Eid Milad Wishes

Eid Milad Un Nabi 2025: మౌలిద్ లేదా మీలాద్ అని పిలిచే ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ పండుగ ఇస్లాం మతంలో అత్యంత ప్రాముఖ్యత గల పండుగలో ఒకటి. “మౌలిద్” అనే అరబ్బీ పదం “జననం” అనే అర్థాన్ని కలిగి ఉంది. కాబట్టి ప్రవక్త మహమ్మద్ జన్మదినాన్ని ముస్లింలు ఈ పేరుతో ఆరాధన, ప్రార్థనలతో జ్ఞాపకం చేసుకుంటారు. కేవలం ప్రవక్తలే కాదు, ఆధ్యాత్మిక గురువులు, ఔలియాల జన్మదినాలను కూడా మౌలిద్ రూపంలో జరుపుకుంటారు. భారతదేశంలో సాధారణంగా జరుపుకునే ఉరుసు ఉత్సవాలు కూడా ఇదే కోవకు చెందినవే.

ఇస్లామిక్ క్యాలెండర్‌లో మూడో నెల అయిన రబీ అల్-అవ్వాల్‌లో ఈ పండుగను నిర్వహిస్తారు. ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ ప్రకారం.. అల్లాహ్ విశ్వ శాంతి కోసం మహమ్మద్‌ను ఆఖరి ప్రవక్తగా పంపాడు. ఆయన కేవలం ముస్లింలకే కాకుండా, సకల జీవరాశులకు, విశ్వానికి మార్గదర్శకుడని ముస్లింలు నమ్ముతారు. ప్రవక్త మహమ్మద్ 570 క్రీ.శ.లో సౌదీ అరేబియాలోని మక్కాలో జన్మించారు. 632 క్రీ.శ.లో ఆయన పరమపదించారు. ఆయన పుట్టిన రోజు తేదీనే మరణం సంభవించిందని ముస్లిం సమాజం విశ్వసిస్తోంది. అందువల్ల ముస్లింలు ఈ రోజును ఆయన జన్మస్మరణదినంగా భావించి ప్రార్థనలతో, ప్రవక్త ఉపన్యాసాలతో, సేవా కార్యక్రమాలతో జరుపుకుంటారు.

మహ్మద్ ప్రవక్త పుట్టిన రోజు, అలాగే మరణించిన రోజే ఈద్ మిలాద్-ఉన్-నబి, మానవులందరికీ ప్రేమ, ఐక్యత సందేశాన్ని వ్యాప్తి చేసిన ప్రవక్త

ఈ రోజు మసీదులు ప్రత్యేకంగా అలంకరించబడతాయి. ఖురాన్ పఠనం, మతపరమైన ప్రసంగాలు, రాత్రి ప్రార్థనలు విస్తృతంగా నిర్వహిస్తారు. ఆకుపచ్చ జెండాలు, రిబ్బన్లు, బ్యానర్లు ఊరేగింపులో ప్రదర్శించబడతాయి. పేదలకు అన్నదానం, దానధర్మాలు చేస్తారు. అయితే ఈ పండుగపై ముస్లింలలో వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి. సున్నీలు ఈ రోజును పర్వదినంగా ఆచరిస్తే, షియాలు మరింత వైభవంగా జరుపుకుంటారు. కానీ సలాఫీలు, వహాబీలు మాత్రం ఈ రోజును పర్వదినంగా పాటించరు. వారి అభిప్రాయం ప్రకారం, ప్రవక్త పుట్టిన రోజును పండుగలా జరపడం అనవసరమని భావిస్తారు.

ముస్లింల చాంద్ర మాన క్యాలండర్ ప్రకారం ఈద్ మిలాద్-ఉన్-నబీ వారి రబీవుల్ అవ్వల్ మాసంలో జరుపుకుంటారు. ముస్లింల విశ్వాసం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ చివరి ప్రవక్త.మిలాద్-ఉన్-నబీ అనే పండుగను మావ్లిద్ అన్-నబీ పండుగ అని కూడా పిలుస్తారు. ఇలాంటివి వేర్వేరు అభిప్రాయాలు ఉన్నప్పటికీ, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ముస్లింలు ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీని ఒక ఆధ్యాత్మిక దినంగా, విశ్వ శాంతికి అంకితమైన రోజుగా భావిస్తారు. ఆయన ఉపదేశాలు, జీవన విధానం, సేవాగుణం ఈ రోజు ప్రత్యేకంగా స్మరించుకుంటారు.