Engili-Pula-Bathukamma-wishes_3.jpg

తెలంగాణ సంస్కృతిలో అతి ముఖ్యమైన పండుగ బతుకమ్మ. ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున ఈ పండుగ ప్రారంభమవుతుంది. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ వేడుకలో పూలకు, ప్రకృతికి, స్త్రీ శక్తికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సారి బతుకమ్మ పండుగ సెప్టెంబర్ 21న ఆదివారం అమావాస్యతో ప్రారంభమైంది. మొదటి రోజు జరిపే ఉత్సవాన్ని ఎంగిలి పూల బతుకమ్మ లేదా చిన్న బతుకమ్మ అని పిలుస్తారు.

బతుకమ్మలో తొలి రోజు ఏర్పాటు చేసే పూలు సాధారణంగా అందుబాటులో ఉన్న చిన్న పూలే. వీటిని పెద్దగా అలంకరించకుండా సరళంగా పేర్చి పండుగ ప్రారంభిస్తారు. వీటిని ఎంగిలి పువ్వు అని అంటారు. మొదటి రోజున తయారుచేసే బతుకమ్మ పరిమాణం చిన్నదిగా ఉండటం వల్ల దీనిని చిన్న బతుకమ్మ అని కూడా పిలుస్తారు. ఈ విధంగా ఎంగిలి పువ్వు బతుకమ్మతో పండుగ ఆరంభమై, చివరి రోజు సద్దుల బతుకమ్మతో మహోత్సవం ఘనంగా ముగుస్తుంది.

బతుకమ్మ పండుగలో ప్రధాన ఉద్దేశ్యం.. ప్రకృతి, పూలను దైవంగా ఆరాధించడం. తెలంగాణ మహిళలు ఈ తొమ్మిది రోజులలో ప్రతిరోజూ వివిధ రకాల పూలతో బతుకమ్మ పేర్చి, గీతాలు పాడుతూ, ఆటలతో ఆనందంగా గడుపుతారు. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాకుండా సాంస్కృతిక ఐక్యతకు ప్రతీకగా బతుకమ్మ పండగను చెబుతారు.

ఏపీలో సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు, తెలంగాణలో సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 3 వరకు సెలవులు

ప్రతి రోజు బతుకమ్మకు ప్రత్యేక నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ. ఇవన్నీ స్థానిక పంటలతో తయారు చేస్తారు. ముఖ్యంగా మొక్కజొన్న, జొన్న, సజ్జ, బియ్యం వంటి ధాన్యాలతో పాటు మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు వంటివి కలిపి నైవేద్యం సిద్ధం చేస్తారు. దీని ద్వారా గ్రామీణ జీవన విధానం, వ్యవసాయ పద్ధతులు, ఆహార సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయి.

తెలంగాణలో బతుకమ్మ పండుగ రోజుల్లో పూలకు పెద్దపీట ఉంటుంది. కేరళలో ఓనం పండుగ రోజున పూలతో ముగ్గులు వేయడం ఒక ముఖ్య ఆనవాయితీ అయితే, తెలంగాణలో పూలను గోపురం ఆకారంలో అమర్చడం బతుకమ్మ ప్రత్యేకత. వివిధ రంగుల అడవి పూలను, వనమూలికలను వాడుతూ బతుకమ్మను తీర్చిదిద్దుతారు. వాటిలో గున్నెపువ్వు, తంగెడుపువ్వు, బంతి, చామంతి, గన్నెపువ్వు వంటివి ప్రధానంగా ఉపయోగిస్తారు.

బతుకమ్మ పేర్చడానికి అవసరమైన పూల కోసం మహిళలు, పిల్లలు పొలాలు, చెట్లు, గట్లు తిరుగుతూ సేకరిస్తారు. తీరొక్క పూలన్నీ కోసి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. ఇందులో ఎక్కువగా తంగేడు పూలు, గునుగు, తామర పూలు, చామంతి, బంతి, సీత జడలు ఎక్కువగా ఉంటాయి. బతుకమ్మ కోసం ముందు రోజుగానే పూలు తెచ్చి నీళ్లు చల్లి ఉంచుతారు. పూలు నిద్ర చేస్తాయి కాబట్టి ఎంగిలి పూలు అంటారని కొంత మంది మహిళలు పేర్కొన్నారు.

మరికొందరు ఏమంటారంటే పితృ పక్ష అమావాస్య రోజు చాలా మంది తమ పెద్దలను, పూర్వీకులను తలుచుకుంటూ తర్పణాలు ఇస్తుంటారు. ఆ రోజున భోజనం చేసిన తర్వాత బతుకమ్మ తయారు చేస్తారు కాబట్టి ఎంగిలి పడటం అంటారని చెప్పారు. ఈ మహాలయ పితృపక్ష అమావాస్యను తెలంగాణ ప్రజలు పితృ పక్ష అమావాస్య, పితృఅమావాస్య, పెత్రమాస అని పిలుస్తుంటారు.

తొమ్మిది రోజుల బతుకమ్మ నైవేద్యాలు ఇవే..

1వ రోజు: ఎంగిలి పూల బతుకమ్మ (చిన్న బతుకమ్మ): నువ్వులు, బియ్యంపిండి, నూకలు

2వ రోజు: అటుకుల బతుకమ్మ: సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు

3వ రోజు: ముద్దపప్పు బతుకమ్మ: ముద్దపప్పు, పాలు, బెల్లం

4వ రోజు: నానబియ్యం బతుకమ్మ: నానేసిన బియ్యం, పాలు, బెల్లం

5వ రోజు: అట్ల బతుకమ్మ: అట్లు, దోసెలు

6వ రోజు: అలిగిన బతుకమ్మ: నైవేద్యం ఉండదు

7వ రోజు: వేపకాయల బతుకమ్మ: బియ్యంపిండి వేయించి వేపపండ్లుగా తయారు చేసి సమర్పిస్తారు

8వ రోజు: వెన్నముద్దల బతుకమ్మ: నువ్వులు, నెయ్యి, బెల్లం

9వ రోజు: సద్దుల బతుకమ్మ (పెద్ద బతుకమ్మ): ఐదురకాల నైవేద్యాలు – పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరన్నం, నువ్వులన్నం