Rottela Panduga 2020 Cancelled: రొట్టెల పండుగ రద్దు, 20 మందితో గంధ మహోత్సవం, నెల్లూరు బారాషహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగ, కరోనావైరస్ నేపథ్యంలో రద్దు చేస్తున్నామని తెలిపిన కలెక్టర్ చక్రధర్ బాబు
Rottela Panduga (photo-Twitter)

Nelllore, August 29: ఏటా ఏపీలోని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగే రొట్టెల పండుగ ఈ సారి రద్దైంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రొట్టెల పండుగను రద్దు (Rottela Panduga 2020 Cancelled) చేస్తూ నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. ఇక రొట్టెల పండుగలో కీలక ఘట్టమైన గంధ మహోత్సవంను కూడా 20 మందితో జరపాలని తెలిపారు. కాగా మొహర్రం సందర్భంగా నెల్లూరులోని బారాషహీద్ దర్గా, స్వర్ణాల చెరువు సాక్షిగా ప్రతి సంవత్సరం రొట్టెల పండుగ (Rottela Panduga) జరిగేది. ఇక్కడ రొట్టె పడితే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం.

కులమతాలకు అతీతంగా సాగే ఈ పండుగకు దేశం నలుమూలల నుంచి భక్తులు హాజరవుతుంటారు. ఇక 2015లో ఈ పండుగను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించడంతో పాటు ఏర్పాట్లు ఘనంగా చేస్తుండటంతో భక్తుల రాక పెరిగింది. కాగా ఈ ఏడాది ఆగష్టు 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు రొట్టెల పండుగ (Rottela Panduga 2020) జరగాల్సి ఉంది. భక్తులు ఎవరూ‌ రావొద్దని, ఇళ్ల వద్దే పండుగ జరుపుకోవాలని అధికారులు సూచించారు.

మొహరం పర్వదినాల్లో హిందూ ముస్లిములు కలిసి నెల్లూరు చెరువు బారా షహీద్ దర్గా (Barashaheed Dargah In Nellore) వద్ద వివిధ కోర్కెలు కోరుతూ, నెరవేరిన కోర్కెల కోసం మొక్కులు తీర్చుకుంటూ రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటూ జరుపుకునే ఈ పండుగను రొట్టెల పండుగ అంటారు. ఈ రొట్టెల పండుగలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. మూడు రోజుల పాటు జరిగే రొట్టెల పండుగలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి వేలాది భక్తులు పాల్గొంటారు.

YS Jagan participated in the traditional ritual 'Rottela panduga in 2016

TDP N Chandrababu Naidu participated in the traditional ritual 'Rottela panduga in 2016

Pawan Kalyan offering prayers at BaraShaheedDarga in 2018

పండుగ పూర్వాపరాల్లోకి వెళితే.. ఆర్కాటు నవాబు కోరిక నెరవేరడంతో మరుసటి ఏడాది దర్గాకు వచ్చి కృతజ్ఞత తెలియజేస్తూ, స్వర్ణల చెరువులో రొట్టె విడిచినట్లు ఒక కథనం ఉంది. ఆ సంఘటనానంతరమే రొట్టెలపండుగ మొదలైందని పెద్దలు చెపుతుంటారు. 1930 లలో ఈ రొట్టెల పండుగ మొదలై క్రమం తప్పకుండా జరుగుతూ, స్థానిక పత్రికలలో నమోదు అయివున్నట్లు తెలుస్తుంది. ఇంటిలో తయారు చేసుకొచ్చిన చపాతీలు (రొట్టెలు) చెరువు లోని నీళల్లో దిగి తలపై ముసుగువేసుకొని భక్తులు మార్పిడి చేసుకుంటారు.

Some Tweets in Rottela panduga 

ఆరోగ్యం గురించి మొక్కు కొంటే ఫలితం కనిపిస్తే మరుసటి ఏడాది ఆరోగ్య రొట్టెకావాల్సిన వారికి పంచి మొక్కు చెల్లిస్తారు.ఇలాగే విద్యా రొట్టె, పెళ్ళి రొట్టె, సౌభాగ్య రొట్టె, సంతాన రొట్టె, వీసా రొట్టె, అభివృద్ధి రొట్టె, సమైక్యాంధ్ర రొట్టె...ఇలా ఎన్నోరకాల రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటారు. వివిధ కోర్కెలకు సంబంధించి స్వీకరించుకున్న రొట్టెలకు బదులుగా తిరిగి మరుసటి సంవత్సరం ఒకటికి రెండు రొట్టెల చొప్పున ఈ స్వర్ణాల చెరువు వద్ద భక్తులకు పంచుతారు. మిగిలిన వాటిని ఈ చెరువులో వదిలేస్తారు.

ఇది ఫలానా కోర్కెకు సంబంధించిన రొట్టె అని సులభంగా గుర్తించేందుకు అక్కడ బ్యానర్లు ఏర్పాటు చేస్తారు. మత సామరస్యానికి ప్రతీకగా జరిగే ఈ రొట్టెల పండుగలో రొట్టెలు మార్పిడి చేసుకొన్నభక్తులు జిల్లా లోని కసుమూరు, అనుమసముద్రం పేటలలోని దర్గాలను కూడా సందర్శిస్తారు. చెరువు వద్ద వున్న ఎపి పర్యాటకం వారు ఏర్పాటు చేసే బోటు షికారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రొట్టెల పండుగ జరిగే సమయంలోనే బారా షహీద్ దర్గాలో గంధ మహోత్సవం జరుగుతుంది.

