
Beijing, September 15: కరోనావైరస్ ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం రేపుతోంది. వుహాన్ నగరంలో కనిపించిన ఈ వైరస్ (Coronavirus Pandemic) యావత్ ప్రపంచానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. వ్యాక్సిన్ తీసుకురావడానికి అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా అభివృద్ధి చేస్తున్న కరోనా టీకాలు (COVID-19 Vaccine Latest News Update) నవంబర్‌లో ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చైనా అంటువ్యాధుల నియంత్రణ సంస్థలోని బయోసేఫ్టీ అధికారి గ్వియ్‌జెన్ వూ తెలిపారు.
ఏప్రిల్ నెలలోనే నేను ఈ ప్రయోగాత్మక టీకా (Anti-Coronavirus Vaccines) తీసుకున్నాను. అయితే నాలో ఎటువంటి అనారోగ్యం తలెత్తలేదు. ప్రస్తుతం జరగుతున్న ఫేజ్-3 క్లీనికల్ ట్రయల్స్ ఎటువంటి ఆటంకాలు లేకండా కొనసాగుతున్నాయి. నవంబర్ లేదా డిసెంబర్‌లో టీకాలు రెడీ కావచ్చని స్థానిక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వ్యాఖ్యానించారు. అయితే టీకాల పేర్లు, ఇతర వివరాలపై మాత్రం ఆమె స్పష్టత ఇవ్వలేదు.
ప్రస్తుతం డ్రాగన్ 4 టీకాలను అభివృద్ధి చేస్తోంది. ఇవి చివరి దశ క్లీనికల్ ట్రయల్స్‌లో ఉన్నాయి. అత్యవసర సేవల సిబ్బంది కోసం జులై నెలలోనే ప్రతేక టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన చైనా ప్రభుత్వం వారికి మూడు టీకాలను ఇచ్చింది. చైనా ఆధ్వర్యంలోని సైనోఫార్మ్, మరో కంపెనీ సైనోవాక్ బయోటెక్‌లు మొత్తం మూడు టీకాలను రూపొందించాయి.
టీకా రూపకల్పన కోసం ప్రభుత్వం ప్రారంభించిన ఎమర్జెన్సీ కార్యక్రమంలో భాగంగా సదరు కంపెనీలు ఈ టీకాలను రూపొందించాయి. మరో సంస్థ కాన్‌సీనో బయోలాజిక్స్ రూపొందించిన నాలుగో టీకాను చైనా మిలటరీ కోసం వినియోగించేందుకు ప్రభుత్వం జూన్‌లో అనుమతించింది. అయితే.. ఈ ఏడాది చివరికల్లా తమ టీకా ప్రజలకు అందుబాటులోకి రావచ్చంటూ సైనోఫార్మ్ జులైలోనే ప్రకటించింది.