజాబ్‌ అసెంబ్లీ ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. వ్యవసాయ చట్టాల తొలగింపుతో పాటు మండుతున్న ధరలకు వ్యతిరేకంగా వారు ఆందోళన నిర్వహించారు. పంజాబ్‌ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బడ్జెట్‌లో వీటిని పొందుపరచాలని శిరోమణి అకాలీదళ్‌ సభ్యులు నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ ప్రసంగానికి అడ్డుతగిలి సభలో తీవ్ర గందరగోళం చెలరేగేలా వ్యవహరించినందుకు శుక్రవారం శిరోమణి అకాలీదళ్‌ సభ్యులందరినీ బడ్జెట్‌ సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్‌ చేశారు. ఇక పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తాము చేసిన వాగ్ధానాలన్నింటినీ చాలా వరకూ నెరవేర్చామని సీఎం అమరీందర్‌ సింగ్‌ చేసిన ప్రకటనను విపక్ష సభ్యులు వ్యతిరేకించారు.