Some Tweets in Rottela panduga 

ఆర్కాటు నవాబుల కాలంలో నెల్లూరు చెరువు వద్ద రజకులు బట్టలు ఉతికేవారు. ఈ సందర్భంలో రజకులైన భార్యాభర్తలు చెరువులో బట్టలు ఉతుకుతుండగా పొద్దు పోవడంతో అక్కడే నిద్రపోయారు. రజకుని భార్యకు అక్కడ సమాధులైన బారాషహీద్‌లు కలలోకి వచ్చి ఆర్కాటు నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతుంది, సమాధుల ప్రక్కనున్న మట్టిని తీసుకెళ్ళి ఆమె నుదిటిపై రాస్తే కోలుకుంటుందని చెప్పారు. ఉదయాన్నే భార్యభర్తలిద్దరు గ్రామంలోకి వెళుతుండగా ఆర్కాటు నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతుంది ఆమెకు సరైన వైద్యం చేసినవారికి విలువైన బహుమతి అందజేస్తామని దండోరా వేయిస్తుంటారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న రజకుడు తన భార్యకు కలలో వచ్చిన విషయాన్ని నవాబు ఆస్ధానంలో వున్న వారికి వివరిస్తారు. దీంతో రాజు తన అనుచరులను నెల్లూరు చెరువు వద్దకు పంపి అక్కడి మట్టిని తెప్పించుకుని రాజు భార్య నుదుటిపై పూస్తారు. వెంటనే ఆమె ఆరోగ్యం కుదుట పడుతుంది. దీంతో ఆ రాజుకు పట్టలేనంత సంతోషంతో తన భార్యతో కలసి నెల్లూరు చెరువు సమీపంలోని సమాధుల వద్దకు వచ్చి బారాషహీదులకు ప్రార్థనలు చేసి, తమ వెంట తెచ్చుకున్న రొట్టెల్లో కొన్నింటిని అక్కడి వారికి పంచుతారు.

అలా అప్పటి నుండి ఈ రోజు వరకు ఆ ఆనవాయితీ ప్రకారం రొట్టెల మార్పు జరుగుతోంది. కోర్కెలు తీరిన వారు రొట్టెలను తీసుకుని దర్గా వద్ద చెరువులో తడిపి మరొకరికి ఇవ్వడం, కోర్కెలు కోరుకునే వారు వాటిని తీసుకోవడం అప్పటి నుంచి ఆచారంగా వస్తున్నది. ఇలా ఆ విధంగా రొట్టెలు మార్పు చేసుకోవడం అది రొట్టెల పండుగగా మారింది. అప్పట్లో ఈ పండుగను మొహరం నెలలోఒక్కరోజు మాత్రమే జరుపుకునేవారు. కాలగమనంలో భక్తుల తాకిడి ఎక్కువై కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొంటుండంతో ఈ పండుగ 5 రోజులుగా జరుపుకుంటున్నారు.

రెండున్నర శతాబ్దాలుగా నమ్మకానికి, మత సామరస్యానికి, ప్రతీకగా రొట్టె ల పండగ రాష్ట్రానికే ప్రతిష్టాత్మకంగా, జిల్లాకే తలమానికంగా జరుగుతోంది. అంతటి విశిష్టమైన రొట్టెల పండగకు కరోనా విపత్తు అడ్డంకిగా మారింది. ఈ నెల 30 నుంచి ఐదు రోజుల పాటు జరిగే రొట్టెల పండగ నిర్వహించాల్సి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువ కావడంతో పండగ నిర్వహణను ఈ ఏడాదికి నిలిపివేస్తూ జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దర్గా వద్దకు భక్తులు ఎవరూ రాకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

2015లో రొట్టెల పండగకు రాష్ట్ర పండగగా గుర్తింపు లభించింది. టర్కీ నుంచి మహ్మద్‌ ప్రవక్త సందేశాన్ని ప్రపంచ వ్యాప్తం చేయడంలో భాగంగా సుమారు 250 ఏళ్ల క్రితం 12 మంది మతబోధకులు భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో కొడవలూరు మండలంలోని గండవరంలో తమిళనాడు వాల్జారాజులకు, బీజాపూర్‌ సుల్తాన్‌లకు మధ్య పవిత్ర యుద్ధం జరిగింది.

ఆ యుద్ధంలో టర్కీ కమాండర్, మత ప్రచారకుడు జుల్ఫేఖార్‌ బేగ్‌తో పాటు మరో 11 మంది వీర మరణం పొందారు. వారి తలలు గండవరంలో తెగి పడగా వీరుల మొండాలను గుర్రాలు నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్దకు తీసుకువచ్చాయి. వీర మరణం పొందిన 12 మంది నెల్లూరు ఖ్వాజీకి కలలో కనపడి తమను అక్కడే సమాధి చేయాలని కోరడంతో అక్కడే సమాధులు నిర్మించారు. 12 సంఖ్యను ఉర్దూలో బారా, వీర మరణం పొందిన అమరులను ఉర్దూలో షహీద్‌లుగా పిలువబడతారు. అందుకే ఈ దర్గాకు బారాషహీద్‌ అనే పేరొచ్చిందని కథనం.

మొహర్రం నెలలో నెలవంక కనిపించిన 11వ రోజున రొట్టెల పండగ ప్రారంభమవుతుంది. తొలి రోజు షహద్‌త్‌తో ప్రారంభవుతుంది. తర్వాత రోజు గంధమహోత్సం చేస్తారు. కోటమిట్ట అమీనియా మసీదు నుంచి గంధాన్ని తీసుకొచ్చి 12 మంది షహీద్‌ల సమాధులకు లేపనం చేసి, భక్తులకు పంచుతారు. మరుసటి రోజు తమ కోర్కెలు తీరాలని భక్తులు వివిధ రకాల రొట్టెలను ఒకరికొకరు మార్చుకుంటారు. తహలీల్‌ ఫాతెహాతో పండగ ముగుస్తుంది.